breaking news
boxing legend
-
రిటైర్మెంట్ ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్‌లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో బాక్సింగ్‌తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్‌ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక టైసన్ బాక్సింగ్ పంచులకే కాక ఆయన సినిమాలకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగానే సెలబ్రిటీలు అంటేనే క్రేజీ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు కనపడగానే ఒక్క ఫోటో అయినా తీసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. చదవండి: జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్ కానీ కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం సెలబ్రిటీలకు విపరీతమైన కోపం తెప్పిస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కు ఎదురైంది. దీంతో సహనం కోల్పోయిన టైసన్ సదరు యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్ విమానంలో వెళ్తుండగా ఆయన వెనుక సీట్లో కూర్చున్న యువకుడు టైసన్‌ను చూసి తెగ ఎగ్జయిట్ అయ్యి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో టైసన్ కూడా అతనితో నవ్వుతూనే మాట్లాడాడు. కానీ సదరు యువకుడు నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉండటంతో టైసన్ అభ్యంతరం చెప్పాడు. కాసేపు సైలెంట్‌గా ఉండమని కోరాడు. అయినప్పటికీ అతను వినిపించుకోకుండా నస పెట్టాడు. దీంతో కోపంతో ఊగిపోయిన టైసన్ సీట్లో నుంచి లేచి వెనకున్న యువకుడిపై పిడిగుద్దులు కురిపించాడు. టైసన్ పంచింగ్ పవర్‌కి సదరు యువకుడి తలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ #miketyson seemed to lose his cool on a #plane on Wednesday night ... repeatedly #punching a man in the face after the guy had apparently annoyed him. Video Footage: TMZ pic.twitter.com/xiy9zgdrhd — 𝘽𝙚𝙨𝙩 𝙀𝙣𝙩𝙚𝙧𝙩𝙖𝙞𝙣𝙢𝙚𝙣𝙩 𝙀𝙫𝙚𝙧🥊🔥 (@NoPlugMedia) April 21, 2022 -
బాక్సింగ్ గ్రేట్ కుమారుడికి అమెరికాలో అవమానం
-
బాక్సింగ్ గ్రేట్ కుమారుడికి అమెరికాలో అవమానం
బాక్సింగ్‌కు మారుపేరైన మహ్మద్ అలీ కుమారుడికి అమెరికాలోని ఒక విమానాశ్రయంలో తీవ్ర అవమానం ఎదురైంది. జమైకా పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయనను ఫ్లోరిడా విమానాశ్రయంలో అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. కేవలం ఆయనది ముస్లిం పేరు కావడమే అందుకు కారణమని అమెరికా మీడియా తెలిపింది. మహ్మద్ అలీ జూనియర్ (44) ఫిలడెల్ఫియాలో పుట్టారు. ఆయనకు అమెరికా పాస్‌పోర్టు ఉంది. తన తల్లి, మహ్మద్ అలీ రెండో భార్య అయిన ఖైలాష్ కమాచో అలీతో కలిసి అలీ జూనియర్ జమైకా వెళ్లి వచ్చారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్ విమానాశ్రయంలో వాళ్లిద్దరినీ రెండు గంటల పాటు ప్రశ్నించారని వాళ్ల తరఫు న్యాయవాది చెప్పారు. తన భర్తతో కలిసి ఉన్న తన ఫొటోను అధికారులకు చూపించిన తర్వాత అలీ భార్యను వదిలిపెట్టారు. అలీ జూనియర్ వద్ద మాత్రం అప్పటికి సిద్ధంగా అలాంటి ఫొటో ఏమీ లేదు. దాంతో 'నువ్వు ముస్లింవా.. ఈ పేరు నీకు ఎలా వచ్చింది'' అటూ ప్రశ్నలు వెల్లువెత్తించారు. తన తండ్రి నుంచే తనకు ముస్లిం మతం వచ్యచిందని చెప్పినప్పుడు మరిన్ని ప్రశ్నలు వేశారు. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ అధికార యంత్రాంగం ముస్లింలను అమెరికా నుంచి పంపేయాలని గట్టిగా నిర్ణయించినట్లు తెలుస్తోందని అలీ జూనియర్ న్యాయవాది మాన్సిని తెలిపారు. 20వ శతాబ్దపు క్రీడా హీరోలలో ఒకరైన మహ్మద్ అలీ (74).. సుదీర్ఘ కాలం పాటు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడి గత జూన్ 3వ తేదీన మరణించారు. ఆయనకు మూడు ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లున్నాయి. ఇక రింగ్ బయట ఆయన పౌర హక్కుల కోసం కూడా పోరాడారు. అలాంటి దిగ్గజం కుమారుడికే ఇప్పుడు పౌర హక్కుల సమస్య ఎదురు కావడం గమనార్హం. -
'రింగ్' రోదిస్తోంది
- బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కన్నుమూత - మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాటం - సుదీర్ఘ కెరీర్లో తిరుగులేని విజయాలు లాస్ ఏంజెల్స్: ‘నన్ను ఓడించాలని ఎవరైనా కలగన్నా.. వెంటనే నిద్ర లేచి నాకు క్షమాపణలు చెప్పాలి’... అంటూ రొమ్ము విరిచిన తెగింపుతో... తిరుగులేని ఆటతో... సుదీర్ఘకాలం ప్రపంచ బాక్సింగ్‌ను శాసించిన ‘ది గ్రేట్’ మొహమ్మద్ అలీ (74) శనివారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) కన్నుమూశారు. శ్వాస సంబంధ సమస్యలకు చికిత్స పొందుతూ ఫోనిక్స్‌లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ‘చాంపియన్లు జిమ్‌లో పుట్టరు’ అంటూనే 21 ఏళ్ల బాక్సింగ్ కెరీర్లో (1960-81) తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను నిలువెల్లా వణికించారు. కవ్వించే మాటలకు.. కన్పించని తంత్రాలకు... తనదైన రీతిలో ముష్టిఘాతాలు కురిపిస్తూ... ఎదురుపడ్డోడి ఒంట్లో నరాలన్నీంటిని పిండి చేశారు. ‘ప్రతి నిమిషం శిక్షణ నాకు నచ్చదు’ అంటూనే... అవసరమైనప్పుడు శ్రమకు నిర్వచనంగా నిలిచారు. బాధతో విలవిలలాడే ప్రత్యర్థులు పిడిగుద్దులు గుద్దినా ఓర్పుగా అనుభవిస్తూనే.. నేర్పుగా తాను అనుకున్న ఫలితాన్ని రాబట్టారు. అభిమానులు చంపేయంటూ అరిచినా... ప్రత్యర్థులు భీకరిల్లే అరుపులు పెట్టినా... దాన్ని బౌట్ వరకే పరిమితం చేశారు. కానీ ఆనాడు తగిలిన దెబ్బలకు జీవితంలో ఎన్నడూ కోలుకోలేని ‘పార్కిన్సన్’ వ్యాధికి (1984) గురై దాదాపు మూడు దశాబ్దాలు చిత్ర వధ అనుభవించారు. దీంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు, న్యూమోనియా (2014), యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (2015)తో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ జీవిత గమనాన్ని నెట్టుకుంటూ వచ్చిన అలీ.. రెండు రోజుల కిందట శ్వాస సమస్యలతోనే మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కానీ చికిత్స చేసినా... పరిస్థితి చేజారడంతో ఈ లోకం విడిచారు. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన అలీ... చివరిసారిగా పార్కిన్సన్ చికిత్సకు నిధులు సమకూర్చుకునేందుకు ఏప్రిల్‌లో ఫోనిక్స్‌లో ‘సెలబ్రిటీ ఫైట్ నైట్ డిన్నర్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌తో అనుబంధం న్యూఢిల్లీ: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ భారత్‌లో రెండుసార్లు పర్యటించారు. కేవలం రెండు పర్యటనల్లోనే ఎంతోమంది ఆత్మీయ అభిమానులను సంపాదించుకున్నారు. 1980లో ఓ పారిశ్రామికవేత్త ఆహ్వానం మేరకు తొలిసారి అలీ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ బౌట్లలో పాల్గొన్నారు. రెండోసారి 1990లో భారత్ వచ్చిన అలీ కోల్‌కతాలో మూడు రోజులు గడిపారు. ఇక్కడే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ మ్యాచ్ కోసం నేను బండరాతిని హత్య చేశాను... కొండను గాయపర్చాను... చికిత్స చేసే మందులను కూడా నేను ఇప్పుడు రోగిగా మార్చగలను... ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరుకు ముందు ప్రత్యర్థికి సవాల్ విసురుతూ... బాక్సింగ్ రింగ్‌లో అలీ గర్జన. యూనిఫారం ధరించి 10 వేల మైళ్లు ప్రయాణించి అమాయకులైన ప్రజలపై బాంబులు వేసేందుకు నన్ను పంపిస్తారా? మన దేశంలో నల్లజాతివారిని మనుషులుగా చూడకుండా... తెల్లవాళ్ల ఆధిపత్యం కోసం మరో పేద దేశాన్ని బలి చేస్తారా... అమెరికా ప్రభుత్వంపై అలీ ధిక్కారం. నాకు ట్రైనింగ్ అంటే అసహ్యం...కానీ జీవిత కాలమంతా చాంపియన్‌గా బతకాలంటే ఇప్పుడు ఆగిపోవద్దు. రిస్క్‌లు చేయడం ఇష్టం లేనివారు జీవితంలో ఏదీ సాధించలేరు... నా జీవితంలో నేను తలపైనే 29 వేల పంచ్‌లు తిన్నాను... అనుభవంతో అలీ నింపే స్ఫూర్తి. మొహమ్మద్ అలీ బాక్సర్ మాత్రమే కాదు...రింగ్‌లో రక్తం కళ్లచూసినవాడు. కానీ బయట మానవత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. నమ్మిన సిద్ధాంతం కోసం ఒకనాడు బాక్సింగ్ కెరీర్‌నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బాక్సింగ్‌లో సూపర్ మ్యాన్‌లా ప్రపంచాన్ని శాసించిన అతను నల్లజాతివారి హక్కుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించేందుకు వెనుకాడలేదు. అదే అలీని ప్రపంచ క్రీడాకారుల్లో అందరికంటే ముందు నిలిపింది. ఒక ఫైటర్నుంచి మత ప్రచారకుడి వరకు అతనిలో ఎన్నో కోణాలు ఉన్నాయి. బాక్సింగ్‌లోనే కాదు మాటల్లో కూడా పంచ్‌లతో అలీ తనకు ఎదురు లేదనిపించాడు. ‘నేను గొప్పవాడినే కాదు. అంతకంటే ఎక్కువే’ అంటూ స్వయంగా ప్రకటించుకోగలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది. దేవుడు తన చాంపియన్ కోసం కిందికి దిగి వచ్చాడు... అలీ మరణానంతరం మరో స్టార్ బాక్సర్ మైక్ టైసన్ ఇచ్చిన నివాళి ఇది. బాక్సింగ్‌లో అసలైన చాంపియన్‌గా రెండు దశాబ్దాల పాటు