రష్యాలో ప్రభుత్వ అణచివేత, ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు ఎదుర్కొంటున్న పలువురు పౌరులు ప్రాణభయంతో దేశం విడిచి వెళ్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో రాజకీయ ఆశ్రయం కోరుతున్నారు. అయితే, అక్కడ వారి దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో కొందరిని తిరిగి రష్యాకు పంపిస్తున్నారు. దీంతో స్వదేశానికి చేరుకున్నాక అరెస్టులు, విచారణలు, జైలు శిక్షలు ఎదురవుతాయనే భయంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన కాత్యా అనే మహిళ గత డిసెంబర్లో మాస్కో చేరుకోగానే భద్రతా సంస్థల అధికారుల విచారణను ఎదుర్కుంది. అయితే, రెండేళ్ల క్రితం రష్యాను విడిచి అమెరికాలో ఆశ్రయం కోరిన ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. ఆ తరువాత రష్యాలో నిరసనల్లో పాల్గొన్నట్లు, ప్రతిపక్ష ఉద్యమంలో సభ్యురాలిగా ఉన్నట్లు ఆధారాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని ఆమె తెలిపారు. అలాగే, విమానంలో వచ్చిన పురుషులకు సైనిక రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చారని, తన ఫోన్లోని సమాచారాన్ని చూసి అధికారులు ప్రశ్నించారని చెప్పారు. విడుదలైనప్పటికీ పోలీసులు తరచూ తనను సంప్రదిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో రష్యా పౌరుల బహిష్కరణలు కూడా పెరిగాయి. 2023లో 222 మందిని తిరిగి పంపించగా, 2025లో ఆ సంఖ్య 1,200 దాటింది. దీంతో యుద్ధ వ్యతిరేక కార్యకర్తలు, రష్యా సైన్యం నుంచి పారిపోయినవారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన కార్యకర్త లియోనిడ్ మెలెఖిన్ను గత ఏడాది స్వదేశానికి పంపించగా, ఉగ్రవాదాన్ని సమర్థించారనే ఆరోపణలపై ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు బీబీసీ కథనం పేర్కొంది.
అయితే, అమెరికాతోపాటు ఐరోపాలోనూ ఆశ్రయం పొందడం కష్టంగా మారుతోంది. జర్మనీలో 2023లో ఏడుగురు రష్యన్లను బహిష్కరించగా, 2025లో ఆ సంఖ్య 110 దాటింది. మరోవైపు, ఫిన్లాండ్లో ఆశ్రయం కోరిన యుద్ధ వ్యతిరేక కార్యకర్త మిఖాయిల్, ఆయన భార్య దాషా దరఖాస్తులు ఐదుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. రష్యాకు తిరిగి వెళ్తే నిర్బంధం, జైలు శిక్ష, చిత్రహింసలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించింది. అయితే, ఆశ్రయ నిర్ణయాలన్నీ అంతర్జాతీయ శరణార్థి చట్టాల ప్రకారమే తీసుకుంటున్నామని ఫిన్లాండ్ అధికారులు తెలిపారు.
రష్యాలో రాజకీయ ఖైదీల సంఖ్య 2025లో 803 నుంచి 1,265కు పెరిగిందని రష్యా మానవ హక్కుల సంస్థ మెమోరియల్ పేర్కొంది. అలాగే, రష్యన్లు దేశం విడిచి వెళ్లేందుకు సహాయం చేస్తున్న కోవ్చెగ్(Kovcheg) సంస్థకు ఆగస్టులో వచ్చిన అభ్యర్థనలు మే నెలతో పోలిస్తే పదిరెట్లు పెరిగాయని సంస్థ వ్యవస్థాపకురాలు అనస్తాసియా బురకోవా తెలిపారు. మరోసారి సైనిక సమీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో రష్యన్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో స్వదేశంలో వేధింపుల భయంతో దేశం విడిచినవారికి పశ్చిమ దేశాలు ఆశ్రయం కల్పిస్తాయా? లేక తిరిగి రష్యాకే పంపిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ చదవండి: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణి దాడి: జెలెన్స్కీ


