breaking news
Baba Ram Rahim Singh
-
భారత్ వెళ్తున్నారా.. ప్రాణాలకు ముప్పే!
మెల్బోర్న్ : భారత్ వెళ్లే తమ దేశ ప్రజలను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేల్చుతూ పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆస్ట్రేలియా అధికారులు తమ పౌరులకు వివరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ మంత్రిత్వశాఖ (డీఎఫ్ఏటీ) ఈ హెచ్చరికలు జారీ చేసింది. గుర్మిత్ కేసు తీర్పు అనంతరం హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ మొదలై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఈ ఘర్షణలో దాదాపు 30 మంది వ్యక్తులు మృత్యువాత పడ్డారని, కావున అత్యవసర పని ఉంటే తప్పా భారత్‌కు ఇప్పట్లో వెళ్లకూడదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న పంచకుల కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం (ఆగస్ట్ 28న) ఖరారు చేయనుండటంతో శుక్రవారం భారత్‌లో విధ్వంసకాండ మొదలైందని, ఒకవేళ భారత్ వెళ్తున్నారంటే పూర్తి అప్రమత్తంగా ఉండాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎఫ్ఏటీ ఆస్ట్రేలియా పౌరులకు సూచించింది. -
రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్
- సంచలన తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ కోర్టు - హరియాణ, పంజాబ్‌లో హై అలర్ట్.. రోడ్లపైనే బాబా అనుచరులు పంచకుల: దేశవ్యాప్తంగా తీవ్ర ఉంత్కంఠ రేపిన అత్యాచారాల కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను అత్యాచారం కేసులో దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. అయితే గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. కోర్టు తీర్పును అనుసరిస్తూ హరియాణా పోలీసులు.. గుర్మీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని, అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకు ముందు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మీత్ 300 వాహనాల కాన్వాయ్‌తో హల్చల్ చేశారు. రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. గుర్మీత్ మద్దతుదారులు, అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకుల చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పంచకులతో పాటు పంజాబ్, హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులకుతోడు 15 వేలమంది పారామిలిటరీ బలగాలను మోహరించారు. అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించారు. డేరా సచ్చా సౌదాకు పంజాబ్, హరియాణాల్లో లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై అధికారులు నిఘా పెట్టారు. పంచకులకు వెళ్లే బస్సులు, రైళ్లపై ఆంక్షలు విధించారు. పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తన ఆశ్రమంలో ఇద్దరు సాధ్వీలపై గుర్మీత్ రామ్‌రహీం సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారని 2002లో ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డేరా చీఫ్‌పై కేసు నమోదు చేసింది. తీర్పు నేపథ్యంలో సిస్రాలోని 3 గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. (ఆ బాబా సీక్రెట్ ఏంటి?)