అలీ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టాడు. ఆ పంచ్‌కు రింగ్‌లో కుప్పకూలిన ఆటగాళ్లెందరో... ఆ పవర్‌కు ఇక చాలు అంటూ శరణుజొచ్చిన బాక్సర్లు మరెందరో... మూడు సార్లు ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచిన ఏకైక బాక్సర్ అయిన అలీ, గత వందేళ్లలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడిగా నీరాజనాలందుకున్నాడు. తిరుగులేని పంచ్‌లు: తన సైకిల్ ఎత్తుకుపోయిన దొంగను పట్టుకొని చితకబాదాలని 12 ఏళ్ల కుర్రాడిలో వచ్చిన ఆవేశాన్ని ఒక పోలీస్ గుర్తించి సానబెట్టడంతోనే ప్రపంచ బాక్సింగ్‌కు అలీ లభించాడు. కాసియస్ మార్సెలస్ క్లేగా పలు సంచలన విజయాలు సాధించిన అతను 1960 రోమ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే ఏడాది ప్రొఫెషనల్‌గా రింగ్‌లోకి అడుగు పెట్టిన అతనికి ఆ తర్వాత ఎదురే లేకుండా పోయింది. 22 ఏళ్ల వయసులోనే వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలవడంతో అలీ పేరు మా రుమోగిపోయింది. ఆ తర్వాత మరో రెండు సార్లు అతను ఈ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 1960 నుంచి 1981 మధ్య కాలంలో ప్రొఫెషనల్ బాక్సిం గ్లో తలపడిన 61 బౌట్లలో 56 విజయాలు... ఇందులో 37 నాకౌట్లే ఉండటం విశేషం. మతంపై నమ్మకంతో...:1967లో వియత్నాంపై అమెరికా యుద్ధం సాగిస్తున్న రోజులవి. అప్పటికే ముస్లింగా మారిన అలీ తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడేందుకు సిద్ధమయ్యాడు. అప్పటి నిబంధనల ప్రకారం అలీ కూడా ఆర్మీలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ దానిని వ్యతిరేకించాడు. దాంతో ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ రద్దు చేసి అరెస్ట్ కూడా చేయించింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత అలీని అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో దాదాపు నాలుగేళ్ల కాలం అలీ జోరుకు అడ్డు వేసింది. అయినా పునరాగమనం తర్వాత కూడా పదును తగ్గని అతను మళ్లీ తన దూకుడును కొనసాగించాడు. శాంతి కోరుతూ...: ‘రంగు కారణంగా మనుషులను ద్వేషించడంకంటే దుర్మార్గం మరొకటి లేదు’ అంటూ అమెరికాలో నల్లజాతివారిపై చూపించే వివక్షకు వ్యతిరేకంగా అలీ పోరాడాడు. కెరీర్‌ను పణంగా పెట్టి ప్రభుత్వాన్ని ఎదిరించడం అక్కడి నల్లజాతీయులందరిలో స్ఫూర్తి నింపింది. కెరీర్ ముగిసిన తర్వాత కూడా అలీ మానవ హక్కుల కోసం తన పోరాటం కొనసాగించాడు. అనారోగ్యంతో బాధ పడుతున్నా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పర్యటించి శాంతి కోసం ప్రచారం చేశాడు. అమెరికా అత్యున్నత పురస్కారాలు ప్రెసిడెన్షియల్ సిటిజన్స్ మెడల్, మెడల్ ఆఫ్ ఫ్రీడం అలీకి దక్కాయి. చివరి రోజుల్లో కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తామూ అమెరికన్లమే అంటూ ఘాటుగా బదులిచ్చాడు. పాపులర్ ‘పంచ్’లు అలీxసోనీ లిస్టన్ (1964) అలీ తొలిసారి వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన బౌట్. అతనిపై ఎవరికీ అంచనాలు లేవు. ఆరు రౌండ్లలో అలీ చేతుల్లో తీవ్రంగా గాయపడ్డ లిస్టన్ తాను కొనసాగించలేనంటూ చేతులెత్తేశాడు. అలీx జార్జ్ ఫోర్మన్ (1974) ఆఫ్రికా దేశం జైర్‌లో జరిగిన ఈ పోరుకు ‘రంబల్ ఇన్ ద జంగిల్’గా పేరు పెట్టారు. అలీ అద్భుతమైన ఆటతో ఎనిమిదో రౌండ్లో ఫోర్మన్ను పడగొట్టాడు. మ్యాచ్ జరిగినంత సేపూ ‘అలీ...