సౌతాఫ్రికాలో గాంధీ విగ్రహానికి అవమానం
దక్షిణాఫ్రికాలో జాత్యహంకార విముక్తి ఉద్యమానికి స్ఫూర్తిప్రదాతగానిలిచిన మహాత్మా గాంధీ విగ్రహానికి ఆ దేశంలో ఘోర అవమానం జరిగింది. గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ జొహాన్నెస్బర్గ్లోని ఆయన విగ్రహంపై ఓ ముష్కర మూక తెలుపు రంగు చల్లి, వ్యతిరేక నినాదాలు చేసింది.
జొహెన్నెస్బర్గ్తో మహాత్ముని అనుబంధానికి గుర్తుగా ఆ నగరం నడిబొడ్డున 1997లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని గాంధీ స్వేర్గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్ సీ) పార్టీ లోగో ధరించిన యువకుల బృందం.. బకెట్లలో తీసుకొచ్చిన తెలుపు రంగును గాంధీ విగ్రహంపై జల్లారు. అంతటితో ఆగకుండా గాంధీని జాత్యహంకారిగా అభివర్ణిస్తూ సౌతాఫ్రికాలో ఆయన విగ్రహాలన్నింటిని కూల్చాలని నినాదాలుచేశారు.
ప్రభుత్వ ఆస్తి విధ్వంసం కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా గాంధీ తమకు ఆరాధ్యుడని, విగ్రహంపై దాడిలో తమ పార్టీ ప్రమేయం లేదని ఏఎన్సీ ప్రకటించింది. ఇదంతా అధికారపార్టీ ఆడుతోన్న నాటకమని విమర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గాంధీవిగ్రహాల్లోకెల్లా జొహాన్నెస్ బర్గ్ విగ్రహం ప్రత్యేకమైనది. గాంధీజీ యుక్తవస్కుడిగా చూపే ఏకైక విగ్రహం ఇదొక్కటే!