breaking news
avenue plantation
-
చెత్త కారణాలు చెప్పొద్దు
పనుల్లో పురోగతి లోపిస్తే సస్పెండ్ చేస్తా – నెలాఖరు నాటికి అవెన్యూ ప్లాంటేషన్‌పై రిపోర్టులు పంపండి – ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి – మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు – డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి కర్నూలు(అర్బన్): మీరు చిన్న పిల్లలు కాదు.. పదే పదే చెప్పించుకోవద్దు.. బెదిరించి పనులు చేయించే స్థితికి తీసుకురావొద్దు.. చేపట్టిన పనుల పురోగతిపై చెత్త కారణాలు చెప్పకుండా, మర్యాదను పెంచుకోవాలంటు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టరేట్లోని డ్వామా సమావేశ భవనంలో ఏపీడీ, ప్లాంటేషన్ మేనేజర్లు, డీఆర్పీఎస్లతో పీడీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలు ఏ దశలో ఉన్నాయనే నివేదికలు పంపడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? రాష్ట్రంలో మన జిల్లా 21.20 శాతం సాధించి చివరి స్థానంలో ఎందుకు ఉంది?’’ అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెలాఖరు నాటికి కనీసం 50 శాతానికి చేరుకోవాలన్నారు. అలాగే హార్టికల్చర్ ప్లాంటేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కనీసం రెండు సంవత్సరాల వయస్సు, 1.1/2 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఫారంపాండ్స్‌లో వేగం పెరగాలి తొలకరి వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టిన ఫారంపాండ్స్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటి వరకు 4వేలు మాత్రమే పూర్తయ్యాయని, పురోగతిలో ఉన్న 11వేల ఫారంపాండ్స్‌ను వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వర్మీ కంపోస్టు యూనిట్ల టార్గెట్ 6వేలు కాగా, ఇప్పటి వరకు 464 మాత్రమే పూర్తయ్యాయని, 4276 పురోగతిలో ఉన్నాయని, వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో వీటిని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 8,685 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1026 పూర్తి అయ్యాయని, మిగిలినవన్నీ పురోగతిలో ఉన్నాయని, వీటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెసేజ్‌లను నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు డ్వామా ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యాక్రమాలకు సంబంధించి పురోగతిని పెంచేందుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెసేజ్‌ల రూపంలో పంపుతున్నా కొందరు పట్టించుకోవడం లేదని పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం నుంచే కాకుండా స్వయంగా తన సెల్‌ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపుతున్నా స్పందించడం లేదన్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పీడీ హెచ్చరించారు. సమావేశంలో వాటర్‌షెడ్స్ ఏపీడీ రసూల్, ఎంఅండ్‌ఈ సులోచన, ఉపాధి హామీ పథకం సభ్యుడు సత్రం రామకృష్ణ పాల్గొన్నారు. -
సెప్టెంబర్ ఆఖరకు వెయ్యి కిలోమీటర్ల ప్లాంటేషన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సెప్టెంబరు నెలాఖరు నాటికి వెయ్యి కిలోమీటర్ల మేర ఎవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమీవేశ మందిరంలో బుధవారం ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్సీ సమావేశం జరిగింది. జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడంలో అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా కేవలం 1600 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడం శోచనీయమన్నారు. పంచాయతీ 1776 భవనాల లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరాకు సంబంధించి 25 కోట్ల నిధుల్లో కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నందిగాం పాఠశాలలో మంచినీటి సమస్య ఉందని, దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్య పరిష్కారానికి నిధులు వెచ్చించాలని తెలిపారు. మనం–వనం కార్యక్రమంలో ఎక్కడెక్కడ మొక్కలు వేశారో వివరాలను తెలపాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను నిర్వహించాలని చెప్పారు. ఇరిగేషన్‌కు సంబంధించి వంశధార భూసేకరణ మిగులు భూములలో మొక్కల పెంపకం చేపట్టేందుకు భూముల వివరాలను అందజేయాలన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలో బండ్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, హార్టికల్చర్‌లపై సమీక్షించారు. పాఠశాలల్లో పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. వెదురు, మర్రి, రావి, మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్ కింద వేయాలన్నారు. కార్యక్రమానికి డుమా పీడీ ఆర్.కూర్మనాథ్, వంశధార ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈ రవీంద్రనా«ద్, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వర్లు, అటవీ, గనుల శాఖ తదితర అధికారులు హాజరయ్యారు.