breaking news
Bhimreddy Narasimha Reddy
-
మట్టి మనుషుల మనిషి బి.యన్.
భూమినే నమ్ముకొని జమీందారులు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల అరాచకాల కింద బతుకుతున్న మట్టి మనుషులకు భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుండి విముక్తి కావాలని, నిజాం నవాబు దుర్మార్గపు పాలనను మట్టుపెట్టాలని సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సేనాని బి.యన్. ఆయన పేరు వినగానే శత్రువుల గుండెలు గుబేలుమంటాయి. ఆయనను స్మరించుకుంటేనే సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసిపడతాయి. భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి (బి.యన్) దున్నే వానికే భూమి కావాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఏర్పడాలని, తెలుగు జాతి ప్రజల ఐక్యత కోసం తపించిన గొప్ప వ్యక్తి. 1922లో నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి చొక్క మ్మ–రామిరెడ్డి దంపతులకు మొదటి సంతానం బి.యన్. ఆయన బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే గడిచింది. ఆ రోజులలో గ్రామాలలో విద్యావకాశాలు లేకపోవడంతో నాల్గో ఫారమ్ చదవటానికి సూర్యాపేట చేరాడు. తెలుగు చదవాలనే మమకారం ఉన్నప్పటికి ఉర్దూ చదవక తప్పలేదు. నల్గొండ జిల్లాలో 8వ తరగతి వరకు చదివి, తరువాత హైదరాబాద్‌లో బంధువుల సహకారంతో 9,10 తరగతులు ఒకేసారి పరీక్ష రాసి ద్వితీయ శ్రేణిలో పాసైనాడు. చదువుతున్న కాలంలోనే జాతీయంగా వందేమాతర ఉద్యమం, అంతర్జాతీయంగా ప్రపంచ యుద్ధం బి.యన్.లో రాజకీయ ఆసక్తిని పెంచాయి. సరిగ్గా అదే సమయంలో నిజాం పాలనకు వ్యతిరేకత ప్రభంజనంలా మారటం మొదలైంది. 1941–42లో నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించడానికి బి.యన్. నడుం బిగించారు. 1942 వరంగల్‌లో జరిగిన 9వ ఆంధ్ర మహాసభలో తోబుట్టువులతో, అనుచరులతో కలిసి వాలంటీర్‌గా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ్ట స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. బి.యన్ ఆధ్వ ర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడులతో సేకరించిన ఆయుధాల ద్వారా పోరాటం ముందుకు సాగింది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరీవాహక ప్రాంత రెండు వైపులా సుమారు 200 గ్రామాలలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన మార్క్సిస్టు పార్టీలో ‘సామాజిక న్యాయం’ కొరవడడంతో సొంతంగా సీపీఎం (బి.యన్) పార్టీని స్థాపించారు. తరువాత మద్దికాయల ఓంకార్ ఏర్పరచిన ఎంసీపీఐ(యు)లో తన పార్టీని విలీనపరిచి చివరి వరకు పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. 2008 మే 9న బి.యన్. అమరులైనారు. ఆ మట్టి మనుషుల మనిషికి సామాన్యులెందరో జోహార్లు పలికారు. (నేడు బి.యన్. 11వ వర్ధంతి) -వనం సుధాకర్, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మొబైల్: 99892 20533 -
వీర తెలంగాణ సాయుధ సేనాని
సాక్షి, తెలంగాణ: వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.. అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉంది. విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు ధన్నుగా నిలిచి సాయుధ పోరాటాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త. 1925లో ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు రెండో సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తయిన వెంటనే బీఎన్‌రెడ్డి వీరతెలంగాణ రైతాంగ పోరాట బాటపట్టారు. 