అతడిని చంపేయ్’ అంటూ ప్రేక్షకులు హోరెత్తించడం బాక్సింగ్‌లో చాలా కాలం చర్చనీయాంశం అయింది. అలీx జో ఫ్రేజర్ (1975) ‘థ్రిల్ల ఇన్ మనీలా’ పేరుతో ఈ బౌట్ సాగింది. ఇద్దరు బాక్సర్లూ పరస్పరం పదునైన పంచ్‌లు విసురుకున్నారు. అయితే 14వ రౌండ్ ముగిసే సరికి ఫ్రేజర్ తీవ్రంగా గాయపడగా...అతని ప్రాణాలు కాపాడేందుకు కౌంట్‌కు స్పందించకుండా ట్రైనర్ అడ్డుపడటంతో అలీని విజేతగా ప్రకటించారు. తాను చావుకు దగ్గరగా వెళ్లిన బౌట్ ఇదని అలీ తర్వాత చెప్పుకున్నాడు. అలీ ఉత్తమ ఆటగాడు. స్ఫూర్తి ప్రదాత, అందరికీ ప్రేరణగా నిలిచే గొప్ప బాక్సర్. ఆయన మరణం విచారకరం.- భారత ప్రధాని మోదీ అలీ మరణం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఎల్లప్పుడు మంచి కోసం ఫైట్ చేసిన చాంపియన్. ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం. - అమెరికా అధ్యక్షుడు ఒబామా గొప్ప చాంపియన్, అదర్శనీయమైన వ్యక్తి. మనమంతా ఆయన్ని కోల్పోయాం. - డొనాల్డ్ ట్రంప్ అలీ రింగ్‌లో చూపించే ధైర్యం, తెగువ బాక్సింగ్‌ను అందమైన ఆటగా మార్చాయి.ఆయన వ్యక్తిత్వమే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. - హిల్లరీ క్లింటన్ ‘జీవితంలో ఒక్కసారైనా ఆ దిగ్గజాన్ని కలవాలని అనుకున్నాను. కానీ నా కోరిక ఇక తీరదు’- సచిన్ ‘ఆటకు ఆయన చేసిన సేవ మరువలేనిది. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. చిరస్మరణీ యులు’ - విజేందర్ ‘బాక్సింగ్‌కు అలీ మరణం తీరని లోటు. ఆయనే నాకు ఆదర్శం. నాలాంటి ఎందరికో ఆయన స్ఫూర్తి ప్రదాత. ఒక గొప్ప వ్యక్తిగా అందరి మదిలో నిలిచిపోయారు’ - మేరీ కోమ్ ►కెరీర్ బౌట్స్: 61 ►విజయాలు: 56 (ఇందులో 37 నాకౌట్స్) ► ఓటములు: 5 కింగ్ ఆఫ్ ద రింగ్ 1942: జనవరి 17న అమెరికాలోని కెంటకీలో జననం అసలు పేరు: కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ ఎత్తు: 6.3 అడుగులు 1954: 12వ ఏట బాక్సింగ్ శిక్షణ ప్రారంభం 1959: జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ లైట్ హెవీవెయిట్ టైటిల్ 1960: రోమ్ ఒలింపిక్స్‌లో లైట్ హెవీవెయిట్ స్వర్ణం 1960: ప్రొఫెషనల్‌గా మార్పు 1964: దిగ్గజ బాక్సర్ సోనీ లిస్టన్‌ను ఓడించి 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ దక్కించుకున్నాడు. అనంతరం ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును మొహమ్మద్ అలీగా మార్చుకున్నారు. సోంజి రాయ్‌తో తొలి వివాహం 1967: అమెరికా, వియత్నాం యుద్ధ సమయంలో ఆర్మీలో చేరేందుకు నిరాకరణ. టైటిల్ కోల్పోవడంతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత17 ఏళ్ల బెలిండా బాయ్డ్‌తో రెండో వివాహం 1970: న్యాయ పోరాటం అనంతరం తిరిగి బాక్సింగ్ బరిలోకి దిగారు 1971: జో ఫ్రేజర్‌తో జరిగిన ‘శతాబ్దపు ఫైట్’లో ఓటమి.