breaking news
bodhi tree
-
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్. ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు. -
దక్షిణ కొరియాకు అరుదైన బహుమతి
దక్షిణ కొరియాలో దాదాపు నాలుగోవంతు జనాభా.. అంటే దాదాపు 5 కోట్ల మంది బౌద్ధులే. దాంతో భారతదేశం ఆ దేశానికి అరుదైన బహుమతి అందజేసింది. బుద్ధగయ పట్టణం నుంచి ఓ పవిత్రమైన బోధిచెట్టును అక్కడకు పంపింది. చిన్న మొక్కను ప్రధాని తన ప్రత్యేక దూతల ద్వారా ఆ దేశానికి పంపారు. భారత- కొరియాల మధ్య స్నేహసంబంధాలకు గుర్తుగా తాను ఈ బోధి మొక్కను పంపుతానని గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.. దక్షిణకొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హైకి చెప్పారు. ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ జనవరిలో ఆమె భారతదేశంలో పర్యటించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధులు, దక్షిణకొరియా అటవీశాఖాధికారులు కలిసి ఈ మొక్కను విమానంలో తీసుకెళ్లారు. సియోల్ విమానాశ్రయంలో దక్షిణకొరియాకు భారత రాయబారి అయిన విష్ణుప్రకాష్ ఆ మొక్కకు, బృందానికి స్వాగతం పలికారు. ఆయనతో పాటు దక్షిణకొరియా విదేశాంగ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జియాంగ్ బయాంగ్హూ కూడా ఉన్నారు.