breaking news
Boston University School of Medicine
-
సెల్ఫీల్లో అందం కోసం తపనా ఓ రోగమే
బోస్టన్: ఫొటోను అందంగా ఎడిట్ చేసుకుని నిజ జీవితంలోనూ తమకు ఇలాంటి ముఖమే వచ్చేట్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇటీవల ప్లాస్టిక్ సర్జన్లను కలిసిన వారిలో సెల్ఫీల్లో అందంగా వచ్చేలా తమ ముఖాన్ని తీర్చిదిద్దమని కోరిన వారే 55 శాతమట! ఏ లోపం లేకుండా సెలబ్రిటీల్లా సోషల్‌మీడియాలో కనపడాలనే తపనను ‘స్నాప్డైమోఫియా’అనే రుగ్మతగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా స్నాప్‌చాట్, ఫేస్ట్యూన్ యాప్‌ల వంటి సోషల్‌మీడియా ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. బోస్టన్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం వివరాలు జమా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఎడిటింగ్ టెక్నిక్స్ వల్ల అందంపై దృక్పథం మారిందని, దీంతో ఆత్మగౌరవం దెబ్బ తినడంతో పాటు శారీరక రుగ్మతలకు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ‘అందంగా కనపడాలనే తపనతో చర్మవ్యాధులు, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులను కలవడం ఒక రుగ్మత, వీరి మనసు నిండా అందం గురించిన ఆలోచనలే ఉంటాయి’ అని పరిశోధనలో పాల్గొన్న నీలమ్ వశీ పేర్కొన్నారు. సర్జరీతో అందం రాదని, సర్జరీ దీనికి ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. సహజమైన అందాన్ని ప్రేమించగలిగేలా వీరికి మానసిక చికిత్స అవసరమని సూచించారు. -
ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందా?
న్యూయార్క్ : ఒత్తిడికి గురిచేసే పనులు, వాటికి సంబంధించిన ఈవెంట్లలో పాల్గొనడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని పరిశోధకులు అంటున్నారు. బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన రీసెర్చర్స్ పలు విషయాలను వెల్లడించారు. ఒత్తిడిలో ఉండే వారికి క్యాన్సర్ వస్తుందని చెప్పేందుకు ఎటువంటి బలమైన ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేల్చారు. మానసిక కుంగుబాటు, ఒత్తిడి వల్లే క్యాన్సర్ సంభవిస్తుందని సాధారణంగా ప్రజలు భావిస్తారని రచయిత, మానసిక శాస్త్రవేత్త జేమీ గ్రేడస్ పేర్కొన్నారు. ఒత్తిడి, క్యాన్సర్ అంశాలకు సంబంధించిన నిపుణులు 70 ఏళ్ల నుంచి ఇటువంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు క్లినికల్ రీసెర్చర్స్ కూడా తమ అభిప్రాయాలను వీటితో కలిపి ఓ నిర్ణయానికి వచ్చారు. యూరోపియన్ పత్రికలలో ఈ విషయాలను వారు వెల్లడించారు.