breaking news
best journalists
-
సాక్షికి అవార్డుల పంట
-
సాక్షికి అవార్డుల పంట
సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): ప్రపంచ ఫొటో గ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫొటో జర్నలిస్టులకు అందించిన అవార్డుల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లు పలు అవార్డులు గెలుచుకున్నారు. ఆదివారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రదానం చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం–2016 కింద మొదటి కేటగిరీలో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాపుష్కరాలు, వనం–మనం, పవిత్ర సంఘమ కార్యక్రమాలు, కేటగిరీ రెండులో చంద్రన్నబీమా, మహిళా సాధికారిత, ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం, కేటగిరీ–3లో ఉత్తమ వార్త ఫొటో ఆఫ్ ది ఏపీ సంబంధించి బహుమతులు అందించారు. ఇక ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం–2017లో మొదటి కేటగిరీలో పోలవరం, పట్టిసీమ, పొలం పిలుస్తోంది, ఏపీలో వారసత్వ పండుగలు, రెండో కేటగిరీలో స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ గృహనిర్మాణం, చంద్రన్న చేయూత, మూడో కేటగిరీలో బెస్ట్ న్యూస్ పిక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద అవార్డులు ప్రదానం చేసి, నగదు పురస్కారం, మొమెంటోలు అందించారు. అవార్డులు అందుకున్న సాక్షి ఫొటోగ్రాఫర్లు.. 2016 సంవత్సరానికి సంబంధించి కృష్ణా పుష్కరాల విభాగంలో విజయవాడ ఫొటోగ్రాఫర్ టి.వీరభగవాన్, డి.హుస్సేన్ (కర్నూల్), ఎండీ నవాజ్ (విశాఖపట్నం) కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. చంద్రన్నబీమా, ఉమెన్ ఎంపవర్మెంట్ టూరిజం ఏపీ విభాగంలో కె. జయశంకర్‌కు (శ్రీకాకుళం) చంద్రన్నబీమా అంశంలో కన్సోలేషన్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ న్యూస్ పిక్చర్స్ అవార్డుల విభాగంలో ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి) ద్వితీయ బహుమతి అందుకోగా, టి.వీరభగవాన్ (విజయవాడ) తృతీయ, కె.జయశంకర్ (శ్రీకాకుళం) కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు. 2017 ఏడాదికి కేటగిరి–1లో మనువిశాల్ (విజయవాడ), ఎన్.కిశోర్ (విజయవాడ)కు కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. కేటగిరి–2లో సీనియర్ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియేల్ (విజయవాడ) మొదటి బహుమతి అందుకోగా, పీఎల్ మోహనరావు (విశాఖపట్నం), ఎం.ప్రసాద్ (ఒంగోలు)లకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. 2017 బెస్ట్ న్యూస్ పిక్చర్స్ విభాగంలో ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి) ద్వితీయ బహుమతి అందుకోగా, కె. చక్రపాణి (విజయవాడ) తృతీయ, పి.మనువిశాల్ (విజయవాడ) కన్సోలేషన్ బహుమతిని అందుకున్నారు. ఉత్తమ జర్నలిస్టు అవార్డులు.. ఈ సందర్భంగా ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. 2008 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో ఆరుగురికి, 2009కి నలుగురికి, 2010కి ముగ్గురికి ఇచ్చారు. 2008కి గానూ వీఆర్ నార్ల జీవిత సాఫల్య అవార్డును సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు అందుకోగా, బి.నాగేశ్వరరావు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డును నందిరాజు రాధాకృష్ణ అందుకున్నారు. కాసా సుబ్బారావు బెస్ట్ రూరల్ జర్నలిస్ట్ అవార్డును పి.వి. సత్యనారాయణ, ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును నాగదుర్గాభవాని, ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డును ఎం.వెంకటేశ్వరరావు, ఉత్తమ వీడియోగ్రాఫర్ అవార్డును ఎస్. రమేశ్ అందుకున్నారు. 2009కి గానూ ఎం.ఏ రహీమ్ ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును కె.భాస్కరరావు, ఎం.నర్సింగ్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును గంజివరపు శ్రీనివాస్, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును ఈమని రవిచంద్ర, ఉత్తమ వీడియోగ్రాఫర్ అవార్డును వి.వి.శేషగిరిరావు అందుకున్నారు. 2010కి గానూ ఎం.ఏ రహీమ్ ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డును టి.శ్రీనివాసరెడ్డి, ఎం.నర్సింగ్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును చింతముని శేఖర్, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్ట్ అవార్డును డి.చంద్రభాస్కరరావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ వాసుదేవ దీక్షితులు, సమాచార శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు, అడిషనల్ డైరెక్టర్ మల్లాది కృష్ణానంద్, సీనియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోపణలుంటే నిలదీయండి: మంత్రి కాలవ సహేతుక ఆరోపణలు వస్తే ప్రభుత్వాన్ని జర్నలిస్టులు నిలదీయవచ్చునని, సద్విమర్శ సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం ముందు ఆయన మాట్లాడుతూ.. తాను కూడా గతంలో జర్నలిస్టుగా పనిచేసినందున విలేకరుల కష్టనష్టాలు తనకు బాగా తెలుసునన్నారు. రిటైరైన జర్నలిస్టులకు పింఛన్ ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, దీనిపై ముఖ్యమంత్రితో కూడా చర్చించినట్లు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాల వారికి ప్రస్తుతం రూ.1000 పెన్షన్ ఇస్తున్నామని, దీనిని రూ. 3000 చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు ఇస్తుందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 26న అమరావతిలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రెస్ అకాడమి చైర్మన్ వాసుదేవ దీక్షితులు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్, సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు కమిషనర్ మల్లాది కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ జర్నలిస్టుల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: పత్రికా రంగంలో అత్యుత్తమ సేవలందించిన జర్నలిస్టులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో అవార్డులు అందజేయనుంది. నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం పేరిట అవార్డులను అందించనుంది. పత్రికా రంగానికి చెందిన ఆరు కేటగిరీల్లో అందజేసే ఈ అవార్డులకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానించింది. రాజా రామ్మోహన్రాయ్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ జర్నలిజం కింద రూ.లక్ష నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేస్తారు. గ్రామీణ జర్నలిజం, డెవలప్మెంటల్ రిపోర్టింగ్, స్త్రీ శక్తి, ఫొటో జర్నలిజం(సింగిల్ న్యూస్ ఫొటో, ఫొటో ఫీచర్), ఉర్దూ జర్నలిజంలో అవార్డులు అందజేస్తారు. వీటికి ఒక్కోదానికి రూ. 50 వేల నగదు పురస్కారం కూడా అందిస్తారు. న్యూస్ పేపర్, న్యూస్ ఏజన్సీల్లో పనిచేసే జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 10లోగా దరఖాస్తులు ద సెక్రెటరీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సూచనా భవన్, లోధీ రోడ్, న్యూఢిల్లీ-110003కి చేరాలి. మరిన్ని వివరాలకు (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్‌కౌన్సిల్.ఎన్ఐసీ.ఇన్) వెబ్ సైట్‌ను చూడవచ్చు.