ఆరేళ్ల చిన్నారిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
పోలాకి: అభం, శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. మానవత్వం మరిచి చిన్నారిని చెరచబోయాడు. వివరాలిలా.. నరసన్నపేటలోని పురుషోత్తమనగర్కాలనీకు చెందిన వర్రు యర్రయ్య(40) ఆటో నడుపుతుంటాడు. మంగళవారం ఉదయం పోలాకి మండలంలోని గుప్పెడుపేటలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో పల్స్‌పోలియో వ్యాక్సిన్ తీసుకువచ్చాడు. ఆరోగ్య కేంద్రం తాళాలు వేసి ఉండటంతో స్వీపర్ ఇంటికి వెళ్లి తాళాలు అడిగాడు.
ఆమె తన కుమార్తె(6)తో తాళాలు పంపించింది. అంతలోనే మృగంగా మారిన యర్రయ్య ఆ చిన్నారిని ఆస్పత్రిలోకి లాక్కువెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాధిత చిన్నారి సోదరుడు గమనించి గ్రామంలోని స్ధానికులకు తెలియజేశాడు. వెంటనే వారు ఆస్పత్రిలోకి వెళ్లి ఆటోడ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. కరెంట్ స్తంభానికి కట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. నరసన్నపేట పోలీసులు కేసు విచారిస్తున్నారు. బాధిత చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్య పరీక్షలు చేసిన వైద్యాధికారి బలగ మురళి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నామన్నారు