ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు | boxing legend muhammad ali hospitalised with pulmonary issues | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు

Jun 3 2016 10:59 AM | Updated on Sep 4 2017 1:35 AM

ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు

ఆస్పత్రి పాలైన బాక్సింగ్ యోధుడు

ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మహ్మద్ అలీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చినట్లు కుటుంబ ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు.

ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మహ్మద్ అలీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు శ్వాస సంబంధిత సమస్య వచ్చినట్లు కుటుంబ ప్రతినిధి బాబ్ గన్నెల్ తెలిపారు. 74 ఏళ్ల మహ్మద్ అలీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాదపడుతున్నారు. బయటి ప్రపంచానికి పెద్దగా తన ఉనికిని తెలియనివ్వడం లేదు. ఇటీవల ఏప్రిల్ నెలలో మహ్మద్ అలీ పార్కిన్సన్ సెంటర్ అనే సంస్థకు విరాళాల కోసం అరిజోనాలో జరిగిన సెలబ్రిటీ ఫైట్ నైట్‌లో మాత్రం పాల్గొన్నారు. కెరీర్‌లో అగ్రస్థానానికి ఎదిగిన మహ్మద్ అలీ.. బాక్సింగ్ రింగ్‌లో డాన్స్ చేస్తున్నట్లు కదులుతూ వేగంగా ముష్టిఘాతాలు కురిపించేవారు. సీతాకోకచిలుకలా ఎగిరి తేనెటీగ కుట్టినట్లు కొడతారని బాక్సింగ్ నిపుణులు చెబుతుంటారు.

అరిజోనాలోని ఫోనిక్స్‌లో నివసించే అలీకి ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. 2014 డిసెంబర్‌లో ఆయనకు న్యుమోనియా రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత ఆయనకు తీవ్రంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి, దానికి 2015 జనవరిలో చికిత్స చేయించారు. 1981లో రిటైర్ అయ్యే సమయానికి ఆయన విజయాల రికార్డు 56-5గా ఉంది. రిటైరైన మూడేళ్ల తర్వాత ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి బయటపడింది. మహ్మద్ అలీ అసలు పేరు కాసియస్ మార్సెల్లస్ క్లే జూనియర్. 1964లో ఇస్లాం మతం పుచ్చుకున్న తర్వాత పేరు మార్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement