ముంచెత్తిన ‘మంజీర’
మూసాపేట, న్యూస్‌లైన్: నిర్లక్ష్యం నిండా ముంచింది. అధికారుల సమన్వయ లోపంతో భరత్‌నగర్ కాలనీ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో మంజీర పైప్‌లైన్ పగిలింది. నీరు వృథాగా రోడ్డుపాలైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మోకాలి లోతున నీళ్లు చేరాయి. లింగంపల్లి-సనత్‌నగర్ సెక్షన్ మంచినీటి పైప్లైన్లు రెండు భరత్‌నగర్‌కాలనీ ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్తున్నాయి. గురువారం సాయంత్రం ఇక్కడి ఎంఎంటీఎస్ స్టేషన్ సమీపంలో మెట్రోరైలు పనుల్లో భాగంగా డ్రిల్లింగ్ చేశారు. ఈ క్రమంలో మంజీర పైప్‌లైన్‌కు రంధ్రం పడింది.
ఒక్కసారిగా నీళ్లు ఎగసిపడ్డాయి. దాదాపు మూడు గంటల పాటు నీళ్లు రోడ్లపై వృథాగా పారాయి. అనంతరం అప్రమత్తమైన జలమండలి అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ లైన్ నుంచే ఎర్రగడ్డ, అమీర్‌పేట, ఎర్రమంజిల్, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్. జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాలకు నిత్యం 120 మిలియన్ లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. పైప్‌లైన్ నుంచి వచ్చిన నీరు పక్కనే ఉన్న అమ్మవారి గుడి ని ముంచెత్తింది. మార్కెట్ వద్ద ఉన్న దుకాణాల వద్దకు మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. ఓ గుడిసె నీట మునగడంతో అందులో ఉండే వృద్ధురాలిని బయటకు తరలించారు. మెట్రోరైలు అధికారులకు మంజీర లైన్ మార్కింగ్ ఇచ్చామని, తమ తప్పేమీ లేదని జలమండలి అధికారులు చెబుతున్నారు. రెండు శాఖల అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. వీరి సమన్వయ లోపం వల్లే ఘటన చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు. తక్షణమే మరమ్మతులు చేపడతామని జలమండలి అధికారులు తెలిపారు.