breaking news
badmentan
-
MLA RK Roja: బ్యాడ్మింటన్ ఆడిన ఎమ్మెల్యే ఆర్కేరోజా
సాక్షి, నగరి: యువకుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికే గ్రామీణ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కేరోజా తెలిపారు. రోజా ఛారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా సంబరా ల్లో భాగంగా సోమవారం బాల్ బ్యాడ్మింటన్ పోటీ లు జరిగాయి. నగరి, పుత్తూరు మండలాలకు సంబంధించిన పోటీల్లో ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణి, సోదరుడు కుమారస్వామిరెడ్డితో బ్యాట్మింటన్ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశం లేక అనేక మంది క్రీడాకారులు మరుగున పడుతున్నారని తెలిపారు. అందువల్లే మండల, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నగరి మండలంలో.. అండర్ 17 విభాగంలో 17 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 48 జట్లు పోటీపడుతున్నాయి. నగరి డిగ్రీ కళాశాల మైదానంలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘ డైరెక్టర్ చంద్రారెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు బీఆర్వీ అయ్యప్పన్, నాయకులు దయానిధి, మురుగ, మునికృష్ణారెడ్డి, అయ్యప్ప, కన్నాయిరం తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు మండలంలో.. అండర్ 17 విభాగంలో 6 జట్లు, 17 ఏళ్లు పైబడిన విభాగంలో 36 జట్లు పోటీపడుతున్నాయి. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో ఎంపీపీ మునివేలు, మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ జయప్రకాష్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ వీఎం మాహిన్, కౌన్సిలర్లు ఏకాంబరం, వనిత, ఎంఎల్ఓ దిలీప్ మొదలి, నాయకులు కేటీ ప్రసాద్, రవీంద్ర, చక్రి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి తిరుపతిలో బ్యాడ్మింటన్ టోర్నీ
– ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ – 1100 మంది క్రీడాకారులు పేర్ల నమోదు తిరుపతి స్పోర్ట్స్: తిరుపతిలో తొలిసారిగా ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 11 మంది క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అండర్–17 బాల, బాలకలు, అండర్–19 బాల బాలికల విభాగాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో పోటీలు జరగనున్నాయి. శ్రీనివాసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలోని నాలుగు కోర్టులు, శ్రీపద్మావతీ మహిళా వర్సిటీలోని నాలుగు బ్యాడ్మింటన్ కోర్టుల్లో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా బ్యాడ్మింటన్ అసోషియేషన్ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేశారు. మొయిన్ డ్రా టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారికి రూ. 3 లక్షలు క్యాష్ ప్రైజ్గా బహుమతి, మోమెంటోలను ఇవ్వనున్నట్లు అసోషియేషన్ కార్యదర్శి జయచంద్ర, కోశాధికారి రామకృష్ణ పేర్కొన్నారు. కోచ్లు, రెఫరీలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన 10మంది సీనియర్ క్రీడాకారులు విచ్చేశారు.