breaking news
Bogas
-
కల్యాణలక్ష్మి: బోగస్ పెళ్లిళ్లపై ఆరా
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. కొందరు అక్రమార్కులు మండల అధికారులతో సంబంధం లేకుండా ఆయా తహసీల్దార్ల లాగిన్ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపి పెళ్లి కానుక డబ్బులు దండుకున్నట్లు తేలింది. దీనిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ మూడేళ్ల నుంచి వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులన్నీ పరిశీలన చేసి రిపోర్టు చేయాలని ఆయా తహసీల్దార్లను ఆదేశించారు. గడిచిన మూడేళ్లలో కల్యాణలక్ష్మికి ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? పెళ్లి ఎవరికి జరిగింది? చెక్కు ఎవరి పేరుతో వచ్చింది? ఎవరు ఏ బ్యాంకులో డబ్బులు డ్రా చేశారు? ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనే విషయాలను నిషితంగా పరిశీలించాలని ఎమ్మార్వోలకు సూచించారు. దీంతో అధికారులు మూడేళ్ల నుంచి వచ్చిన దరఖాస్తులను బయటకు తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులెవరనే విషయాన్ని నిర్ధారించిన అనంతరం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బోగస్‌గా తేలిన వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2016 నుంచి కల్యాణలక్ష్మి అమలు రాష్ట్ర ప్రభుత్వం 2016లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. పేదింటి ఆడబిడ్డల వివాహానికి నగదును సాయంగా అందించే ఈ పథకం కింద వధువు పేరిట లేదా వారి కుటుంబ సభ్యుల పేరిట నగదు బ్యాంకులో జమ చేస్తోంది. మొదట్లో పెళ్లి కానుక రూ.50,116 ఉండగా ప్రభుత్వం 2018 ఏప్రిల్‌లో రూ.1,00,116కు పెంచింది. ‘కల్యాణలక్ష్మి’ కావాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు మ్యానువల్‌గా మూడు జతల దరఖాస్తు జిరా>క్స్ కాపీలను నేరుగా తహసీల్దార్ కార్యాలయంలోని సంబంధిత అధికారికి అప్పగించాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తు, నేరుగా అందిన దరఖాస్తుతో సరిపోల్చి అవసరమనుకుంటే సదరు అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తహసీల్దార్‌కు నివేదిస్తారు. అనంతరం తహసీల్దార్ లాగిన్ నుంచి ఆర్డీవో కార్యాలయానికి ఆన్లైన్ దరఖాస్తును పంపిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే లబ్ధిదారు పేరున ట్రెజరీకి పంపి నగదును బ్యాంకు ఖాతాలో వేస్తారు. పత్రాలు సక్రమంగా లేకపోతే ఆర్డీవో కార్యాలయంలో తిరస్కరిస్తారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. సహకరిస్తోంది ఎవరు? ఆయా మండలాల తహసీల్దార్ల లాగిన్ నుంచి కల్యాణలక్ష్మి దరఖాస్తులు ఆర్డీవో కార్యాలయానికి ఎలా వెళ్తున్నాయి? ఇందుకు సహకరిస్తున్న వారెవరు? ఇప్పటి వరకు అలా ఎన్ని దరఖాస్తులు వెళ్లాయి? డబ్బులు ఎవరికి వచ్చాయి? బోగస్ పత్రాలు సృష్టించి డబ్బులు ఎవరు తీసుకున్నారు? అనే విషయాలు త్వరలో బయటకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదంతా జరుగుతోందా? కేవలం ఐదారు మండలాల్లోనే ఈ దందా కొనసాగుతోందా? అనేది త్వరలో తేలనుంది. 