breaking news
Baba ramdev industry
-
నూడుల్స్..బిస్కట్స్..ఇక సోలార్ పవర్
సాక్షి, ముంబై: ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్ మరో కీలకమైన వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. పతంజలి ఉత్పత్తులతో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలకు సైతం గుండెల్లో గుబులు పుట్టించిన రాందేవ్ తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంపై దృష్టిపెట్టారు. ఇపుడిక చైనా సోలార్ ఉత్పత్తుల సంస్థకు చెక్ పెట్టేలా సోలార్ విద్యుత్తు వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతీ ఇంటికి సోలార్విద్యుత్ లక్ష్యంగా భారీ పెట్టుబడితో సోలార్ కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. స్వదేశీ ఉద్యమానికి అనుగుణంగా సోలార్‌పవర్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశిస్తున్నామని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తద్వారా భారతదేశంలో ప్రతి ఇంటికి సోలార్విద్యుత్ సరఫరా చేసేలా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యతలో రాజీపడకుండా భారతదేశంలో సౌర ఫలకాలను తయారు చేస్తాము. కానీ చైనీస్ సోలార్ ప్యానెల్ ధరల యుద్ధంలోకి రామని ఆయన చెప్పారు. డిమాండ్ కనుగుణంగా వ్యాపార విస్తరణను పరిశీలిస్తామని బాలకృష్ణ చెప్పారు. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభంలో అడ్వాన్స్ నావిగేషన్ అండ్ సోలార్ టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. రూ .100 కోట్ల పెట్టుబడితో గ్రేటర్ నోయిడాలోని కర్మాగారాన్ని 20 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నెలకొల్పనుంది. తదుపరి రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. -
ఎర్ర చందనం వేలంలో ‘పతంజలి’ హవా
రూ.200 కోట్ల విలువైన 700 టన్నుల ఎర్ర చందనం కొన్న బాబా రామ్‌దేవ్ సంస్థ సాక్షి, హైదరాబాద్: యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన సంస్థ ‘పతంజలి’ పేరు ఇప్పు డు అంతర్జాతీయ ఎర్రచందనం వ్యాపార సంస్థ లు, అటవీ శాఖలో మార్మోగుతోంది. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థగా చిరపరితమైన న్యూఢిల్లీకి చెందిన ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ అత్యధిక పరిమాణంలో ఎర్రచందనం కొనుగోలు టెండర్లు దక్కించుకోవడమే ఇందుకు కారణం. ఎర్రచందనం విక్రయానికి ఇటీవల ఏపీ అటవీ శాఖ నిర్వహించిన గ్లోబల్ ఈ - వేలం కమ్ ఈ - టెండర్లలో 36 లాట్లను ‘పతంజలి’ చేజిక్కించుకుంది. భారత్ సహా 34 దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడి ఈ - వేలంలో 700 టన్నులను అది కైవసం చేసుకోవడం విశేషం. వేలంలో వచ్చిన అత్యధిక ధరల ప్రాతిపదికన 117 లాట్లలో 2,694 టన్నుల ఎర్రచందనం విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 700 టన్నులకు రూ. 200 కోట్లు కోట్ చేసిన పతంజలి సంస్థ ఇప్పటికే 25 శాతం మొత్తాన్ని (రూ.50 కోట్లు) డిపాజిట్ చేసింది. ఇలా ప్రభుత్వానికి వచ్చే రూ. 855.91 కోట్లలో సుమారు 25 శాతం పతంజలి సంస్థ నుంచే వస్తోంది. ఒక ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ ఇంత పెద్ద పరిమాణంలో ఎర్రచందనం దక్కించుకోవడం సాధారణ విషయం కాదని అటవీశాఖ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకూ ఎర్రచందనం వ్యాపారం చేయని పతంజలి సంస్థ ఈ సరుకును ఏమి చేస్తుందనే ఆసక్తి నెలకొంది. చెల్లింపులకు నేడే చివరి రోజు ఎర్రచందనం దక్కించుకున్న సంస్థలు తొలి విడత 25 శాతం డిపాజిట్ చేసే గడువు గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. మొత్తం 20 సంస్థలు లాట్లను పొందగా, 15 సంస్థలు డిపాజిట్ చెల్లించాయి. 21 లాట్లు (500 టన్నులు) దక్కించుకున్న దుబాయ్ సంస్థ ‘డైమండ్ స్టార్’ బుధవారం వరకు డిపాజిట్ చెల్లించలేదు. ఈ సంస్థ తీరునుబట్టి డిపాజిట్ చెల్లిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ డిపాజిట్ చెల్లించకపోతే ఈ 500 టన్నులకు టెండరు రద్దు చేయాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లించలేకపోయిన సంస్థలకు టెండరు సమయంలో అవి చేసిన డిపాజిట్‌ను ప్రభుత్వం వెనక్కు ఇవ్వదు. అపరాధ రుసుము కింద ఆ సంస్థలు ఈ మొత్తాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది.