breaking news
article-3
-
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది
కేంద్రంపై వైఎస్సార్సీపీ ధ్వజం ఎలాంటి చర్చలు లేకుండానే పార్లమెంటును ముగించింది ఆర్టికల్-3 సవరణను పట్టించుకోలేదు ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డి విమర్శ లోక్‌పాల్‌కు మద్దతిచ్చాం: మైసూరా సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే దానిని తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. రక్షకులే భక్షకులు అయిన చందంగా ఎలాంటి చర్చలు జరుపకుండానే ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ జన ఏమాత్రం ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదని, ఆర్టికల్-3ను సవరించేలా చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం కోరినా కేంద్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టికల్-3 ని అడ్డుపెట్టుకొని దేశాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరామన్నారు. దీన్ని సవరించాలన్న తమ డిమాండ్‌కు అన్ని పార్టీలు అంగీకరించినా కేంద్రం మాత్రం వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు . ఇక తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగకుండా కేంద్రం తప్పించుకుందని విమర్శించారు. బుధవారం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడిన వెంటనే ఆయన మరో ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలతో కలిసి విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆర్టికల్-3 ప్రకారం ఇష్టారీతిగా విభజనపై నిర్ణయం తీసుకోమని తాము ఏనాడూ చెప్పలేదని, తండ్రిలా అందరికీ న్యాయం చేయమని మాత్రమే తాము చెప్పామని గుర్తుచేశారు. తాము అఖిలపక్షానికి ఇచ్చిన లేఖను వక్రీకరించవద్దని ఆయన ఈ సందర్భంగా మీడియాకు సూచించారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని, అలాంటప్పుడు ఇష్టారీతిగా విభజిస్తామంటే కుదరదని చెప్పారు. వచ్చే సమావేశాలు జీవన్మరణమే: ఎస్పీవై రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్ నాయకత్వంలో సర్వశక్తులూ ఒడ్డుతున్నామని ఎంపీ ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ జరగకుండా ప్రస్తుత సమావేశాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఫిబ్రవరిలో జరిగే సమావేశాలు తమకు జీవన్మరణమేనని చెప్పారు. లోక్‌పాల్ బిల్లు దేశంలో అవినీతిని రూపుమాపి విప్లవాత్మక మార్పు తెస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు. మా తీర్మానాన్ని పట్టించుకోలేదు: మైసూరా ఆర్టికల్-3ని సవరించాలని కోరుతూ తమ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్, ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ ఎంపీ మైసూరారెడ్డి చెప్పారు. రాష్ట్రాల విభజన అడ్డగోలుగా ఉండరాదని, దానికి ఓ కమిటీ వేయడమా? అసెంబ్లీ తీర్మానం చేయడమా? ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలని తాము కోరుతున్నామని తెలిపారు. తాము బుధవారం సైతం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చామని, అయితే లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే స్పీకర్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చలు జరుపకుండా, కేవలం తమ పనులు చక్కబెట్టుకోవాలనే దృక్పధంతోనే కేంద్రం వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఇక కేంద్రం అత్యంత కీలకంగా తీసుకొచ్చిన లోక్‌పాల్ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించామని ఆయన తెలిపారు. -
స్పీకర్‌కే పూర్తి అధికారం: బీఏసీలో నోట్
విభజన బిల్లుపై బీఏసీ భేటీలో స్పీకర్ మనోహర్ సభ్యులందరికీ నాలుగు పేజీల వివరణాత్మక నోట్ ఒకటి అందించారు. అందులో.. రాష్ట్రాల విభజన అంశాన్ని, ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రపతికి, పార్లమెంటుకు ఉన్న అధికారాలను వివరించారు. రాష్ట్రపతి సందేశంతో కూడిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదా కేంద్ర హోంశాఖ నుంచి తనకు ఏ రోజున అందింది అనే వివరాలనూ పొందుపరిచారు. దానిపై శాసనసభ నియమనిబంధనల మేరకు ఏ విధంగా సభలో చర్చకు చేపట్టే అవకాశాలున్నాయన్న విషయంలో పలు నిబంధనలను పేర్కొన్నారు. శాసనసభ 359 నిబంధన మేరకు సభా వ్యవహారాల నిర్వహణలో పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుందని తెలియజేశారు. శాసనసభ అభిప్రాయం మాత్రమే వ్యక్తపరుస్తుందని ఆ నోట్లో పరోక్షంగా పేర్కొన్నారు. విభజన బిల్లుపై ప్రతి సభ్యుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెల్లడించవచ్చనీ, సభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయనీ, క్లాజ్ వారీగా సభ్యుల అభిప్రాయాన్ని చెప్పవచ్చని, అందుకు సమయం కేటాయించటం జరుగుతుందని, సభ్యులందరూ సంప్రదాయాలు, సభా మర్యాదలు పాటించాల్సి ఉంటుందని ఈ నోట్లో పేర్కొన్నారు.