1945లో ఆయన సరోజను వితంతు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. 1957, 1967లలో రెండుసార్లు తుంగతుర్తి, సూర్యాపేటల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1971, 1984, 1991లో మిర్యాలగూడ పార్లమెంటు నియొజకవర్గం (2009లో రద్దయ్యింది) ఎంపీగా ఎన్నికయ్యారు. 1975 నుంచి 1983 వరకు సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ(ఎం)కు..రాం రాం పార్టీలో సామాజిక న్యాయం కోసం పట్టుబట్టిన ఆయన చివరకు 1997లో సీపీఐ(ఎం)ను వీడారు. ఆ తర్వాత బీఎన్ సీపీఎంను స్థాపించారు. అనంతరం మద్దికాయల ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలో తన పార్టీని విలీనం చేశారు. వందెకరాల సొంత భూమిని పేదలకు పంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సాయుధ పోరాట యోధుడు బీఎన్ సిసలైన ఉద్యమాల వీరుడు. పోరాటాలకు నిలువెత్తు రూపం. భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయంగా తుపాకీ చేతబట్టి పేదల పక్షాల నిలిచిన ధీరోదాత్తుడు. తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా సేనాని. ’దున్నేవాడిదే భూమి’ అంటూ నినదించి.. వంద ఎకరాల తన భూమిని ప్రజలకు పంచిన త్యాగశీలి. సమరశీల పోరాటాలు రచించడంలో ఉద్దండుడు. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి వీ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంలో ముందు నిలిచారు. బి.ఎన్.రెడ్డి. ధనవంతుల కుటుంబంలో జన్మించినా.. ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమ సమాజం వైపే. స్థానిక జమీందారుల నిరంకుశత్వానికి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం.. చివరకు నిజాం అరాచకాలపై వ్యతిరేక పోరుగా.. ఆపై సాయుధ ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ మొదటి దశ నేతలల్లో అగ్ర భాగాన నిలిచిన బీఎన్ రెడ్డి, చివరి దశ వరకూ పోరాటం సాగించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటానికి, తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానిగా... భూస్వాములకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం నడిపారు. సాయుధ పోరాట సమన్వయానికి ఏడుగురి సభ్యులతో ఏర్పాటైన కమిటీకి బీఎన్ కార్యదర్శిగా పనిచేశారు. స్వాతంత్య్రానంతరం తుంగతుర్తి కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన సీపీఎం వైపునకు వెళ్లారు 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా... గెలిచినా బీఎన్ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. పార్లమెంటు సమావేశాలకు బస్సులోనే వెళ్లిన సామాన్యుడు. అంత కాలం పదవుల్లో ఉన్నా ప్రజల కోసమే పనిచేసిన ఆయన, తన కోసం చిల్లిగవ్వ కూడా సంపాదించుకోలేదు. పార్లమెంటు రాజకీయాల్లో.. రద్దయిన మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భీమిరెడ్డి నర్సింహారెడ్డి మూడు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం 1962లో ఏర్పడగా మొత్తం 12 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడుసార్లు భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా కూడా పనిచేశారు. 1971లో మూడోసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి సీపీఎం నుంచి మొదటిసారి పోటీచేసి టీపీఎస్ అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డిపై 7604 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో బీఎన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీఎస్ రెడ్డితో తలపడి అపజయం పాలయ్యారు. అదే విధంగా 1980లో కూడా బీఎన్ రెడ్డి జీఎస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై 41,755 ఓట్ల మెజార్టీతో రెండోసారి లోక్‌సభ సభ్యునిగా విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 6వ సారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై 8,263 ఓట్ల మెజార్టీతో మూడోసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. -
సామాజిక న్యాయమే బీఎన్ ధ్యేయం
సందర్భం పిడివాదాన్నీ, యథాతథవాద పంథానీ మార్చడం అంత సులభం కాదు. వామపక్ష శిబిరాలలో అయితే ఇది మరింత కష్టం. మార్పుకీ, పురోగతికీ చిరునామాగా చెప్పుకున్న ఆ పార్టీలు కూడా సామాజిక న్యాయం విషయంలో చతికిలబడిన సంగతి దాచేస్తే దాగని నిజం. దీనిని ఆలస్యంగా అయినా గుర్తించి ఇటీవల సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ‘లాల్–నీల్’నినాదం ఇచ్చారు. కానీ సామాజిక న్యాయం కోసం పార్టీ మీద పోరాడిన వారు గతంలోనే ఉన్నారు. అందుకోసం పార్టీని వీడిన వారు వామపక్ష శిబిరాలలో ఉన్నారు. పోరాటం, సంస్కరణ, సామాజిక న్యాయ దృష్టి సమంగా ఉన్న భీంరెడ్డి నరసింహారెడ్డి (మార్చి 15, 1922–మే 9, 2008) ఇందుకు సాక్షిగా నిలబడతారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో ఆయనది విశిష్ట స్థానం. పోలీసు చర్య తరువాత సాగిన పార్లమెంటరీ రాజకీయాలలో ఆయన నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. తెలంగాణ సాయుధ పోరాటం మలిచిన యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డి. బీఎన్రెడ్డిగా చరిత్ర ప్రసిద్ధుడైన నరసింహారెడ్డి జీవితం, పోరాటం కొన్ని తరాలకు పాఠం. దొరతనానికి ఆలవాలమైన గడీలలో పుట్టారాయన. కానీ నిజాం పాలనలో మగ్గిపోతున్న పీడిత, తాడిత జనం విముక్తి కోసం తుపాకీ పట్టారు. దున్నేవానికే భూమి నినాదంతో గ్రామాలలో భూపంపిణీ చేపట్టిన విశాల హృదయుడు. భూస్వాముల మిగులు భూములను పేదలకు పంచిపెట్టే బృహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో తొలిసారి చేపట్టిన విప్లవకారునిగా కూడా బీఎన్ సుప్రసిద్ధులు. బీఎన్ కుటుంబంలోనే ఒక సామాజిక దృక్పథం, స్పృహ కనిపిస్తాయి. వారిది సంపన్న రైతు కుటుంబం. అయినా చిన్నారి బీఎన్‌ను కుటుంబంలోని పెద్దలు కష్టజీవులతో కలసిమెలసి ఉండే విధంగా పెంచారు. బీఎన్ బాల్యమంతా వ్యవసాయ క్షేత్రంలోనే గడిచింది. ప్రాథమిక విద్య స్వగ్రామం కర్విరాల కొత్తగూడెం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) లోనే ఆరంభమైంది. దృక్పథాన్ని ఇచ్చిన కాలం నిజాం పాలన పట్ల నిరసన పదునెక్కుతున్న కాలంలో బీఎన్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నిజాం సంస్కృతిని బద్దలుకొట్టి, సామాజిక విప్లవం ద్వారా మొత్తం వ్యవస్థను మార్చాలని, బానిసత్వం నుంచి విముక్తం కావాలని నినదిస్తూ ఆంధ్రమహాసభ ఆవిర్భవించింది. నిజాం వ్యతిరేక శక్తులను ఏకం చేసిన అతి పెద్ద వేదిక ఆంధ్రమహాసభ. ఆ సంస్థ నాయకులు ఇచ్చిన ఉపన్యాసాలు బీఎన్‌ను ఉత్తేజితుడిని చేసేవి. మరొక వంక నిజాం వ్యతిరేక పోరాటంలో కీలకంగా ఉన్న ఆర్య సమాజ్ కార్యకలాపాలకు కూడా ఆయన హాజరయ్యేవారు. ఇలాంటి వాతావరణంలోనే ఆయన తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. కానీ అప్పుడే తండ్రి (రామిరెడ్డి, తల్లి చొక్కమ్మ) మరణించడంతో ఇంటి బాధ్యత, సాగు బాధ్యత బీఎన్ భుజాల మీద పడింది. ఉద్యమం, సేద్యం మనసు మీద బలంగా ముద్ర వేసినా, చదువు మీద ఆయనకు మమకారం పోలేదు. పదో తరగతి చదవడానికి హైదరాబాద్ వచ్చారు. రెడ్డి హాస్టల్లో