breaking news
Astrological science
-
గ్రంథ సుగంధం
జ్యోతిష గ్రంథం హస్తరేఖలపై సమగ్ర పరిశోధన గ్రంథం జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రాల లాగే లోతైనదీ, ప్రాచుర్యం గలదీ హస్తసాముద్రికం. సాముద్రిక శాస్త్రంలో అపార పరిశోధనలు చేసి, సాముద్రిక సరస్వతిగా ప్రఖ్యాతి పొందిన నాయుడు గోపాలకృష్ణ కొన్ని వందలు, వేల మంది హస్తరేఖలను పరిశీలించి, వాటి ఆధారంగా ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని రూపొందించారు. నిజానికి హస్తసాముద్రిక ం మీద పుస్తకాలు కొత్తేమీ కాదు. హిందీ, ఇంగ్లిష్ భాషలలో అనేక గ్రంథాలున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఇంత సాకల్యంగా ఉన్న పుస్తకాలు అరుదు. గతంలో ‘భాగ్యరేఖ’ అనే గ్రంథాన్ని రచించిన గోపాలకృష్ణ, దానికి లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో ఈ రచన చేశారు. ఇందులో అరచేతి పొందికను బట్టి జాతకులు ఎటువంటి స్వభావం కలవారు, వారి పనితీరు ఎలా ఉంటుంది, ఏ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడతారు... అన్నదానితో ఆరంభించి, అరచేయి వేళ్ల కొలత, అరచేతి వెనక భాగాన ఉండే వెంట్రుకల అమరిక, అరచేయి రంగు తదితరాల ఆధారంగా అప్రతిభులను చేసే ఆసక్తికరమైన ఎన్నో వివరాలను పొందుపరిచారు. వాటితోబాటు గురువ్రేలు అంటే ఏమిటి, శనివ్రేలు అంటే ఏమిటి, బొటన వేలిని ఏమని పిలుస్తారు, రెండవ వేలిని ఏమంటారు... వేలికి ఉండే కణుపులు ఎంత పరిమాణంలో, ఎలా ఉంటే ఆ వ్యక్తి స్వరూప స్వభావాలేమిటి... వంటి వాటిని తొమ్మిది అధ్యాయాల ఈ పుస్తకంలోని ఎనిమిది అధ్యాయాలలో రేఖాచిత్రాల సాయంతో చక్కగా వివరించారు. ఇక తొమ్మిదవ అధ్యాయంలో సంఖ్యాశాస్త్రమంటే ఏమిటో, దాని ప్రాశస్త్యమేమిటో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు తెలియజేశారు. మొత్తం మీద ఈ గ్రంథం సాముద్రిక శాస్త్రం గురించి తెలిసిన వారికే కాదు, అసలు ఆ శాస్త్రం గురించి ఓనమాలు తెలియని వారికి కూడా ఎంతోకొంత ఆసక్తిని, అనురక్తిని పెంచే లా చేస్తుందనడంలో సందేహం లేదు. సాముద్రికము పుటలు: 536, వెల రూ. 500 రచయిత ఫోన్ నం.9885126995; ప్రతులకు: ఆర్.వసంతలక్ష్మీనారాయణరావు ఇం.నం. 153, ఈశ్వర్ విల్లాస్, నిజాంపేట విలేజ్, హైదరాబాద్; ఫోన్ నంబర్ 9393053029 ఈమెయిల్: palmistngk@gmail.com - డి.వి.ఆర్ -
జ్యోతిషం ఏం చెబుతోంది?
ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అంటే వారందరి ఆయుష్షు అదే రోజు ముగుస్తోందనా? అస్ట్రో‘ఫన్’డా ఉపద్రవాలు సంభవించకముందే పండితులు అప్రమత్తమై, అమాయకుల ప్రాణాలను కాపాడవచ్చు కదా... అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ⇒ ఆకాశంలో ఎగురుతున్న విమానం గమ్యం చేరకముందే కుప్పకూలిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ⇒ ముందస్తు సూచనేదీ లేకుండానే ఎక్కడో ఒకచోట పెనుభూకంపం కుదిపేస్తుంది. పెద్దసంఖ్యలో జనం మరణిస్తారు. మరికొందరు క్షతగాత్రులవుతారు. ⇒ ఇంకెక్కడో ఒకచోట అగ్రరాజ్య సైన్యాలకు, ఉగ్రవాదులకు భీకర పోరాటం జరుగుతుంది. తూటాల వర్షం కురుస్తుంది, బాంబుల మోత మార్మోగుతుంది, భారీ స్థాయిలోనే జనహననం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలన్నింటిలోనూ ఏకకాలంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఎందుకలా జరిగి ఉంటుంది? వాళ్లందరికీ ఒక్కసారే ఆయుర్దాయం తీరిపోయి ఉంటుందా? వందలాది మందికి, ఒక్కోసారి వేలాది మందికి సామూహిక మారకం (మరణయోగం) ఏదైనా ఏర్పడి ఉంటుందా? జ్యోతిషాన్ని నమ్మేవాళ్లకు, జ్యోతిషాన్ని నమ్మాలా వద్దా తేల్చుకోలేని సందిగ్ధజీవులకు సహజంగానే సందేహం తలెత్తుతుంది. జననకాల, జనన ప్రదేశాల ఆధారంగా ఎవరి జాతక ఫలితాలు వారివేనని, ఎవరి యోగావయోగాల పర్యవసానాలు వారివేనని పండితులు చెబుతారు కదా, అలాంటప్పుడు వేర్వేరు