breaking news
asylum seekers
-
రష్యా నుంచి పారిపోయినా తప్పని కష్టాలు.. తిరిగి అక్కడికే!
రష్యాలో ప్రభుత్వ అణచివేత, ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు ఎదుర్కొంటున్న పలువురు పౌరులు ప్రాణభయంతో దేశం విడిచి వెళ్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. అయితే, అక్కడ వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో కొందరిని తిరిగి రష్యాకు పంపిస్తున్నారు. దీంతో స్వదేశానికి చేరుకున్నాక అరెస్టులు, విచారణలు, జైలు శిక్షలు ఎదురవుతాయనే భయంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.అమెరికా నుంచి బహిష్కరణకు గురైన కాత్యా అనే మహిళ గత డిసెంబర్లో మాస్కో చేరుకోగానే భద్రతా సంస్థల అధికారుల విచారణను ఎదుర్కుంది. అయితే, రెండేళ్ల క్రితం రష్యాను విడిచి అమెరికాలో ఆశ్రయం కోరిన ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ తరువాత రష్యాలో నిరసనల్లో పాల్గొన్నట్లు, ప్రతిపక్ష ఉద్యమంలో సభ్యురాలిగా ఉన్నట్లు ఆధారాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని ఆమె తెలిపారు. అలాగే, విమానంలో వచ్చిన పురుషులకు సైనిక రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారని, తన ఫోన్లోని సమాచారాన్ని చూసి అధికారులు ప్రశ్నించారని చెప్పారు. విడుదలైనప్పటికీ పోలీసులు తరచూ తనను సంప్రదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికాలో రష్యా పౌరుల బహిష్కరణలు కూడా పెరిగాయి. 2023లో 222 మందిని తిరిగి పంపించగా, 2025లో ఆ సంఖ్య 1,200 దాటింది. దీంతో యుద్ధ వ్యతిరేక కార్యకర్తలు, రష్యా సైన్యం నుంచి పారిపోయినవారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన కార్యకర్త లియోనిడ్ మెలెఖిన్ను గత ఏడాది స్వదేశానికి పంపించగా, ఉగ్రవాదాన్ని సమర్థించారనే ఆరోపణలపై ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు బీబీసీ కథనం పేర్కొంది.అయితే, అమెరికాతోపాటు ఐరోపాలోనూ ఆశ్రయం పొందడం కష్టంగా మారుతోంది. జర్మనీలో 2023లో ఏడుగురు రష్యన్లను బహిష్కరించగా, 2025లో ఆ సంఖ్య 110 దాటింది. మరోవైపు, ఫిన్లాండ్లో ఆశ్రయం కోరిన యుద్ధ వ్యతిరేక కార్యకర్త మిఖాయిల్, ఆయన భార్య దాషా దరఖాస్తులు ఐదుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. రష్యాకు తిరిగి వెళ్తే నిర్బంధం, జైలు శిక్ష, చిత్రహింసలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించింది. అయితే, ఆశ్రయ నిర్ణయాలన్నీ అంతర్జాతీయ శరణార్థి చట్టాల ప్రకారమే తీసుకుంటున్నామని ఫిన్లాండ్ అధికారులు తెలిపారు.రష్యాలో రాజకీయ ఖైదీల సంఖ్య 2025లో 803 నుంచి 1,265కు పెరిగిందని రష్యా మానవ హక్కుల సంస్థ మెమోరియల్ పేర్కొంది. అలాగే, రష్యన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహాయం చేస్తున్న కోవ్చెగ్(Kovcheg) సంస్థకు ఆగస్టులో వచ్చిన అభ్యర్థనలు మే నెలతో పోలిస్తే పదిరెట్లు పెరిగాయని సంస్థ వ్యవస్థాపకురాలు అనస్తాసియా బురకోవా తెలిపారు. మరోసారి సైనిక సమీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో రష్యన్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో స్వదేశంలో వేధింపుల భయంతో దేశం విడిచినవారికి పశ్చిమ దేశాలు ఆశ్రయం కల్పిస్తాయా? లేక తిరిగి రష్యాకే పంపిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఇదీ చదవండి: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడి: జెలెన్స్కీ -