2018లో కల్యాణలక్ష్మి మొత్తాన్ని ప్రభుత్వం రూ.1,00,116కు పెంచడంతో డబ్బులు ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పెళ్లి కానుక పెంపు నుంచి ఈ దందా కొనసాగుతుందని అంచనాకు వచ్చిన యంత్రాంగం మూడేళ్ల రికార్డులు పరిశీలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు మొదట బోథ్, గుడిహత్నూర్, బజార్హత్నూర్, నేరడిగొండ, మావల మండలాల్లో పరిశీలించి 87 దరఖాస్తులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు. బోగస్ లబ్ధిదారులు, మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలను వెంటనే నిలిపివేయాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని మిగతా మండలాల్లో కూడా దరఖాస్తులు పరిశీలించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయానికి మ్యానువల్‌గా వచ్చిన దరఖాస్తులు పరిశీలించకపోవడం, కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలను పసిగట్టలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణమైనట్లు గుర్తించారు. తతంగం జరిగిన పీరియడ్‌లో ఉన్న సంబంధిత మండల అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్లు కలెక్టర్ ఇది వరకే తెలిపారు. -
నకిలీలలు కోకొల్లలు
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : నగరంలోని లేక్యూకాలనీలో పదో వీధిలో బద్దెపూడి శ్రీనివాసులు ఇంట్లో నకిలీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఒక్కొక్కటిగా నకిలీలు వెలుగు చూస్తున్నాయి. నగర శివారుప్రాంతంలో నివేశ స్థలాల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి వారికి సొంతింటి కల నెరవేర్చుకోవడం నానాటికి కరువవుతోంది. పేదల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ పట్టాలు అధికారులకు చిక్కడంతో దళారుల వద్ద తాము తీసుకున్న నివేశ స్థలాల పట్టాలు, భూముల పట్టాలు బోగస్ అని వెల్లడవడంతో లబోదిబోమంటున్నారు. వరదకాలువలు, పంట కాలువలు, ప్రభుత్వ శివాయి భూములకు నకిలీ పట్టాలు సృష్టించి అధికారుల నుంచి ఇప్పిస్తున్నట్టు దళారులు నమ్మబలికి అందినంత దోచుకుంటున్నారు. నకిలీ గుట్టురట్టు కావడంతో తాము మోసపోయినా బయటకు చెప్పుకోలేక అంతర్మథనం చెందుతున్నారు. కొత్తూరు పరిధిలోని చంద్రబాబునగర్, ఎన్జీఓ లేఅవుట్, శ్రామికనగర్ వద్ద ఉన్న నెల్లూరు చెరువుకు వెళ్లే వరదకాలువ, రవిచంద్ర గిరిజనకాలనీ సమీపంలోని కనుపూరుకాలువ పోరంబోకు స్థలాలకు కొందరు దళారులు ఒక్కొక్క పట్టాకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. ఎవరైనా పట్టాలపై సందేహాలు వ్యక్తం చేసినా తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి వాటిని చూపించుకోండంటూ తెలివిగా తప్పించుకు తిరిగేవారు. కొత్తూరు, కల్లూరుపల్లి, పడారుపల్లి, ఆమంచర్ల, కొండాయపాళెం తదితర ప్రాంతాల్లో నకిలీ పట్టాలు వెలుగుచూస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి నకిలీ పట్టాలు తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు పరోక్షంగా ముఠా సభ్యులకు తోడ్పాటు అందించటం, దీనికితోడు అధికారపార్టీ అండదండలు మెండుగా ఉండటంతో నకిలీ పట్టాల తయారీదారులు యథేచ్ఛగా చెలరేగిపోయారు. నగర శివారు ప్రాంతాల్లో ఏ స్థలానికి అధికారులు ధ్రువీకరించిన పట్టా ఉందో, ఏ పట్టా నకిలీదో తెలుసుకోలేని సంకటస్థితిలో స్థలాల యాజమానులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు నకిలీ పట్టాల తయారీదారులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టి నకిలీ పట్టాలతయారీ ముఠా గుట్టును బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై తహశీల్దార్ నరసింహులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమ కార్యాలయ సిబ్బంది దళారులకు సహకరించిన విషయం తనకు తెలియదన్నారు. పరారీలో ఉన్న బద్దెపూడి శ్రీనివాసులు పోలీసులకు దొరికితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.