స్థల, కాలాలలో జన్మించిన వారంతా మూకుమ్మడిగా ఒకేసారి ప్రాణాలు కోల్పోయే సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ ఏకకాలంలో మారకం ఏర్పడటం దాదాపు అసాధ్యం. అయితే, ఒకేచోట గుమిగూడిన జనసమూహంలో ఎక్కువమందికి మారక స్థితి ఏర్పడితే, అదే సమూహంలో ఉన్న మిగిలిన వారికి కొంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ, వారు కూడా ఆ సమూహంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తప్పదని జ్యోతిషవేత్తలు చెబుతారు. ముందే హెచ్చరించలేరా..? అలాగైతే, జ్యోతిషులెవరైనా ఇలాంటి ఉపద్రవాలు సంభవించక ముందే తగిన హెచ్చరికలు చేసి జనాన్ని అప్రమత్తం చేయవచ్చు కదా, చాలామంది అమాయకులు అపమృత్యువును తప్పించుకోగలుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ఇలాంటి సూచనలను ముందుగానే తెలుసుకున్న జ్యోతిషులు మాత్రం అపమృత్యువు నుంచి సురక్షితంగా బయటపడిన ఉదంతాలు లేకపోలేదు. అందుకు సుప్రసిద్ధ ఐరిష్ హస్తసాముద్రికుడు కీరో ఉదంతమే ఉదాహరణ. కీరో ఎలా తప్పించుకున్నాడు..? ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న కీరో కాలక్షేపానికి తన బోగీలో ఉన్న తోటి ప్రయాణికుల చేతులు పరిశీలించాడు. వారిలో ఎక్కువ మంది చేతుల్లో ఆయుర్దాయ రేఖ పొట్టిగా కనిపించింది. ప్రమాదాన్ని పసిగట్టిన కీరో, తాను చేరాల్సిన చోటు కాకపోయినా తర్వాతి స్టేషన్లోనే రైలు దిగిపోయాడు. ముందుకు సాగిన ఆ రైలు కొంతదూరం వెళ్లాక ప్రమాదానికి గురైంది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు మరణించారు. జ్యోతిష, సాముద్రికాలకు సంబంధించి చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రాచీన విద్యలపై ఆధునిక కోర్సులు.. జ్యోతిషం, హస్తసాముద్రికం, శరీరసాముద్రికం సహా పలు అతీంద్రియ విద్యలు ప్రాచీనకాలం నాటి నుంచే వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో ఉనికిలో ఉన్నాయి. ప్రాక్పశ్చిమ భేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా వీటిపై అపార విశ్వాసం గలవారు అసంఖ్యాకంగానే ఉన్నారు. వీటి శాస్త్రీయతను కొట్టిపారేసే హేతువాదులూ ఉన్నారు. జ్యోతిష, సాముద్రికాలను కాలక్షేపంగా పరిగణించేవారు, వీటిని నమ్మాలా, వద్దా తేల్చుకోలేని వారు కూడా ఉన్నారు. ఎవరెలా ఉన్నా, మనదేశంలో పలు విశ్వవిద్యాలయాలు జ్యోతిషాన్ని బోధిస్తున్నాయి. జ్యోతిషం కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది. గ్రహ నక్షత్ర గమనాలు, స్థల కాలాల ఆధారంగానే జ్యోతిష శాస్త్రం భవిష్యత్తుపై అంచనాలను చెబుతుంది. భూత వర్తమానాలనూ విశ్లేషిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవాలనే ఆసక్తి మనుషులకు సహజంగానే ఉంటుంది. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణాలకు హాజరై వార్షిక గోచార ఫలితాలు తెలుసుకోవడం, పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చే వారఫలాలు, దినఫలాలను చూడటంతోనే సరిపెట్టుకుంటారు. జ్యోతిషాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా, చాలామంది దానిని అధ్యయనం చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే, జ్యోతిష గ్రంథాలు, పంచాంగాలు దాదాపు ఒకే మూసలో ఉంటాయి. వాటిలోని భాష ఒక పట్టాన కొరుకుడు పడదు. పంచాంగాలైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, నవగ్రహాలు, ద్వాదశ రాశులు, వాటిలోని ఇరవై ఏడు నక్షత్రాలు, వాటి లక్షణాలు, ప్రభావాలు, వివిధ యోగాలు, అవయోగాలు, లగ్నం, హోర తదితర కాల విభాగాలు వంటి అంశాలపై ప్రాథమిక సమాచారం ఎక్కడా తేలికగా అర్థమయ్యే రీతిలో కనిపించదు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అందరికీ తేలికగా అర్థమయ్యేలా వివరించడానికి ఓ చిరుప్రయత్నం.. అస్ట్రో‘ఫన్’డా... ఇక నుంచి వారం వారం మీ కోసం... - కీరో, హస్తసాముద్రిక నిపుణుడు