breaking news
Assistant VRO
-
ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ వీఆర్ఓ
రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత తూప్రాన్ : అన్నదాత నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ వీఆర్ఓ ఏబీసీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన తూప్రాన్ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన కూతాడి నరసింహులు రెండేళ్ల కిత్రం సర్వే నంబరు 267లో రెండు గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిని తన భార్య ఎల్లమ్మ పేరు మీద రికార్డుల్లో మార్పు (ముటేషన్) చేయాలని గ్రామ అసిస్టెంట్ వీఆర్ఓ దేవయ్యను సంప్రదించాడు. ఇందు కోసం దేవయ్య రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకరించిన రైతు నరసింహులు మొదట్లో రూ.4 వేలు దేవయ్యకు ముట్టజెప్పాడు. అయితే మొత్తం డబ్బులు ఇస్తే గానీ పని పూర్తి చేయనని తెగేసి చెప్పాడు. రెండు నెలలుగా పనిచేయడం లేదు. దీంతో విసుగు చెందిన రైతు నరసింహులు ఇటీవల సంగారెడ్డిలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో మంగ ళవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద కాపు కాసి రైతు నరసింహులు రూ. 4 వేలు లంచం ఇస్తుండగా.. దేవయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. ఈ మేరకు దేవయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
ఏసీబీ వలకు చిక్కిన అసిస్టెంట్ వీఆర్వో
మహేశ్వరం: పహాణీని ఆన్లైన్ చేసేం దుకు రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. 3 వేలు తీసుకొని రెడ్ హ్యాండెడ్‌గా అధికారుల వలకు చిక్కాడు. ఈ సంఘటన మహేశ్వరం మండలంలోని గొల్లూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం గొల్లూరు గ్రామానికి చెందిన దార లక్ష్మీనారాయణ వ్యవసాయం చేస్తూ జీవనం సాగి స్తున్నాడు. ఆయనకు గ్రామ పరిధిలో సర్వేనంబర్ 21ఆ,ఇ లో 37 గుంటల భూమి ఉంది. సదరు భూమికి సంబంధించిన పహాణీని ఆన్లైన్ చేసేందుకు ఆయన ఆరు నెలలుగా అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ చుట్టూ తిరుగుతున్నాడు. పని జరగాలంటే రూ. 5 వేలు ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ వీఆర్వో రైతుకు స్పష్టం చేశాడు. చేసేది లేక రైతు లక్ష్మీనారాయణ గతంలో రూ. 2 వేలు ఇచ్చాడు. మిగతా రూ.3 వేలు ఇస్తేనే పని అవుతుందని అసిస్టెంట్ వీఆర్వో చెప్పాడు. డబ్బుల విషయమై ఆయన నిత్యం రైతుకు ఫోన్ చేసి వేధించసాగాడు. నిరుపేద అయిన రైతుకు డబ్బు ఇచ్చే తాహతు లేదు. దీంతో డబ్బుల కోసం వేధిస్తున్న అసిస్టెంట్ వీఆర్వోను ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలని పథకం పన్నాడు. ఈవిషయమై లక్ష్మీనారాయణ రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించి వివరాలు చెప్పాడు. అధికారుల సూచన మేరకు రైతు బుధవారం ఉదయం 8 గంటలకు గొల్లూరులోని అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్ ఇంటికి వెళ్లి రూ. 3 వేలు ఇచ్చాడు. అధికారి డబ్బులు తీసుకొని కారులో వెళ్తుండగా ఏసీబీ అధికారులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అతడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకొని గ్రామంలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ వీఆర్వోను అధికారులు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి మరిన్ని వివరాలు సేకరించారు. భయంభయం.. గొల్లూరు గ్రామంలో అసిస్టెంట్ వీర్వో పాపయ్యగౌడ్ ఏసీబీకి పట్టుబడడంతో మండలంలోని అన్నిశాఖల అధికారుల కు గుబులు పట్టుకుంది. రోజంతా భయంభయంగా గడిపారు. పాపయ్యగౌడ్‌పై పలు అవినీతి ఆరోపణలు అసిస్టెంట్ వీఆర్వో పాపయ్యగౌడ్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై చేయి చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెవె న్యూ రికార్డులు, పహాణీల కోసం రైతులు వెళ్తే డబ్బులు తీసుకోనిదే పనిచేసేవాడు కాదనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో సీఐలు ఆర్. నిరంజన్, సుదర్శన్‌రెడ్డి, సీఐ యేసుదాసు, వైవీఎల్. నాయిడు, అంజిరెడ్డి ఉన్నారు. నిత్యం వేధించేవాడు 'పహాణీ పత్రాన్ని ఆన్లైన్ చేసేందుకు అసిస్టెంట్ వీఆర్వో రూ. 5 వేలు డిమాండ్ చేశాడు. గతంలో రెండు వేలు ఇచ్చాను. మిగతా డబ్బులు ఇవ్వాలని రోజూ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడు. ఆయన వేధింపులు తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాను. మండలంలోని ఇంకా చాలా మంది అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. వారిని కూడా ఏసీబీకి పట్టిస్తాను.’ -లక్ష్మీనారాయణ, రైతు