‘అందుకే బిడ్డ ప్రాణాలు కూడా పణంగా పెట్టాం’
న్యూయార్క్ : జీవితంలో అన్ని విధాలా నష్టపోయిన తర్వాతే తనతో పాటు బిడ్డ ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వచ్చిందని అమెరికాలో ఆశ్రయం కోరుతున్న ఓ సిక్కు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తే తమకు శాశ్వతంగా దూరమైందని విలపించారు. మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలో ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు చెందిన ఓ సిక్కు మహిళ కూడా న్యూయార్క్‌లో ఉన్న తన భర్తను కలుసుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. కూతురితో కలిసి అమెరికాకు బయల్దేరిన ఆమె అందరూ శరణార్థుల లాగే స్మగ్లర్ల చేతికి చిక్కారు. శరణార్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న స్మగ్లర్లు.. వారి నుంచి కొంతమొత్తం వసూలు చేసి ల్యూక్‌విల్లే ప్రాంతంలోని అరిజోనా ఎడారి సమీపంలో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో ఆరేళ్ల కూతురు గుర్ప్రీత్ కౌర్ దాహాన్ని తీర్చేందుకు.. చిన్నారిని తెలిసిన వాళ్ల వద్ద వదిలి ఆమె తల్లి నీటి కోసం వెదుక్కొంటూ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం, పైగా ఎడారి ప్రాంతం కావడంతో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయారు. అదృష్టవశాత్తు అమెరికా సరిహద్దు బలగాలు అక్కడికి చేరుకోవడంతో గుర్ప్రీత్ తల్లితో పాటు ఆమెతో ఉన్న మరో మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తన కూతురు ఎడారిలో వేరే చోట ఉందని చెప్పడంతో ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ చోట నిర్జీవంగా పడి ఉన్న గుర్‌ప్రీత్‌ను చూసి ఆమె తల్లి హతాశయురాలైంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ హృదయ విదారక ఘటన అమెరికాలోని సిక్కు కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గుర్ప్రీత్ తల్లిదండ్రుల తరపున అమెరికా సిక్కు కూటమి ఉమ్మడి ప్రకటనను విడుదల చేసింది. ‘ మా కూతురికి భద్రతతో కూడిన బంగారు భవిష్యత్తు అందించాలని భావించాం. అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాం. జాతి, మత, ప్రాంత, వర్ణ భేదాలకు అతీతంగా ప్రతీ తల్లిదండ్రులు తమ సంతానం కోసమే అహర్నిశలు శ్రమిస్తారని మేము భావిస్తాం. జీవితంలో పాతాళానికి పడిపోయిన తర్వాతే బిడ్డ ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. మేము తీసుకున్న ఈ కఠిన నిర్ణయం మా చిన్నారిని మాకు దూరం చేసింది’ అని వారు ప్రకటనలో పేర్కొన్నారు. కూతురు పుట్టిన ఆర్నెళ్లకే... పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ తండ్రి 2013లో అమెరికాకు వెళ్లాడు. అమెరికాలో ఆశ్రయం కోరుతూ అతడు చేసిన దరఖాస్తు న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. గుర్ప్రీత్ పుట్టిన ఆర్నెళ్ల తర్వాత అమెరికాకు వెళ్లిన అతడు మళ్లీ కూతురిని నేరుగా చూడలేదు. కాగా ప్రస్తుతం అరిజోనా ఫెసిలిటీ సెంటర్లో ఉన్న గుర్ప్రీత్ తల్లిని బస్సు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. కోర్టు ముందు ఆమె హాజరు కావాల్సి ఉంది. అక్కడే గుర్ప్రీత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి అమెరికాలో ఆశ్రయం కోరుతూ అరిజోనా గుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడాదిలో ఇప్పటి వరకు అక్కడ 58 మంది మృత్యువాత పడ్డారని పైమా కౌంటీ ఆఫీసుకు చెందిన ఓ వైద్యాధికారి తెలిపారు. గతేడాదిలో వీరి సంఖ్య 127గా ఉందని పేర్కొన్నారు. ఇక అక్రమంగా తమ దేశంలో ప్రవేశించాలని చూస్తున్న వారు.. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సరిహద్దు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ఈ నేపథ్యంలో సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. చదవండి : అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి -
అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది 7000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2017లో అమెరికాను ఆశ్రయం కోరిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది వలసబాట పట్టారని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ తన వార్షిక నివేదికలో తెలిపింది. వీరిలో 1.6 కోట్ల మంది కేవలం గత ఏడాదిలోనే వలసలకు లోనయ్యారని పేర్కొంది. రోజుకు 44,500 మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రతి రెండు సెకన్లకూ ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళుతున్నారని నివేదిక వెల్లడించింది. యుద్ధాలు, హింస, ప్రాసిక్యూషన్ల కారణంగా వరుసగా ఐదో ఏడాది 2017లో అత్యధికంగా వలసలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కాంగో సంక్షోభం, సూడాన్ యుద్ధం, రోహింగ్యా శరణార్ధుల వ్యవహారంతో వలసలు పెరిగాయని విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. -
80 వేల మంది వలసదారులు వెనక్కి!
స్వీడన్: సిరియా సంక్షోభం నేపథ్యంలో ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న వలదారులతో యురోపియన్ యూనియన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా స్వీడన్ తమ దేశంలోకి ప్రవేశించిన 80,000 మంది వలసదారులను తిప్పిపంపనున్నట్లు తెలిపింది. 2015లో మొత్తం 1,63,000 మంది ప్రజలు స్వీడన్ ఆశ్రయం కోరారు. అయితే వారిలో సగం మందికి పైగా ఆశ్రయం కల్పించిన స్వీడన్ మిగిలిన వారిని వెనక్కి పంపాలని నిర్ణయించుకుంది. దీనిపై స్వీడన్ అధికారి ఆండ్రస్ విజిమెన్ మాట్లాడుతూ.. వలసదారులలో 60 నుండి 80 వేల మందిని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో స్వీడన్ తాత్కాలిక బార్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వలసదారులను నియంత్రించే చర్యలు చేపడుతోంది. యూరప్‌లోకి అక్రమంగా వలసవస్తున్న వారికి జర్మనీతో పాటు ఇటీవల స్వీడన్ గమ్యంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆస్ట్రేలియాలో పడవ మునక: 150 మంది గల్లంతు
ఆస్ట్రేలియాలో తూర్పున ఉన్న క్రిస్టమస్ ఐలాండ్‌లో ఓ పడవ మునిగి 105 మంది శరణార్థులతో గల్లంతయ్యారని ఆ దేశ మేరిటైం సేఫ్టి అథారటీ ప్రతినిధి మంగళవారం మెల్బోర్న్లో వెల్లడించారు. ఆ శరణార్థులను రక్షించేందుకు నావికాదళం సహయక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందుకోసం వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను రంగంలోకి దింపినట్లు చెప్పారు. శరణార్థులతో వస్తున్న మరో నావికాదళానికి చెందిన పడవతోపాటు మరోకటి త్వరలో ఆస్ట్రేలియా చేరుకుంటాయని తెలిపారు. దేశంలోని శరణార్థుల కోసం సంక్షేమం చర్యలు చేపట్టినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం జులై నెలాఖరులో ప్రకటించింది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్భంధంలో ఉన్న శరణార్థులను ఆస్ట్రేలియాకు తరలించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని మేరిటైం సేఫ్టి అథారటీ అధికార ప్రతినిధి వివరించారు.


