breaking news
ATP Challenger tennis tournament in China
-
రన్నరప్ ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: నింగ్బో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రన్నరప్‌గా నిలిచాడు. చైనాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 170వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–7 (4/7), 6–4, 3–6తో ప్రపంచ 131వ ర్యాంకర్ థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తొలి సెట్లో ఎనిమిది బ్రేక్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. రన్నరప్ ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల (రూ. 9 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 65 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్‌కు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: టీఏసీ కప్ చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సత్తా చాటుకున్నాడు. చైనాలోని నాన్జింగ్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాకేత్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. సాకేత్ కెరీర్లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం 6-3, 6-3తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-3, 6-2తో రెండో సీడ్ యాన్ బాయ్ (చైనా)-రికార్డో గెడిన్ (ఇటలీ) ద్వయంపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.