breaking news
Ben Rhodes
-
లాడెన్ హత్యా..గుడ్‌న్యూస్!
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు అంతమొందించాయనే వార్త వినగానే అప్పటి పాక్ అధ్యక్షుడు జర్దారీ సంతోషం వ్యక్తం చేశారట! అది ‘గుడ్ న్యూస్’అన్నారట! అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు సహాయకుడిగా పనిచేసిన బెన్ రోడ్స్ ఈ విషయం వెల్లడించారు. ‘ది వరల్డ్ యాజ్ ఇటీజ్: ఎ మెమోయిర్ ఆఫ్ ఒబామా వైట్ హౌస్’అనే తన పుస్తకంలో ఇలాంటి పలు సంచలన విషయాలు వెల్లడించారు. అబోతాబాద్లో రహస్య జీవితం గడుపుతున్న లాడెన్ స్థావరంపై 2011 మే 2వ తేదీ రాత్రి అమెరికా ప్రత్యేక బలగాలు దాడిచేసి, హతమార్చాయి. ఈ విషయా న్ని వెంటనే అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా జర్దారీకి ఫోన్ చేసి చెప్పారు. అది వినగానే ‘పర్యవసానాలు ఎలా ఉన్నా, ఇది చాలా మంచి వార్త. ఇప్పటికే చాలా ఆలస్యమయింది. మీకు, అమెరికా ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు’అని జర్దారీ అన్నట్లు రోడ్స్ పేర్కొన్నారు. పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగేలా అమెరికా వ్యవహరించటంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ జర్దారీ ఆందోళన చెందలేదని రోడ్స్ తెలిపారు. జర్దారీకి తెలిపిన తర్వాతే ఒబామా లాడెన్ పతనాన్ని అమెరికా ప్రజలకు వెల్లడించారు. -
నూతనాధ్యాయానికి నాంది
మోదీ, ఒబామాల మధ్య కెమిస్ట్రీ మంచి ఫలితాలనిస్తుంది పరస్పర ప్రయోజనకర కీలకాంశాలపై ఇరువురి నేతల మధ్య చర్చ పౌర అణు ఒప్పందం అమలుపై చర్చల్లో ముందంజ ఒబామా పర్యటనపై అమెరికా వ్యాఖ్య వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు కొత్తగా ప్రారంభమవబోతున్నాయని అమెరికా ప్రకటించింది. ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీల సాన్నిహిత్యం, వ్యక్తిగత స్నేహం ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల ఫలితాలనందిస్తుందని విశ్వసిస్తున్నామని అమెరికా జాతీయ ఉప భద్రతాసలహాదారు బెన్ రోడ్స్ పేర్కొన్నారు. గత సంవత్సరం అమెరికాలో ఒబామా, మోదీల భేటీ సందర్భంగా ఇరువురు నేతల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అది ఇరుదేశాలకు ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల అనుబంధంలో దాగిన అసాధారణ శక్తిని వెలికితీసేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయన్న విషయం ఒబామా పర్యటనద్వారా ప్రపంచానికి వెల్లడవుతుందన్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలన్న మోదీ ఆహ్వానం వైట్‌హౌజ్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని రోడ్స్ వ్యాఖ్యానించారు. ఆ వేడుకలకు హాజరవుతున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత కల్పించిందన్నారు. భారత్‌తో సంబంధాల్లో పర్యావరణ మార్పు, విద్యుత్ విధానం అంశాలకు తమ ఎజెండాలో అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అలాగే, ఆర్థిక, రక్షణ రంగాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు భారత్‌తో చర్చల్లో కీలకం కానున్నాయన్నారు. ఒబామాతో పాటు అమెరికా భద్రతాసలహాదారు సునాన్ రైస్, వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిజెకర్, పలువురు అమెరికా వ్యాపార ప్రతినిధులు భారత్‌కు వస్తున్నారు. కాగా, ఒబామా పర్యటన భారత్‌కు అత్యంత ప్రధాన దౌత్యపరమైన కార్యక్రమమని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. రక్షణ, భద్రత, ఉగ్రవాదంపై పోరు, ప్రాంతీయ పరిస్థితులు.. తదితర అంశాలు ఒబామా, మోదీల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వస్తాయని వెల్లడించారు. పౌర అణు ఒప్పందం అమల్లో ఎదురవుతున్న అడ్డంకులపై ఇరుదేశాల అధికారుల మధ్య లండన్‌లో జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితం దిశగా సాగుతున్నాయన్నారు. అణుపరిహారం, అణు సరఫరా బృందంలో భారత్‌కు చోటు మొదలైన అంశాలపై సంప్రదింపుల బృందం చర్చిస్తోందన్నారు. అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రమాదం జరిగినప్పుడు అణు సరఫరాదారులే బాధ్యత వహించాలన్న భారత చట్టాలను అమెరికా, ఫ్రాన్స్‌లు అంగీకరించడం లేదు. నిర్వహణదారులే బాధ్యత వహించాలనే అంతర్జాతీయ నిబంధనలను పాటించాలని ఆ దేశాలు కోరుతున్నాయి. ఈ విషయం భారత్, అమెరికాల అణు ఒప్పందం అమలులో పీటముడిగా మారింది. ఒబామా పర్యటన సందర్భంగా ఈ సమస్యను పరిష్కరించి అణు ఒప్పందం అమలుకు మార్గం సుగమం చేయాలని ఇరుదేశాలు కృషి చేస్తున్నాయి. గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం, తాజ్ మహల్ సందర్శన మాత్రమే ఒబామా పర్యటన ఉద్దేశం అని వస్తున్న విమర్శలను అక్బరుద్దీన్ తోసిపుచ్చారు. రక్షణ, ఆర్థిక, ఇంధన, అంతర్జాతీయ, ప్రాంతీయ సంబంధాల్లో అమెరికా భారత్‌కు కీలక భాగస్వామి అని, ఆ సంబంధాల మెరుగుదలకు ఒబామా పర్యటన దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మోదీ, ఒబామా సంయుక్తంగా ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా, గతవారం ఒకసారి, గతనెల్లో ఒకసారి ఐదుగురు సభ్యుల అమెరికా భద్రతానిపుణుల బృందం ఢిల్లీలోని ఎయిమ్స్‌ను పరిశీలించింది. ముఖ్యంగా ట్రామా కేంద్రంలోని సౌకర్యాలను పరీక్షించింది. మరోవైపు, గణతంత్ర వేడుకల వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 90 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచనున్నారు.