breaking news
auctioneering
-
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలమే హాట్‌టాపిక్. అబుదాబి వేదికగా మంగళవారం వేలం పాటకు రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంఛైజీలలో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు పోటీలో ఉన్నారు.ఇంతకీ అసలు ఈ వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు? ఆటగాళ్లను మార్చుకోకుండా.. ఆక్షన్ ద్వారానే ఎందుకు కొనుగోలు చేస్తారు? బిడ్డింగ్ ఎలా జరుగుతుంది? తదితర పన్నెండు ఆసక్తికర అంశాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం!ఎందుకీ ఐపీఎల్ వేలం?లీగ్‌లో భాగమైన పది ఫ్రాంఛైజీలు.. వచ్చే సీజన్‌కు గానూ తమ జట్లను నిర్మించుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం బిడ్లు వేస్తాయి. తమ పర్సులో ఉన్న మొత్తం ద్వారా వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.వేలం ఎవరు నిర్వహిస్తారు?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. ఇండిపెండెంట్ ఆక్షనీర్ వేలంపాట పాడతారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్లను పూర్తి చేసేలా చూసుకుంటారు. తొలుత పురుషులు మాత్రమే ఐపీఎల్ ఆక్షనీర్లుగా ఉండగా.. గత కొంతకాలంగా మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా సత్తా చాటుతున్నారు.వేలానికి బదులు సింపుల్‌గా ఆటగాళ్లను మార్చుకోవచ్చా?ఫ్రాంఛైజీ మధ్య పోటీతత్వం, సమాన అవకాశాలు దక్కాలంటే వేలం నిర్వహణ తప్పనిసరి. పర్సులో అధిక మొత్తం కలిగిన ఫ్రాంఛైజీలు తొలుత టాప్ ప్లేయర్లందరినీ సొంతం చేసుకుంటే.. మిగతా ఫ్రాంఛైజీల జట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.అందుకే వేలం ద్వారానే ఆటగాళ్లను సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే, ట్రేడింగ్ ద్వారా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.ఐపీఎల్ వేలంలోకి ఆటగాళ్లు ఎలా వస్తారు?తమ దేశ క్రికెట్ బోర్డుల అనుమతితో ఆయా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో కనీస ధరతో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమకు ఆసక్తి ఉన్న ప్లేయర్ల జాబితాను సమర్పించిన తర్వాత.. అధికారికంగా ఆటగాళ్లు వేలం బరిలో నిలుస్తారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఆక్షన్ పూల్‌లోకి రాలేరు.కనీస ధర అంటే ఏమిటి?ఓ ఆటగాడు తన స్థాయికి తగిన రీతిలో కనీస ధరతో వేలంలో నమోదు చేసుకుంటాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సాధారణంగా రూ. 20 లక్షలతో వేలంలోకి వస్తారు.నిజానికి వేలంలో వివిధ స్లాబులు ఉంటాయి. అయితే, కనీస ధర ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు (సాధారణంగా రూ. 2 కోట్లతో స్టార్లు మాత్రమే ఉంటారు) సెలక్షన్ గ్యారెంటీ అనేమీ ఉండదు. ఫామ్ దృష్ట్యా ఫ్రాంఛైజీలు ఒక్కోసారి కనీస ధర అత్యంత తక్కువగా ఉన్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తాయి.అదే విధంగా తమ జట్టుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాదు ఆటగాడి వయసు కూడా ఇక్కడ కీలకమే.బిడ్డింగ్ వర్క్ ఎలా జరుగుతుంది?ఆక్షనీర్ ఆటగాడి పేరు చదవగానే.. సదరు ప్లేయర్‌పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీలు తమ పెడల్స్‌ను ఎత్తుతాయి. ఆటగాడిని దక్కించుకోవాలని భావిస్తే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడుతూ ధరను పెంచుతూ పోతాయి. ఆఖరికి మిగతా వారితో పోలిస్తే అధిక ధర పలికిన ఫ్రాంఛైజీకే ప్లేయర్ దక్కుతాడు.పర్సు విలువ సమానమేనా?లీగ్‌లోని ప్రతి ఫ్రాంఛైజీ పర్సు విలువ సమానంగానే ఉంటుంది. తమకు కేటాయించిన మొత్తం నుంచే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అదే విధంగా విదేశీ ప్లేయర్ల సంఖ్యకు కూడా ఓ పరిమితి ఉంటుంది.రిటెన్షన్, రిలీజ్లు!వేలానికి ముందు తాము అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు నిర్ణీత గడువులోగా సమర్పిస్తాయి. అదే విధంగా.. తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదులుతాయి. ఈ క్రమంలో పర్సులో మిగిలిన మొత్తం ఆధారంగా వేలంలో తమ వ్యూహాలను అమలు చేస్తాయి.