రోడ్డు ప్రమాదంలో గవర్నర్ సహాయ కార్యదర్శికి గాయాలు
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని ఓసీటీఎల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర గవర్నర్ సహాయ కార్యదర్శికి గాయాలయ్యాయి. వివరాలు... రాజ్‌భవన్‌లో గవర్నర్ సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న పట్నాల బసంత్కుమార్తోపాటు ఆయన ముగ్గురు సోదరులు కూడా తమ కుటుంబ సభ్యులతో కలసి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వేర్వేరు కారుల్లో బయలుదేరారు. బసంత్‌కుమార్‌కు రాజ్‌భవన్‌లో ముఖ్యమైన పని ఉన్నందున సోదరుల కంటే అరగంట ముందుగానే తన సొంత కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరారు.
మార్గమధ్యలోని నార్కట్‌పల్లి సమీపంలోని ఓసీటీఎల్ వద్దకు రాగానే కారు వెనుక టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసమై టైర్ మొత్తం ఊడిపోయింది. బసంత్‌కుమార్ తలకు బలమైన గాయాలయ్యాయి. భార్య అనిత, కుమారుడు అభినవ్, కుమార్తె బెనితిలకు ఏమీ కాలేదు. సమాచారం అందుకున్న కామినేని ఆస్పత్రి అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనస్థలానికి చేరుకుని బసంత్‌కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ నరసింహన్ హుటాహుటిన నార్కట్‌పల్లికి చేరుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్‌కుమార్‌ను పరామర్శించారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీప్రభాకర్రావులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఎండీతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం గవర్నర్ ప్రమాదస్థలిని సందర్శించారు.