breaking news
avinash Arun
-
కృషితో నాస్తి దుర్భిక్షం
అది ఆరవ తరగతి గది.‘‘ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్‌కి ఎందుకు రాలేదు?’’ అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ.‘‘సార్..! మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో వాళ్లంతా వెళ్తుంటే... మా అమ్మానాన్నా నన్ను కూడా తీసుకెళ్లారు సార్!’’ అన్నాడు అవినాష్.‘‘అవునా! అయితే నీకు పనేముంది ఆ బాబాతో’’ అడిగాడు సుధాకర్ సార్!‘‘సార్ మరేమో ‘ఆనంద బాబా’ చాలా మహిమలు కలిగినవాడట. ఆయన మంత్రం చదివి తాయత్తు కడితే... ఎంత పెద్ద కష్టమైనా తీరిపోతుందట. అందుకే నేను కూడా తాయత్తు కట్టించుకోవడానికి వెళ్లాను’’ అంటూ తనచేతికున్న తాయత్తు చూపించాడు అవినాష్.‘‘ఏం లాభమటా ఈ తాయత్తుతో?’’ వెటకారంగా అడిగాడు సుధాకర్‘‘మరి ఈ తాయత్తు కట్టుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు వస్తాయట సార్!’’ఎంతో అమాయకంగా చెప్పాడు అవినాష్.వాళ్లిద్దరి సంభాషణ క్లాస్‌లోని మిగతా పిల్లలంతా వింటున్నారు. ‘‘అరే మనం కూడా ఆ తాయత్తు కట్టించుకుంటే ర్యాంకులు తెచ్చుకోవచ్చు కదరా’’అనుకుంటున్నారంతా.సుధాకర్ సార్ పిల్లల మనసులోని ఆలోచనలను ఇట్టే పట్టేశాడు. ‘‘అయితే పిల్లలు మీరు కూడా అవినాష్లాగే తాయత్తు కట్టించుకోవాలనుకుంటున్నారా?’ అన్నాడు.‘‘అవును సార్!’’ అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో..‘అయ్యో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించాలి కానీ ఇలా మాయలు, మంత్రాలు, తాయత్తులను నమ్మి పిల్లలు కృషిచేయకుండా సోమరిపోతుల్లా తయారవుతారని, ఇది వారి భవిష్యత్త్‌కు ఎంతో ప్రమాదమ’ని మనసులోనే అనుకున్నాడు సుధాకర్.అంతే కాకుండా ఆ ‘ఆనంద బాబా’ జనాలకు కష్టాలు తీరుతాయి. అనుకున్నవి జరుగుతాయని తాయత్తులిచ్చి వారి దగ్గర నుంచి పెద్దమొత్తంలో పైసలు గుంజే విధానం అప్పటికే తను విని ఉన్నాడు కనుకఎలాగైనా పిల్లల మనస్సులోని ఆ ఆలోచనలను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ‘ఆనంద బాబా’ చేసే మోసాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనుకున్నాడు. ఆ వెంటనే సుధాకర్ సార్.. స్కూల్లోని మిగతా టీచర్లతో ఈ విషయం గురించి చర్చించి చివరికి అంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు.పిల్లల దగ్గరి కొచ్చి ‘‘చూడండి పిల్లలు..! ఇప్పుడు మనమంతా ఆ ఆనంద బాబా దగ్గరకెళ్దాం. మన నాగరాజు సార్‌కి అమ్మాయి వేషం వేసి తీసుకెళ్దాం. అక్కడ బాబాను కొన్ని ప్రశ్నలు వేసి మనం పరీక్షిద్దాం.అతను కరెక్ట్‌గా సమాధానం చెబితే మీరంతా తాయత్తు కట్టుకోండి. లేదంటే ఆ బాబాకు ఏం తెలియదని, అతను చెప్పేదంతా బూటకమని తేలితే మీరు ఆయన చెప్పేది నమ్మకుండా కష్టపడి చదువుకోవాలి సరేనా?’’ అన్నాడు సుధాకర్ సార్. పిల్లలకు ఇందంతా తామాషాగా అనిపించింది. ‘‘అలాగే సార్!’’ అంటూ పిల్లలంతా గట్టిగా అరిచారు.సోషల్ టీచర్ నాగరాజు సార్‌కి అచ్చం అమ్మాయిలా ఉండేటట్లు చీర కట్టి, విగ్గు పెట్టి అమ్మాయిలా వేషం వేసి, పొట్టదగ్గర కనిపించకుండా బట్టలు చుట్టి.. కడుపు ఎత్తుగా వచ్చేటట్లు చేశారు.అవినాష్‌ని ఇంకా మిగిలిన పిల్లలను తీసుకుని ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆనంద బాబా ఉండే చోటుకు వెళ్లారు.పువ్వులతో అలంకరించిన ఆసనంమీద ఆనంద బాబా కూర్చోని ఉన్నాడు.భక్తులంతా తన్మయత్వంతో అతను చెప్పే మాటలు వింటున్నారు.కాసేపటి తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఆయన వాళ్లకి విభూతి, తాయత్తులు ఇస్తున్నాడు.సుధాకర్ సార్ కూడా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని తీసుకుని ‘ఆనందబాబా’ దగ్గరకు వెళ్లాడు. అనుమానం రాకుండా ఆనందబాబా కాళ్లను మొక్కారు.అప్పుడు సుధాకర్ సార్... ‘‘బాబా ఈమె నా భార్యకమల. మాకు పెళ్లై పదేళ్ల తర్వాత ఇప్పుడు తను గర్భం దాల్చింది. బాబా మీ మహిమలతో నా భార్య గర్భంలో ఉండేది ఏ బిడ్డో చెప్పండి’’ అన్నాడు.ఆనంద బాబా ఆడవేషంలో ఉన్న నాగరాజు సార్‌ని చూసి, అతని తలమీద చెయ్యి పెట్టి కళ్లు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్ఛరించాడు. తర్వాత కళ్లు తెరచి నవ్వుతూ ‘‘నాయనా..! నీ భార్యకు పండంటి మగబిడ్డ పుడతాడు. ఈ తాయత్తు ఆమె చేతికి కట్టునాయనా!’’ అన్నాడు. అంతే అక్కడ కూర్చున్న పిల్లలంతా పెద్దపెద్దగా నవ్వారు. వెంటనే పిల్లలవైపు తిరిగి.. ‘‘ఇప్పుడు చూశారు కదా పిల్లలూ..! ఈ బాబాకి ఎంత మహిమ ఉందో.. మన నాగరాజు సార్‌కి మగబిడ్డ పుడతాడట. ఇప్పుడు తెలిసింది కదా ఈ బాబా దగ్గర ఏ మాయలు, మహిమలు లేవని. ఇకనైనా మీరు ఇటువంటి దొంగబాబాల మాయమాటలు నమ్మడం మానేసి కష్టపడి చదువుకోవాలి. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు ఈ లోకంలో. అలా కాకుండా ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి మీరు సోమరిపోతులుగా తయారుకాకూడదు. మీ శ్రమనే మీరు నమ్ముకోవాలని మీకు తెలియజెప్పడానికే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది’’ అన్నాడు.అర్థమైనట్లుగా పిల్లలంతా తలలు ఊపారు. ఆ తర్వాత బాబా మోసాలని గ్రహించిన గ్రామస్తులు ఆ బాబాని తరిమితరిమి కొట్టారు. - వి. రోహిణి -
కోటలో పాగా