అయితే, రిలీజ్ చేసిన ఆటగాడిని తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ (RTM) నిబంధన ద్వారా ఫ్రాంఛైజీలకు వెసలుబాటు ఉంటుంది. అంటే.. తాము వదిలేసిన ఆటగాడు సరసమైన ధరకే తిరిగి తమకు దొరికే క్రమంలో.. ఇతర ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైతే చెల్లిస్తుందో అదే ధరకు అతడిని తిరిగి తాము కొనుగోలు చేసుకోవచ్చు.మినీ వేలం అంటే?జట్లలో స్వల్ప మార్పుల నిమిత్తం నిర్వహించేదే మినీ వేలం. రీషఫిల్‌లో భాగంగా ఫ్రాంఛైజీలు డెత్ ఓవర్ బౌలర్లు, పవర్ హిట్టర్లు, మణికట్టు స్పిన్నర్లు.. వంటి కచ్చితమైన నైపుణ్యాలున్న కొంతమంది ఆటగాళ్ల కోసం పోటీపడతాయి.అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ మొత్తం ఎలా?అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి.. తమ జట్టులో ఇమిడిపోతాడనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడవు. ముఖ్యంగా ఇలాంటి యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. తద్వారా వారిని తమ జట్టులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భాగం చేసుకునే వీలు కలుగుతుంది. ఇందుకు రాజస్తాన్ రాయల్స్ గతేడాది మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని రూ. 1.10 కోట్లకు కొనడం నిదర్శనం. అందుకు తగ్గట్లే విధ్వంసకర శతకంతో ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అమ్ముడుపోకుండా ఉంటారెందుకు?ఫామ్‌లేమి, ఆటలో నిలకడలేకపోడం.. కనీస ధర అర్హత కంటే అధికంగా ఉందని ఫ్రాంఛైజీలు భావించడం వల్ల కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు. ఆటగాడి వయసు, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల కొనుగోలు అంశాన్ని ప్రభావితం చేశాయి.మరి ఆ ఆటగాడి పరిస్థితి ఏమిటి?తొలి రౌండ్లలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన ఆటగాడు.. ఫ్రాంఛైజీల ఆసక్తి దృష్ట్యా తదుపరి ఆక్సిలెరేటెడ్ రౌండ్లో వేలంలోకి వస్తారు. అప్పటికీ అమ్ముడుపోకుండా ఉంటే.. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వీరిని ఏ ఫ్రాంఛైజీ అయినా రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటుంది. అదీ జరగదలేదంటే.. ఆసారికి సదరు ప్లేయర్ ఐపీఎల్లో భాగం కాడు.ఇక ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎంత క్రేజ్ ఉందో.. వేలానికి కూడా అంతే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన ఆటగాడు, జట్ల కూర్పు తదితర అంశాల దృష్ట్యా క్రికెట్ ప్రేమికులు వేలం పూర్తయ్యేవరకు స్క్రీన్లకే అతుక్కుపోతారనడంలో అతిశయోక్తిలేదు.చదవండి: IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా -
ఐపీఎల్ మెగా వేలం-2025: ఎవరీ మల్లికా సాగర్? (ఫొటోలు)
-
వేలంపాట సిద్ధాంతానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: వేలంపాటల నిర్వహణకు కొత్త, మెరుగైన పద్ధతులను సృష్టించడంతోపాటు వేలంపాటల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచిన అమెరిక ఆర్థికవేత్తలు, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్ ఆర్ మిల్‌గ్రూమ్ (72), రాబర్ట్ బి విల్సన్ (83) ఈ ఏడాది నోబెల్ అవార్డుకు ఎంపికయ్యారు. వేలం పాటలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాన్ని పరిశీలించిన అవార్డు గ్రహీతలు సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని (రేడియో తరంగాలు, విమానాల ల్యాండింగ్ స్లాట్స్ వంటివి) వస్తు, సేవలను విక్రయించేందుకు కొత్త వేలం పద్ధతులను ఆవిష్కరించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు, ఇటు వినియోగదారులతోపాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందారని నోబెల్ అవార్డుల కమిటీ తెలిపింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ సోమవారం విజేతలను ప్రకటించారు. విల్సన్ తన పీహెచ్డీ సలహాదారుగా పనిచేశాడని మిల్‌గ్రూమ్ తెలిపారు. విల్సన్ మాట్లాడుతూ వేలంపాటలకు సంబంధించి మిల్‌గ్రూమ్ ఓ మేధావి అని తన పూర్వ విద్యార్థిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆర్థిక శాస్త్ర నోబెల్ అవార్డు కింద రూ.8.32 కోట్ల నగదు, బంగారు పతకం లభిస్తాయి. అన్ని వేలాలు ఒకటి కాదు... సాధారణంగా వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధమవుతారో వారికి ఆయా వస్తు, సేవలు లభ్యమవుతూంటాయి. లేదంటే ఒక పనిని అతి చౌకగా చేసిపెడతామన్న వారికీ ఆ పనిని కట్టబెట్టడమూ కద్దు. అతిపురాతనమైన, అపురూపమైన వస్తువులు మొదలుకొని ఇంటి సామాన్ల వరకూ రోజూ అనూహ్యమైన ధరలకు అమ్ముడవుతూండటం మనం చూస్తూనే ఉంటాం. వేలం ద్వారా ప్రభుత్వాలు ప్రజావసరాల కోసం వస్తు, సేవలను సమీకరించడం కూడా మనం చూస్తూంటాం. రాబర్ట్ విల్సన్, పాల్ మిల్‌గ్రూమ్‌లు వేలంపాట సిద్ధాంతం ఆధారంగా వేలంపాట జరిగే తీరు, తుది ధరలు, వేలంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసే నిబంధనలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తుదిఫలితాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వేలంలో పాల్గొనేవాళ్లు తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూండటం వల్ల ఈ విళ్లేషణ అంత సులువుగా ఉండదు. తమకు తెలిసిన, ఇతరులకు తెలిసి ఉంటుందని భావిస్తున్న సమాచారాన్ని కూడా వీరు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రాబర్ట్ విల్సన్.. సాధారణ విలువగల వస్తువుల వేలానికి సంబంధించి ఒక సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. రేడియో తరంగాల భవిష్యత్తు ధరలు, నిర్దిష్ట ప్రాంతంలోని ఖనిజాల పరిమాణం వంటివన్నమాట. ఇలాంటి అంశాల్లో సాధారణ విలువ కంటే తక్కువగా ఎందుకు బిడ్లు వేస్తారన్నది విల్సన్ తన సిద్ధాంతం ద్వారా తెలుసుకోగలిగారు. మరీ ఎక్కువగా చెల్లిస్తున్నామేమో అన్న బెంగ వీరికి ఉంటుందని విల్సన్ అంటారు. మరోవైపు పాల్ మిల్‌గ్రూమ్ వేలంపాటలకు సంబంధించి ఓ సాధారణీకరించిన సిద్ధాంతాన్ని సిద్ధం చేశారు. ఇందులో సాధారణ విలువతోపాటు ఇతర విలువలూ ఉంటాయి. ఇవి ఒక్కో బిడ్డర్‌ను బట్టి మారిపోతూంటాయి. వివిధ రకాల వేలం పద్ధతులను పరిశీలించిన మిల్‌గ్రూమ్ ఒకరకమైన పద్ధతి అమ్మేవాడికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతుందని, ఇది కూడా బిడ్డర్లు ఇతరుల అంచనా విలువలను తెలుసుకోగలిగినప్పుడు వీలవుతుందని మిల్‌గ్రూమ్ చెబుతున్నారు. 1994లో అమెరికా అధికారులు తొలిసారి రేడియో తరంగాల వేలానికి మిల్‌గ్రూమ్ సిద్ధం చేసిన సరికొత్త విధానాన్ని ఉపయోగించగా ఆ తరువాత చాలా దేశాలు అదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. -
సత్రం భూముల వేలంలో బరితెగింపు
♦ టీడీపీ నడిపించిన డ్రామా ♦ ఎన్ఏపీఎం నేతల ధ్వజం సాక్షి ప్రతినిధి, చెన్నై : ఖరీదైన సదావర్తి సత్రం భూములను వేలం పాటతో కారుచౌకగా అమ్మేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం తన బరితెగింపు తనాన్ని చాటుకుందని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ (ఎన్ఏపీఎం) జాతీయ కన్వీనర్ భూపతిరాజు రామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన చెన్నైలోని సదావర్తి సత్రం భూములను ‘అరప్పోర్ ఇయక్కం’ తమిళనాడు ప్రతినిధులు జయరామ్ వెంకటేశన్, అత్తూర్ అహ్మద్, వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధి శ్రీదేవి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో రామకృష్ణరాజు మాట్లాడుతూ తమిళనాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.5 కోట్ల నుంచి 6 కోట్లు, అలాగే ప్రభుత్వ ధరనే ఎకరా రూ.2.5 కోట్లు పలుకుతున్న భూములను రూ.27 లక్షలకు అమ్మాల్సిన అగత్యం ఏమిటని ప్రశ్నించారు. వేలంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా విస్మరించిన టీడీపీ ప్రభుత్వం తమ వారికి భూములను కట్టబెట్టేందుకు డ్రామాను నడిపించిందని విమర్శించారు. వేలం వ్యవహారంలో టీడీపీ నేతలు, అధికారుల కుమ్మక్కు స్పష్టమైందన్నారు. గతంలో నిర్వహించిన వేలం పాట రద్దు చేసి మళ్లీ వేలం పాట నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణాన్ని అడ్డుకునేందుకు ఎన్ఏపీఎంతో కలిసి పోరాడనున్నట్లు తమిళనాడుకు చెందిన అరప్పోర్ ఇయక్కం ప్రతినిధి జయరామ్ చెప్పారు. శ్రీదేవి మాట్లాడుతూ విభజనతో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఖరీదైన భూములను నామమాత్ర ధరకు అమ్మడం వెనుక మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.