ప్రవేశం కోసం అప్పుడే కొత్వాల్ వెంకటరామారెడ్డిని కూడా కలుసుకున్నారు. ఫలితం లేకపోయింది. అయినా పదో తరగతి చదువు పూర్తి చేసి మళ్లీ స్వగ్రామం చేరుకున్నారు. అప్పుడే తన పొలంలో జరిగిన ఒక సంఘటన ఆయనను పేదరికం గురించి ఆలోచించేటట్టు చేసింది. ఆయన భవిష్యత్ ప్రణాళికను అప్పుడే సిద్ధం చేస్తున్నట్టు గోరంట్ల నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు రహస్యంగా పంపిన ‘అక్టోబర్ విప్లవం సంచిక’అందింది. ఆయన చదివిన మొదటి కమ్యూనిస్టు పాఠం అందులోదే. ఆ సిద్ధాంతంతో పేదరికం పోతుందని, దోపిడీని నివారించవచ్చునని, అందరికీ తిండి, పని ఉంటాయని చెబుతూ చేసిన విశ్లేషణ బీఎన్‌ను కదిలించింది. దీనికి తోడు ‘పల్లెటూరి పేదలకు...’ అనే పుస్తకం, లెనిన్ రాసినది– మరో కోణం నుంచి ప్రభావితం చేసింది. అప్పుడే వరంగల్‌లో జరిగిన (1942–43) ఆంధ్రమహాసభ బీఎన్ లోని ఆవేశాన్ని ఆచరణ వైపు నడిపించింది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన మొట్టమొదటిసారి ‘కోసుకు వీసం’ పోరాటం చేశారు. కోసు దూరం బరువు మోసేవాళ్లకు ఆ రోజుల్లో అణా ఇవ్వాలనే నిబంధన ఉండేది. కానీ దాన్ని చాలామంది పాటించేవాళ్లు కాదు. తమ ఊరు నుంచే కోసుకు వీసం పోరాటాన్ని బీఎన్ ఆరంభించారు. పదకొండవ ఆంధ్రమహాసభ నాటి నుంచి పోరాటాలు ప్రజలను కదిలిం చాయి. అప్పటి వరకు విన్నపాలకు, వినతులకు పరిమితమైన ఆందోళనలను తీవ్రం చేసి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి కమ్యూనిస్టు యోధులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఐలమ్మ... వెనుక బీఎన్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో బడుగు వర్గాల పోరాట పటిమకు నిదర్శనంగా నిలిచే ఘట్టం చాకలి ఐలమ్మ తిరుగుబాటు. సాయుధ పోరాట యోధుడు బీఎన్ ఆ తిరుగుబాటులో కీలకంగా నిలిచి ఐలమ్మ పేరు, పోరు ప్రపంచానికి వెల్లడయ్యేందుకు దోహదం చేశారంటే అతిశయోక్తి కాదు. అట్టడుగు వర్గాల ప్రజానీకం నిజాం పాలనలో ఎలాంటి దురవస్థను అనుభవించేవారో చెప్పడానికి ఐలమ్మ జీవితం కొండగుర్తు. ఆమె సాయుధ సమరంలో పాల్గొనలేదు. కానీ గొప్ప పోరాట యోధురాలిగా చరిత్రకెక్కింది. ఆ గొప్పతనం వెనుక బీఎన్ ఉన్నారు. ఆమె భర్తను దొంగగా చిత్రించి, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినప్పుడు తన పంటను కాపాడుకోవడం కోసం అనివార్యంగా పోరాటంలోకి వచ్చారు. కష్టపడి పండించుకున్న తిండిగింజలను దొరల గూండాలు తన్నుకుపోయేందుకు సిద్ధమయ్యారు. కల్లంలో ఉన్న వరికుప్పను కాపాడుకోవడం కోసం ఆమె గట్టిగా నిలబడింది. సరిగ్గా ఆ సమయంలో ఐలమ్మ పోరాటానికి మద్దతుగా నిలిచి గూండాలను తరిమికొట్టారు, బీఎన్. సహజంగానే బలాఢ్యుడాయన. ఐలమ్మ సాహసానికి తోడు, బీఎన్‌ను ఎదిరించే ధైర్యం లేక గూండాలు పారిపోయారు. అప్పుడైనా, ఇప్పుడైనా చితికిన రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేసేవాళ్లే గొప్ప వ్యక్తులవుతారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రైతును ఆదుకొనేవాళ్లు లేరు. అప్పుడు భూస్వాముల దాడుల నుంచి రైతును కాపాడే ఉద్యమాలు వచ్చినట్లే ఇప్పుడు గిట్టుబాటు కానీ ధరల మార్కెట్ దాడుల నుంచి రైతులను ఆదుకొనే పోరాటాలు చేపట్టవలసి ఉంది. మార్కెట్ మాయాజాలంలో పడి రైతులు పెద్ద ఎత్తున వేరుశెనగ పండించారు.అది ఎంతో కాలం నిలవలేదు. ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. రైతు దారుణంగా నష్టపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే. మార్కెట్ మాయాజాలం మిర్చిని ముందుకు తెచ్చింది. అదే పరిస్థితి పునరావృతమవుతూ నాడు ఆవులను మలిపిన అర్జునుడిలా బీఎన్‌రెడ్డి రైతుల కోసం నిలబడి గూండాల దాడులను తిప్పికొట్టాడు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు తెచ్చి రైతులను ఆదుకొన్నవాడే అర్జునుడవుతాడు. లాల్‌నీల్ నినాదం ఆనాటిదే.... పోలీసు చర్య తరువాత బీఎన్ నాగారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో మరోసారి ఎన్నికయ్యారు. మిర్యాలగూడ నుంచి 1971,1984, 1991లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. నిజానికి సీపీఎం ఇప్పుడు చెబుతున్న లాల్ నీల్ నినాదాన్ని ఆంధ్రమహాసభ ఆనాడు భువనగిరి సభలోనే ఎత్తుకుంది. లాల్ అంటే పోరాటం, నీల్ అంటే ఉత్పత్తిదారుడు. పంట పండించే రైతు. ఇప్పుడు వామపక్ష, ప్రజాస్వామిక శక్తులు; దళితులు ఏకం కావడం గురించి లాల్ నీల్ నినాదం ఇచ్చారు. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. బీఎన్ మహోన్నత వ్యక్తిత్వాన్నీ, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధతనీ తిరుగులేకుండా అది రుజువు చేస్తుంది. పార్టీ పరిధికి మించి కాలాతీతంగా ఆలోచించగలిగిన ఆయన దృష్టిని వెల్లడిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ సీపీఎంకు బలమైన కేంద్రం. 1995 శాసనసభ ఎన్నికల సందర్భంగా సరిగ్గా ఆ జిల్లా పార్టీలోనే చీలిక వచ్చింది. ఆ చీలికకు సామాజిక న్యాయం కేంద్ర బిందువు. తుంగతుర్తి నియోజక వర్గం నుంచి మల్లు స్వరాజ్యం (రెడ్డి)ను నిలపాలని పార్టీ నాయకత్వం అభిప్రాయపడింది. అయితే ఆ స్థానాన్ని వర్ధెల్లి బుచ్చిరాములుకు (గౌడ్)కు కేటాయించాలని బీఎన్ చెప్పారు. ఆ స్థానాన్ని ఎప్పుడూ బీఎన్, స్వరాజ్యం, వీఎన్, కుశలవరెడ్డిల కేనా అని అధిష్ఠానాన్ని నిలదీసినవారు బీఎన్. పార్టీ నాయకత్వం ఆ స్థానం బుచ్చిరాములుకు కేటాయిచింది. కానీ బుచ్చిరాములు ఓడిపోయారు. ఇందుకు స్వరాజ్యం, మల్లు వెంకటనరసింహారెడ్డిలే కారణమంటూ సామాజిక న్యాయ బృందంగా ఉన్న దళత వర్గం సీపీఎం నుంచి చీలిపోయింది. సామాజిక న్యాయం పేరిట 1996లో సీపీఎం–బీఎన్‌గా చీలిక వర్గం కొత్త శిబిరం ఏర్పాటు చేసింది. ఇంత నిబద్ధతను అప్పుడే ఆయనలో జనం చూశారు. 1997లో బీఎన్ అన్ని కులాలను, వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రెండు లక్షల మందితో సభ నిర్వహించారు. మాదిగ దండోరా, మాల మహానాడు, బీసీ సంఘం, తుడుం దెబ్బ, గిరిజన సంఘం, దళిత, గిరిజన బీసీ, మైనారిటీ వర్గాలను ఆయన ఆ వేదిక మీదకు తెచ్చారు. అయితే 2000 సంవత్సరంలోనే సీపీఎం–బీఎన్ వర్గాన్ని ఓంకార్ స్థాపించిన ఎంసీపీఐలో విలీనం చేశారు. బీబీనగర్ నుంచి రామన్నపేట, చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని సాధించిన ఘనత బీఎన్దే. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండోదశ కాలువ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయించిన ఘనత కూడా ఆయన సొంతం. ఈ సందర్భంలో బీఎన్ జీవిత భాగస్వామి సరోజిని గురించి చెప్పకపోతే ఒక లోటే. చిన్ననాడే భర్తను కోల్పోయారు సరోజిని. రావి నారాయణరెడ్డి సలహా మేరకు బీఎన్ ఆమెను వివాహం చేసుకున్నారు. రాజకీయాలు, ఉద్యమాల పట్ల పెద్దగా అవగాహన లేని ఆమె చివరకు నెలల పసికందును చంకను ఉంచుకుని తుపాకీ పట్టారు. అడవులలో ఒక బిడ్డను పొగొట్టుకుని కూడా పోరాటబాటను వీడని ధీరవనిత. బీఎన్ సంస్కర్త. విప్లవకారుడు. తుది ఊపిరి వరకు సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు. (మే 9వ తేదీ బీఎన్ వర్ధంతి) వ్యాసకర్త: చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు