breaking news
Bellari
-
ఆ గట్టా.. ఈ గట్టా..!
సాక్షి, అమరావతి: ఆంధ్రా–కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. నాది ఆ గట్టు అంటే.. కాదు నాది ఈ గట్టు అంటూ రెండు రాష్ట్రాలు దశాబ్దాలుగా వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాలు అటవీ సరిహద్దు (గట్టు)ను తేల్చు కోలేకపోతున్నాయి. దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్జీఐ) ఇరు రాష్ట్రాలతో చర్చలు సాగించినా సరిహద్దు సమస్య తేలలేదు సరికదా దీని నిర్ధారణకు దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో కూడా అంతుపట్టడం లేదు. దీనిని తేల్చడం కోసం హైదరాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్‌లో పలుమార్లు ఇరు రాష్ట్రాల అటవీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. 1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకుని సర్వే చేయాలని ఆంధప్రదేశ్.. తమ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ)ని ప్రామాణికంగా తీసుకోవాలని కర్ణాటక పట్టుబడుతూ వచ్చాయి. వీటిని ఆధారంగా (బేస్‌లైన్)గా తీసుకుంటే సరిహద్దు నిర్ధారణ అసాధ్యమని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం (జూలై 23న) రెండు రాష్ట్రాల ప్రతినిధులతో డెహ్రాడూన్‌లో జరిగిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఈ వివాదానికి ఎలాగైనా ముగింపు పలకాలని ఎస్జీఐ భావిస్తోంది. వివాదం ఎప్పటిది? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బళ్లారి ప్రాంతం ఉండేది. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 1953లో బళ్లారి ప్రాంతం కర్ణాటకలో (అప్పుడు మైసూర్)లో కలిసింది. దీంతో బళ్లారి రిజర్వు ఫారెస్టును ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల మధ్య విభ జించాల్సి వచ్చింది. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకుని కర్ణాటక–ఆంధప్రదేశ్ మధ్య అభయారణ్యంలో సరిహద్దును ఖరారు చేసుకుందామని అప్పట్లో మౌఖికంగా అంగీకరిం చారు. ఇలాగైతే శాస్త్రీయంగా ఉంటుందని ఎస్జీఐ నిర్ణయానికి వచ్చి అభిప్రాయాలు తెలియజేయాలని ఇరు రాష్ట్రాలకు ఎస్జీఐ లేఖలు రాసింది. మొన్నటి వరకూ జీసీపీని ప్రామాణికంగా తీసుకోవాలని వాదిస్తూ వచ్చిన కర్ణాటక.. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదంటూ ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది. మైనింగ్ సంస్థల వివాదంతో.. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి, డిహరేహల్ గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో మైనింగ్ లీజులు తీసుకున్న సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీ భూమిలో కూడా తవ్వకాలు సాగించాయనే అంశం వివాదాస్పదంగా మారింది. దీంతో ఇది సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. రెండు రాష్ట్రాల సహకారంతో సర్వేచేసి 12 వారాల్లోగా సరిహద్దును ఖరారు చేయాలని ఎస్‌జీఐని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన ఉమ్మ డి సర్వేలో ఏపీ పరిధిలోని 600 ఎకరాల వరకూ కర్ణాటక ఆక్రమించిందని తేలింది. దీనిని కర్ణాటక అంగీకరించలేదు. సరిహద్దు నిర్ధారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరో నెలలో ముగుస్తుండడంతో ఎలాగైనా ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఎస్జీఐ నిర్ణయించింది. 2 రాష్ట్రాలను ఒప్పించేందుకు ఈనెల 23న డెహ్రాడూన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై రాష్ట్ర అటవీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకోవాలని గతంలో డిమాండు చేస్తూ వచ్చాం. 1896 బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ఆధారంగా తీసుకోవాలన్న జీఎస్ఐ అభిప్రాయానికి సమ్మతి తెలపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అభిప్రాయాన్ని సోమవారం జరిగే సమావేశంలో తెలియజేయనున్నాం’ అని తెలిపారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అరెస్టు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేత, బళ్లారి నగర ఎమ్మెల్యే అనిల్లాడ్ను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. 2010లో 15 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమ మార్గంలో ఎగుమతి చేసినట్లు అనిల్ లాడ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ మేరకు ఎమ్మెల్యే అరెస్టును ప్రకటించారు. కాగా, అనిల్ ను గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రాణం తీసిన వేగం
అనంతపురం: వేగంగా వెళుతున్న ఓ బైక్ అదుపుతప్పి బోల్తా కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం అంచనహాల్ గ్రామం వద్ద 63 వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. కర్నూలు జిల్లా అగ్రహారానికి చెందిన నగేష్(32), డేగులపాడుకు చెందిన సోమశేఖర్(30) అనంతపురం జిల్లా గుంతకల్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో నగేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. (విడపనకల్) -
గాలింపు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: అనంతపురం కణేకల్‌లో హెచ్ఎల్సీ కెనాల్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం సత్వర చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం హెచ్ఎల్సీ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆచూకీ కోసం కణేకల్ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కోరారు. అలాగే విద్యార్థుల ఆచూకీని త్వరితగతిన కనుక్కోవాలని కర్ణాటక అధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం బళ్లారి వెళ్లారు. అధికారులను కలిసి విద్యార్థుల ఆచూకీపై అభ్యర్థించారు. -
6 తర్వాత బీజేపీలో బీఎస్సార్సీపీ విలీనం
సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఈ నెల ఆరో తేదీ తర్వాత తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. శ్రీరాములు తెలిపారు. ఆయన ఆదివారం కంప్లిలో విలేకరులతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతోనే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేజేపీ విలీనంతో బీజేపీకి కొండంత బలం వచ్చిందని పేర్కొన్నారు. తర్వాత బళ్లారిలో విలేకరులతో మాట్లాడుతూ బళ్లారి ఎంపీ శాంత, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, మిత్రులు గాలి జనార్దనరెడ్డి, గాలి సోమశేఖరరెడ్డి తదితర పార్టీ నేతలతో మాట్లాడి నాలుగైదు రోజుల్లో పార్టీ విలీనంపై ప్రకటన చేస్తానన్నారు. తాను బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.