తీగ అల్లుకోడానికి ఏ మాత్రం టైమ్ పడుతుంది? ఓ మోస్తరుగా... ఏడాది లేదా రెండేళ్లు. ఆ అల్లుకున్న తీగను పీకి ఇంకో చెట్టుకు చుడితే? ఏమో... ఎండిపోతుందేమో! తల్లి ఒడిని పోగొట్టుకున్నంతగా ఫీలవుతుందేమో! పాపం... తీగ. చెప్పుకోలేదుగా. అదేనండీ ఈ కథ. తల్లి ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్లక తప్పదు. గవర్నమెంటు ఉద్యోగి. పైగా... నిజాయితీపరురాలు. ట్రాన్స్ఫర్లు తప్పవు కదా! ఆవిడ వెనకాలే ఈ తీగ... కదలాలి కదా! కోమలమైన వయసు... నిర్మలమైన మనసున్న ఆ తీగ లాంటి పిల్లాడి కథే... ఈ మరాఠీ సినిమా ‘కిల్లా’. ప్రతి ట్రాన్స్ఫర్కీ ఒక కొత్త ప్రపంచానికి అల్లుకోవాలి. వినడానికేమంత దీనంగా లేదు గానీ... చూస్తే మాత్రం బాధేస్తుంది. పన్నెండేళ్ళ పిల్లాడు... ఆ మధ్యే నాన్న చనిపోయాడు. అమ్మ, తను... ఇద్దరే! ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మకు ట్రాన్స్ఫరైంది. పుణే నుంచి చిన్న ఊరికి. వెళ్ళాలి. తప్పదు. కొత్త ఊరు,కొత్త వ్యక్తులు... కొత్త స్కూలు... ఫ్రెండ్స్ లేరు. క్రమంగా కొత్త కుర్రాళ్ళతో స్నేహంలో పడతాడు. మరోపక్క ఆఫీసులో అవినీతి మొదలు ఒంటరి తల్లిగా పిల్లాణ్ణి పెంచడంలో ఎదురయ్యే కష్టాల దాకా అమ్మ మానసిక సంఘర్షణలూ ఉంటాయి. 2015 జూన్ చివరి శుక్రవారం... మహారాష్ట్రలోని మెయిన్ సెంటర్స్‌లో మరాఠీ చిత్రం ‘కిల్లా’ రిలీజైంది. అవినాశ్ అరుణ్‌కు ఉత్కంఠగా ఉంది. ఆ రాత్రి అవినాశ్ మంచం మీద పడి దొర్లుతున్నాడు. తెగని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ... మొబైల్ చప్పుడు. ఇన్కమింగ్ మెసేజ్ టోన్. అవినాశ్ ఒక్కసారిగా ఎలర్టయ్యాడు. ఆ మెసేజిచ్చింది- అభినయ తారక విద్యాబాలన్. ‘‘హాయ్ అవినాశ్! దిసీజ్ విద్యాబాలన్. ‘కిల్లా’ చూశా. చాలా బాగుంది. సింపుల్ సినిమా. మనసును కదిలించిన సినిమా. నువ్వు తెరపై సృష్టించిన ప్రపంచం ఎంతో స్వచ్ఛంగా ఉంది. ...కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్...’’ అవినాశ్ ఆనందానికి అంతు లేదు. చిన్న సినిమా... పెద్ద విజయం ‘కిల్లా’ రిలీజైన మూడో రోజు నుంచి ఈ యువ డెరైక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ తీరిక లేనంత బిజీ. హీరోయిన్లు రాధికా ఆప్టే, కల్కీ కొచ్లిన్... దర్శకుడు హన్సల్ మెహతా... ఇలా ఒకరూ, ఇద్దరూ కాదు... వరుస మెసేజ్‌లు, ఫోన్లు! ‘కిల్లా’ కమర్షియల్ సినీ వర్గాన్నీ కదిలించింది. మొదట మహారాష్ట్రకే పరిమితమైన చిన్న సినిమా ఇది. కానీ, ప్రేక్షకులు తమ ఆదరణతో పెద్ద సినిమా చేశారు. ఈ లిమిటెడ్ బడ్జెట్ స్మాల్ ఫిల్మ్ ఇవాళ దేశమంతటా మల్టీప్లెక్సుల్లో సక్సెస్. అక్కడ చలి చాలా ఎక్కువ! ‘కిల్లా’ సక్సెస్ఫుల్ ట్రావెల్ ఏణ్ణర్ధం క్రితం ఆ శీతకాలంలో చలి చలిగా, బెరుకుగా మొదలైంది. అది 2013... దాదాపు చివరకొచ్చేస్తోంది. పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని బయటకొచ్చిన 27 ఏళ్ళ అవినాశ్ అరుణ్ కెమేరామన్‌గా కొన్ని సినిమాలకు అసిస్ట్ చేసినా, డెరైక్షన్ చేయడం అదే ఫస్ట్ టైమ్. కొత్త దర్శకులు తమ సినిమాలను సాఫీగా విడుదల చేసుకొనేందుకు వీలుగా ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ముంబయ్‌లో వర్క్‌షాప్ పెట్టింది. అవినాశ్ దానికి సెలక్టై వచ్చాడు. దర్శకుడిగా తొలికాన్పు ‘కిల్లా’ (తెలుగులో ‘కోట’) రఫ్కట్ పట్టుకొచ్చాడు. అక్కడ రఫ్కట్ చూసిన రంధ్రాన్వేషకులు తలా ఒక మాట అన్నారు. ఎవరెవరో ఏవేవో చెబుతున్నారు. ఒక దశ దాటాక, అవేవీ అవినాశ్ చెవికెక్కడం లేదు. అతనిలో ఏవేవో ఆలోచనలు, అనుమానాలు... ఫస్ట్ ఛాన్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదా? బుర్ర బద్దలైపోతోంది. ఇంతలో... డెరెక్ మాల్కమ్ లేచాడు. ఒకటే మాట చెప్పాడు... ‘బెర్లిన్‌లో ఫిబ్రవరి చలి బాగా ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రిపేరై ఉండు’. ఇండియన్ సినిమాను అమితంగా ప్రేమించి, అండగా నిలిచే బ్రిటిష్ సినీ విశ్లేషకుడు డెరెక్ మాల్కమ్ మాటలతో అర్థమైంది- జర్మనీలోని బెర్లిన్‌లో ఏటా ఫిబ్రవరిలో జరిగే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (‘బెర్లినలే’గా ప్రసిద్ధం)కు వెళ్ళే లక్షణాలు ఈ చిన్న మరాఠీ సినిమాకున్నాయన్న మాట! కాన్స్, వెనిస్ తర్వాత ప్రపంచంలో మూడో అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ అది. డెరెక్ మాటలతో అవినాశ్‌కు కొండంత ధైర్యం వచ్చింది. అంతర్జాతీయ గౌరవం... జాతీయ పురస్కారం అవినాశ్ కష్టం వృథా కాలేదు. 2014 ఫిబ్రవరి ఫస్టాఫ్... 64వ బెర్లినలేలో ‘జనరేషన్ కె ప్లస్ కాంపిటీటివ్ కేటగిరీ’కి ‘కిల్లా’ సెలెక్టయింది. సెలక్టయి, అక్కడ వరల్డ్ ప్రీమియర్ జరుపుకోవడంతో ఆగలేదు... చిల్డ్రన్స్ జ్యూరీ నుంచి టాప్ ప్రైజ్ ‘క్రిస్టల్ బేర్’ అవార్డుకు ఎలక్ట్ అయింది. అంతేనా... ఏకంగా ఇంటర్నేషనల్ జ్యూరీ నుంచి ‘ప్రత్యేక ప్రశంస’ అందుకుంది. ఒక చిన్న సినిమా... అదీ ఒక కొత్తవాడి తొలి సినిమా... ఒక చిన్న ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సింపుల్ సినిమా... ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సినీపరిశ్రమైన భారతీయ సినిమా అంతటికీ గౌరవం తెచ్చింది. జాతీయ అవార్డుల్లో బెస్ట్ మరాఠీ ఫిల్మైంది. రిలీజవుతూనే సెన్సేషనైంది. వసివాడని పసి జీవితం ‘కిల్లా’లో అంత గొప్పగా ఏం చెప్పారు? కొత్తగా ఏం చూపెట్టారు? లైఫ్... అంత కన్నా గొప్పది, కొత్తది ఏముంటుంది! జీవితంలో ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. అలవాటైన దాని నుంచి అవతలకు జరగడానికి అనిష్టం. తెలియని వాతావరణంలోకి వెళ్ళడానికి ఏదో తెలియని బెరుకు. వయస్సుతో పని లేదు... ఎక్కువ మందికి మానసిక గుంజాటనిది. ఏడో తరగతి చదివే పిల్లాడు చిన్మయ్ (అర్చిత్), తల్లి (అమృతా సుభాష్) - వారిద్దరినీ తీసుకొని దీన్ని సింపుల్‌గా, సెన్సిబుల్‌గా చూపింది ‘కిల్లా’. అల్లరిగా తిరిగే బండ్యా (బాల నటుడు పార్థ్ భలేరావ్)చేసే చేష్టలు, క్లాస్రూమ్ వాతావరణం, ప్రతిదాని గురించి పిల్లల్లో ఉండే ఆసక్తి - ఇలా ఈ సినిమాలోని అంశాలు స్థలకాలాలకు అతీతమైనవి. అయితే, బాల్యాన్ని బాధ్యతలు లేని స్వేచ్ఛాజీవితంగా నోస్టాల్జిక్ ఫీలింగ్‌తో చూపెట్టడం ‘కిల్లా’ ఉద్దేశం కాదు. బాల్యంలోనే ఉండే తుంటరితనం, టీజింగ్ మనస్తత్వం, పిల్లలు అవమానమనుకొనే విషయాలు, ఫ్రెండ్స్ వదిలేస్తారనే చిన్న భయం, పసిమనసుల లోలోతుల్లోని తెలియని ఒంటరితనం - ఇలా సీరియస్ అంశాల్ని ‘కిల్లా’ ప్రస్తావిస్తుంది. కియరస్తామీ సినిమాల్ని గుర్తుచేస్తుంది. వలస బతుకుల్లో... భౌగోళికంగా ఊరొదిలివెళ్ళడం అనివార్యమైనా, ఆ మట్టి అనుభవాల పరిమళం మనల్ని వదలకుండా వెన్నంటి ఉంటుందనే వాస్తవాన్ని ఆ పిల్లవాడి సాక్షిగా గుర్తిస్తాం. మారిన ఊళ్ళు... ఉద్యోగాలు... చదువులు... స్నేహాలు... అన్నీ కళ్ళ ముందు గిర్రున తిరుగుతాయి. ప్రతి మార్పూ ఒక కొత్త దోవ చూపిన సంగతీ మెదులుతుంది. ఒక నెల... మూడు సినిమాలు 2015... రానున్న ఆగస్ట్ ఫస్ట్... ముంబయ్‌లోని మల్టీప్లెక్స్‌లకు వెళితే, ఈసారి 3 పోస్టర్లపై.. ఒకే పేరు. అవినాశ్ అరుణ్. దర్శక - ఛాయాగ్రాహకుడిగా ‘కిల్లా’ రిలీజై, హిట్. ఆ పక్కనే... కాన్స్‌లో 2 అవార్డులు గెల్చిన హిందీ సినిమా ‘మసాన్’ (రిలీజ్ జూలై 24) పోస్టర్. ఛాయాగ్రహణం - అవినాశ్ అరుణ్. ముచ్చటగా మూడోది - హిందీ ‘దృశ్యం’ (జూలై 31). దానికీ కెమేరా అవినాశే. ఏకకాలంలో పక్కపక్కనే మూడు సినిమాలు... మూడింటికీ ఒకే టెక్నీషియన్... కెరీర్ తొలినాళ్ళలో ఒక సృజనశీలికి దక్కిన గౌరవం. మారుతున్న సినీక్రియేటర్ల ప్రయాణానికి నిదర్శనం. అవును... ‘ది ఓన్లీ పర్మినెంట్ థింగ్ ఈజ్ ఛేంజ్’. ‘ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒక్కటే’. ప్రతి మార్పునూ ధైర్యంగా స్వాగతిస్తూనే, నడిచి వచ్చిన దారిని దిగులు లేని స్మరణగా మార్చుకొంటే, జీవితం ఒక ఆనంద ప్రయాణం. మనుషులే కాదు, మరాఠీ సిన్మా కూడా అది గ్రహించి మారింది. మారుతూనే ఉంది. మరి, మన (సినిమా) వంతు ఎప్పుడు? ఈ ‘కిల్లా’ కథ ఎలా పుట్టింది? పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నప్పుడే ‘కిల్లా’ ఆలోచన అవినాశ్ మనసులో సుడులు తిరగసాగింది. అంతర్ముఖుడైన ఒక పిల్లాడు తనకు అలవాటైన కంఫర్ట్ జోన్ వదిలి, కొత్త ప్రాంతానికి వెళితే? ఫ్రెండ్సెవరూ లేరు... ఎప్పుడూ వర్షమే. అప్పుడు ఆ స్కూల్ పిల్లాడి మానసిక స్థితి ఏమిటి? ఇదంతా డెరైక్టర్ అవినాశ్ బాల్యానుభవమే. నాన్న ప్రభుత్వోద్యోగి. కొత్త పోస్టింగ్ వచ్చినప్పుడల్లా