breaking news
bapatla agricultural university
-
అద్భుతం.. అన్నదాతల ధాన్యాగారం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అద్భుత ఫలితాలు సాధిస్తూ అన్నదాతల ధాన్యాగారంగా ప్రగతి పథం వైపు దూసుకుపోతున్నది. ఇక్కడ శాస్త్రవేత్తలు సృష్టిస్తున్న వరి వంగడాలు నాణ్యమైన అధిక దిగుబడితో దేశవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు అందుకుంటున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల వరి వంగడాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సాగవుతున్నాయి. విదేశాలకు ఏటా లక్షల టన్నుల బీపీటీ రకాల సన్నబియ్యం ఎగుమతి అవుతూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో ఈ పరిశోధన స్థానం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎగసింది. వరి పరిశోధన స్థానం నేపథ్యం.. 1961లో తెనాలిలో ప్రారంభమైన వరిపరిశోధన స్థానం 1973లో బాపట్లకు మార్చారు. అప్పటి నుంచి బాపట్ల వరి పరిశోధన స్థానంగా పనిచేస్తోంది. 2017లో వరి పరిశోధన స్థానం నుంచి వ్యవసాయ పరిశోధన స్థానంగా అప్‌గ్రేడ్ చేస్తూ.. 15 ఎకరాల నుంచి 40 ఎకరాలకు విస్తరించారు. కొత్త వంగడాల సృష్టి కేంద్రం.. 1982లో సోనామసూరి రకం ( బీపీటీ 3291), ధాన్యలక్ష్మి (బీపీటీ 1235), 1986లో సాంబమసూరి (బీపీటీ 5204) అనే సన్న రకం వంగడాన్ని కనుగొన్నారు. 1987లో బీపీటీ 4358, 2001లో బీపీటీ 1768 సన్నాలు, 2010లో బీపీటీ 2270 రకాల వంగడాలను సృష్టించారు. 2010లో బీపీటీ 2231, 2018లో బీపీటీ 2295 రకం ఉత్పత్తి చేయగా 2019లో బీపీటీ 2595 తేజ రకం ఉత్పత్తి చేశారు. 2020లో బీపీటీ 2782 భవతి, బీపీటీ 2411 సశ్య, 2023లో బీపీటీ 3050, బీపీటీ 2846, బీపీటీ 2841 నల్లబియ్యం, బీపీటీ 2848 హైప్రొటీన్ రకం వంగడాలను ఉత్పత్తి చేశారు. తెగుళ్లను తట్టుకునేలా నాణ్యతతో కూడిన విత్తనాలు ఉత్పత్తి చేయడం వల్లే అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇవి కాకుండా బీపీటీ 3082, 2858 రకాలు ఉత్పత్తి అయి మినీకిట్ దశలో ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు.. వరి పరిశోధన స్థానం ఏర్పడి ఇప్పటికి 61 ఏళ్లు గడుస్తోంది. 2018 ఏడాది వరకు 57 ఏళ్ల కాలంలో కేవలం 7 వంగడాలను సృష్టించగా.. గడచిన 4 ఏళ్ల కాలంలోనే 9 రకాల కొత్త వరి వంగడాలు ఉత్పత్తి చేయడం గమనార్హం. వైఎస్ జగన్ప్రభుత్వం ప్రోత్సాహం, తోడ్పాటు వల్లే త్వరితగతిన నూతన వంగడాల సృష్టి సాధ్యమవుతున్నదని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వంగడాలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన సీడ్‌ను ఉత్పత్తి చేసి అందిస్తున్నారు. ఏటా 60 ప్రైవేటు కంపెనీలకు సీడ్‌ను అందిస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఇక్కడ ఏడాదికి 600 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ తయారు చేస్తున్నారు. బీపీటీ విత్తనాల సాగు ఇలా బాపట్ల వరి పరిశోధన స్థానంలో సృష్టించిన బీపీటీ 5204 రకం విత్తనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా సుమారు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతుల కోసం నాణ్యమైన సీడ్ బాపట్ల వ్యవవసాయ పరిశోధన స్థానంలో నూతన వరి విత్తనాల ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ సృష్టించిన బీపీటీ 5204 రకం దేశవ్యాప్తంగా 75 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుండగా.. మరికొన్ని రకాల వంగడాలకు డిమాండ్ పెరిగింది. ఇవే కాకుండా బ్లాక్‌రైస్, హైప్రొటీన్రైస్ వంగడాలను సిద్ధం చేశాం. ఇవన్నీ తెగుళ్లు తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడినిచ్చి రైతులకు ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. –బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన స్థానం -
'విభజన సమయంలో అయితే కేంద్రం గుర్తించేది'
గుంటూరు: బాపట్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం 2 వేల ఎకరాల స్థలాన్ని గుర్తించాలని వ్యవసాయ కళాశాలకు కేంద్రం లేఖ రాసినట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. పనిలో పనిగా ఆమె మరోసారి సొంతపార్టీ నేతలకు చురకలు అంటించారు. కాంగ్రెస్‌ను వీడేవారు విభజన సమయంలో వీడి ఉంటే కేంద్రం గుర్తించేది అని పనబాక అన్నారు. ముగ్గురు మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్ఐడీ) సంస్థను విజయవాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీమాంధ్రలోని విజయవాడలో ఎన్ఐడీ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం మొత్తం రూ. 434 కోట్లు మంజూరు చేసింది. అంటే.. విజయవాడలో దాదాపు రూ. 108 కోట్ల వ్యయంతో ఎన్ఐడీని ఏర్పాటు చేయనున్నారు.