breaking news
beach festival protest
-
బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై కమిటీ ఏర్పాటు
విజయవాడ: విమర్శలు, నిరసనల నేపథ్యంలో విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, ఉడా వైస్ చైర్మన్, మున్సిపల్, టూరిజం శాఖ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. కాగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి ఓ ప్రయివేట్ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించిన మాట వాస్తవమే అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఫెస్టివల్ నిర్వహణకు పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ గత నెల 15వ తేదీన దరఖాస్తు చేసుకుందని ఆయన తెలిపారు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. -
బీచ్ ఫెస్టివల్‌పై స్పందించిన అధికారులు
విశాఖ : విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ కథనాలపై స్పందించిన అధికారులు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేయటం విశేషం. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రతి కార్యక్రమంలోనూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తామని టూరిజం శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చెబుతుంటూ... బీచ్ లవ్ ఫెస్టివల్ పూర్తిగా ప్రయివేట్ కార్యక్రమం అని, ప్రభుత్వానికి సంబంధం లేదని పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రాములు నాయుడు పేర్కొన్నారు. అధికారుల వేర్వేరు ప్రకటనలతో... ఇంతకీ బీచ్ ఫెస్టివల్ ప్రభుత్వానిదా, లేక ప్రయివేట్ కార్యక్రమమా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో బీచ్ లవ్ ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మందు, విందులతో పాటు గానా బజానాలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో గోవా బీచ్‌లో ఇలాంటి ఉత్సవం నిర్వహించారు. ఈ ఏడాది విశాఖపట్నంలో అదే తరహా కార్యక్రమాలకు పూనుకోవడం, పర్యాటకాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ పేరిట సర్కారు సైతం విశృంఖల పాశ్చాత్య సంస్కృతి వ్యాప్తికి దోహదపడే ప్రదర్శనలు, ఆట పాటలు, నృత్యాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన అధికారులు మాత్రం ప్రభుత్వానికి కాదు ప్రయివేట్ కార్యక్రమని చెప్పడం గమనార్హం.