అలీపై ఉన్న అభియోగాలను కొట్టివేసిన యూఎస్ సుప్రీం కోర్టు 1974: రెండోసారి ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ టైటిల్ (జార్జి ఫోర్మన్పై విజయం) 1977: వెరోనికా పోర్షేతో అలీ మూడో వివాహం 1978: మూడోసారి ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ (లియోన్ స్పింక్స్పై విజయం)తో తొలిసారి ఈ ఫీట్ సాధించిన బాక్సర్‌గా రికార్డు. అదే ఏడాది రిటైర్మెంట్ ప్రకటన. 1980: పునరాగమనంలో లారీ హోమ్స్‌పై నాకౌట్ ఓటమి 1981: ట్రెవర్ బెర్బిక్తో ఓటమి అనంతరం తన కెరీర్‌కు ముగింపు పలికారు 1984: చికిత్సకు లొంగని పార్కిన్సన్ వ్యాధిని గుర్తించారు 1986: యోలండా లోనీ విలియమ్స్‌తో నాలుగో వివాహం 1998: ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా ప్రకటన 2002: అట్లాంటా ఒలింపిక్స్‌లో తొలిసారిగా జ్యోతి ప్రజ్వలన చేశారు 2005: ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేసినందుకు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ పురస్కారం. అప్పటి నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఆసుపత్రికి మినహా పెద్దగా బయటకు రాలేదు. 2016: జూన్ 3న (అమెరికా కాలమానం) 74వ ఏట మరణం. -
ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మహ్మద్ అలీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చినట్లు కుటుంబ ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు. 74 ఏళ్ల మహ్మద్ అలీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాదపడుతున్నారు. బయటి ప్రపంచానికి పెద్దగా తన ఉనికిని తెలియనివ్వడం లేదు. ఇటీవల ఏప్రిల్ నెలలో మహ్మద్ అలీ పార్కిన్సన్ సెంటర్ అనే సంస్థకు విరాళాల కోసం అరిజోనాలో జరిగిన సెలబ్రిటీ ఫైట్ నైట్‌లో మాత్రం పాల్గొన్నారు. కెరీర్లో అగ్రస్థానానికి ఎదిగిన మహ్మద్ అలీ.. బాక్సింగ్ రింగ్‌లో డాన్స్ చేస్తున్నట్లు కదులుతూ వేగంగా ముష్టిఘాతాలు కురిపించేవారు. సీతాకోకచిలుకలా ఎగిరి తేనెటీగ కుట్టినట్లు కొడతారని బాక్సింగ్ నిపుణులు చెబుతుంటారు. అరిజోనాలోని ఫోనిక్స్‌లో నివసించే అలీకి ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. 2014 డిసెంబర్లో ఆయనకు న్యుమోనియా రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆయనకు తీవ్రంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి, దానికి 2015 జనవరిలో చికిత్స చేయించారు. 1981లో రిటైర్ అయ్యే సమయానికి ఆయన విజయాల రికార్డు 56-5గా ఉంది. రిటైరైన మూడేళ్ల తర్వాత ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి బయటపడింది. మహ్మద్ అలీ అసలు పేరు కాసియస్ మార్సెల్లస్ క్లే జూనియర్. 1964లో ఇస్లాం మతం పుచ్చుకున్న తర్వాత పేరు మార్చుకున్నారు.