మరో ఊరికి ట్రాన్స్ఫర్. అలా అవినాశ్‌కు మూడేళ్ళ వయసులో ఉన్న ఊరు వదిలి, కొంకణ తీరానికి కుటుంబమంతా తరలి వెళ్ళింది. అప్పుడు ఎదురైన మానసిక సంఘర్షణ అతని మనసులో ముద్రపడిపోయింది. ఆ దృశ్యాలన్నీ ఈ వయసులోనూ అతణ్ణి వెంటాడుతూ ఉండేవి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తయ్యాక, హిందీ, మరాఠీ సినిమాలకు కెమేరా విభాగంలో పనిచేస్తూ వచ్చాడు అవినాశ్. ‘కాక్టెయిల్’ (2012)కు అనిల్ మెహతా దగ్గర పనిచేస్తున్నప్పుడు రచయిత తుషార్ పరాంజపేకు ‘కిల్లా’ ఐడియా చెప్పాడు. రచన చేయడానికి తుషార్ ఒప్పుకున్నాడు. కొద్దిరోజులకు ‘కై పో చే’ సెట్... అవినాశ్ ఆ సినిమాకు పనిచేస్తున్నాడు. ‘జార్ ఫిల్మ్స్’ అజయ్ జి. రాయ్ ఏదో మాటల్లో... ప్రాంతీయ భాషా చిత్రం తీయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అంతే! అవినాశ్ తన ‘కిల్లా’ కథ చెప్పడం మొదలుపెట్టాడు. పది నిమిషాలయిందో, లేదో... రాయ్ ఆగలేకపోయాడు. వెంటనే రమ్మంటూ పార్ట్నర్ అలెన్‌కు కబురుపెట్టాడు. అలెన్ రాగానే, అవినాశ్ కథ మళ్ళీ మొదలుపెట్టాడు. చెప్పడం పూర్తయింది. రెండు రోజులు చడీచప్పుడు లేదు. మూడో రోజు ఫోనొచ్చింది. ‘కిల్లా’ కథ తామే తీస్తామన్నారు ‘జార్ ఫిల్మ్స్’ రాయ్, అలెన్. మరి డెరైక్టర్? ఇంకెవరు.. అవినాశే. ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డెరైక్టర్... ఇవాళ బెస్ట్ ఫిల్మ్ ఇన్ మరాఠీ! మారుతున్న... మరాఠీ సినిమా కొన్నేళ్ళుగా మరాఠీ చిత్రపరిశ్రమ మళ్ళీ ఊపందుకొంది. దర్శకుల నుంచి కొత్త కథలు, బలమైన కథలు వస్తున్నాయి. ఏటా మరాఠీ సినిమాల రిలీజ్లు పెరిగాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను మరింతగా జనంలోకి తీసుకెళుతున్నారు. లాభాలూ పెరిగాయి. కావాలంటే, తాజా ‘కిల్లా’, అంతకు ముందొచ్చిన ‘ఎలిజబెత్ ఏకాదశి’ గురించి కనుక్కోండి. భారీ బడ్జెట్లు, సూపర్‌స్టార్స్ లాంటివేమీ లేకుండానే ఇలా పరిశ్రమ పుంజుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. మహారాష్ట్ర నగరాల్లోని మల్టీప్లెక్సుల్లో ప్రైమ్‌టైమ్‌లో మరాఠీ చిత్రాలనే ప్రదర్శించాలంటూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అది కూడా ఇండస్ట్రీ పునరుత్తేజానికి కారణం. వీటికి తోడు మరాఠీ ప్రేక్షకుల మైండ్‌సెట్ మారింది. పాపులర్ యాక్టర్స్ నటించకపోయినా, ప్రయోగాత్మక కథాంశాలను తెరపై చూస్తున్నారు. ‘కిల్లా’ కన్నా ముందే వచ్చిన ‘శాలా’, ‘ఫండ్రీ’, ‘విహీర్’ చూస్తే, ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది. దర్శకుడికి ఇదే తొలి సినిమా. ఫస్ట్ 225 స్క్రీన్సలోనే రిలీజ్. 3 రోజుల్లో 3.25 కోట్ల వసూల్ ఇవాళ దేశమంతా మల్టీప్లెక్సుల్లో హిట్. - రెంటాల జయదేవ