breaking news
balalayam
-
బాలాలయానికి సెలవు!
సాక్షి, హైదరాబాద్: దాదాపు 70 నెలలుగా లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన యాదగిరిగుట్ట బాలాలయానికి ఇక సెలవు పలకబోతున్నారు. పునర్నిర్మితమైన యాదాద్రి ప్రధాన దేవాలయం ప్రారంభం కావటానికి ముందే ప్రస్తుతం స్వామి వారు దర్శనమిస్తున్న బాలాలయాన్ని మూసేయనున్నట్టు సమాచారం. మార్చి 28న మహా సుదర్శనయాగం పూర్తి అవుతూనే యాదాద్రి కొత్త దేవాలయంలోకి స్వామి వారి ఉత్సవ, పూజా మూర్తులు వేంచేయనున్నారు. ఆ రోజు సాయంత్రం నుంచే కొత్త దేవాలయంలో స్వామివారు దర్శనమిచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతకు వారం ముందే బాలాలయ సేవలను ముగించాలని భావిస్తున్నారు. గండిచెరువు వద్ద యాగశాల.. అత్యద్భుతంగా, రాతి నిర్మాణంగా రూపుదిద్దుకున్న ప్రధాన దేవాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమీపంలోని గండి చెరువు వద్ద 75 ఎకరాల స్థలంలో 1,008 హోమగుండాలతో 6 వేల మంది రుత్విక్కుల సమక్షంలో మహా సుదర్శనయాగాన్ని నిర్వహించనున్నారు. ఈ హోమం మార్చి 21న ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. ఈ హోమాన్ని నిత్యం లక్ష మంది చొప్పున భక్తులు దర్శిస్తారని దేవాదాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇంత ఘనంగా నిర్వహించటం, భక్తులు ఇక్కడికే వస్తున్న నేపథ్యంలో, బాలాలయంలోని స్వామివారిని కూడా ఈ హోమశాల వద్దనే ప్రతిష్టించాలని భావిస్తున్నారు. మార్చి 21 నుంచి యాగసమాప్తి అయ్యే 28 ఉదయం వరకు ఇక్కడే స్వామివారి దర్శనాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చిన జీయర్ స్వామితో చర్చించారు. ఆయన అంగీకారం తెలిపిన తర్వాత దీనిపై ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అదే సమయంలో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే ప్రస్తుత బాలాలయాన్ని అలాగే నిర్వహించాలని భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఆరేళ్లపాటు బాలాలయంలో.. దేవాలయ జీర్ణోద్ధరణ సమయంలో బాలా లయాన్ని నిర్మించి ప్రధాన ఆలయంలోని మూల విరాట్టు రూపానికి ప్రాణప్రతిష్ట చేసి అందులో ప్రతిష్టించటం ఆనవాయితీ. ఉత్సవమూర్తులను కూడా అందులోనే ప్రతిష్టించి యథాప్రకారం నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. దేవాలయ జీర్ణో ద్ధరణ పూర్తయిన తర్వాత, కొత్తగా నిర్మించిన గర్భాలయంలోకి దేవేరులను తరలిస్తారు. యాదాద్రి జీర్ణోద్ధరణ పనులు 2016లో ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయం వద్ద పనులు ప్రారంభించే సమయానికి బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయానికి కాస్త దిగువన ప్రధాన ఆలయ గర్భాలయాన్ని తలపించే రీతిలో తాత్కాలిక పద్ధతిలో దీన్ని నిర్మించారు. అదే సంవత్సరం ఏప్రిల్ 21న అందులో స్వామివారికి ప్రాణప్రతిష్ట చేశారు. అప్పట్నుంచీ ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు బాలాలయమే యాదగిరీశుడి నిలయంగా మారి భక్తులకు దర్శనభాగ్యం కల్పించటం విశేషం. ప్రధాన దేవాలయం నుంచి బాలాలయంలోకి, బాలాలయం నుంచి మరో వేదిక, అక్కడి నుంచి మళ్లీ ప్రధాన దేవాలయంలోకి.. ఇలా స్వామివారు మూడు ప్రాంతాల్లో కొలువు దీరి దర్శనమివ్వటం ఓ అరుదైన ఘట్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
యాదగిరికొండ: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని బాలా లయంలో గురువారం వేద మంత్రాల నడుమ విగ్రహాలప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఉదయం 9.59 గంటలకు బంగారు కవచ మూర్తులను త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి పూజలు కొనసాగించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకారం చేశారు. స్వామి అమ్మవార్లకు తిరుమంజనస్నపనం చేసి పట్టువస్త్రాలను ధరింపజేశారు. సకల దేవతలను ఆవాహనం చేసిన కలశాలను గర్భాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ గావించారు. చినజీయర్‌స్వామి చేతుల మీదుగా హవనం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చినజీయర్ ఆధ్వర్యంలో అర్చకులు, రుత్విక్కులు, గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల అనుమతి తీసుకుని బంగారు కవచ మూర్తులను ఆలయ తిరువీధుల గుండా ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులు పూజలు నిర్వహించారు. యాదాద్రి చరిత్రలో నిలుస్తుంది... యాదాద్రి దేవస్థానం చరిత్రలో నిలిచి పోతుందని చినజీయర్ స్వామీజీ అన్నారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భక్తులకు ప్రవచనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ ఆలయం నిర్మిస్తే ప్రపంచంలో నరసింహ స్వామి ఆలయం ఎక్కడా అంటే ఇదే గుర్తుకు రావాలన్నారు. భక్తులకు కొంగు బంగారంగా ఉన్న ఈ ఆలయం మున్ముందు ఎంతో మందికి ఉపాధి చూపిస్తుందన్నారు. మనకు ఎంత తోడు ఉన్నా భగవంతుడి తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత వరకు దేవాలయాల నుంచి మాత్రమే డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడమే లక్ష్యం గా ప్రభుత్వాలు పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ప్రభుత్వ డబ్బుతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించే అంశం అని పేర్కొన్నారు. ఏడాదిలోపే పనులు పూర్తి ఏడాదిలోపే యాదాద్రి పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. యాదాద్రిని సుమారు కొన్ని వందల సంవత్సరాల దాకా చెక్కు చెదరకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.