మళ్లీ పోటీచేస్తే..గీత మారుద్ది
విజయనగరం క్రైం:అధికార దర్పంతో మాట్లాడితే ప్రజలే తిరగబడతారని అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. గీతకు అంత సత్తా ఉంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీకి దిగితే ప్రజలే ఆమె తలరాత మారుస్తారని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అరకు పార్లమెంట్ స్థానానికి లక్షలాది మంది ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటువేశారని, వారి మనోభావాలకు విరుద్ధంగా నడుచుకుని, గెలిపించిన పార్టీపై విమర్శలు చేస్తే ఓటర్లే ఆమెపై తిరగబడే ప్రమాదముందన్నారు. కొత్తపల్లి గీత అంటే అరకు ఓటర్లకు తెలియదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో పోటీ చేయడం వల్లే ఆమె గెలిచారన్న విషయాన్ని మరిచిపోరాదని హితవు పలికారు. ఢిల్లీలో బీజేపీతో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కవ్వడం సబబేనా అని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలు చెబితే కురుపాంలో జరిగిన పరిస్థితే పునరావృతమవుతుందని అన్నారు. ‘పార్వతీపురం వస్తే మీ సంగతి చెబుతా’మని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎంపీ మనుషులు తొడలు చరుస్తున్నారని, విజయనగరం వస్తే తమ సంగతి ఏంటో చూపిస్తామని కోలగట్ల అన్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు సుజయ్కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణిలు నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నారని, వారిని విమర్శించడం ఎంపీకి తగదన్నారు. ఎంపీ చెప్పే మాటలకు, చూపే ఆశలకు, ప్రలోభాలకు ఎవరూ లొంగరన్నారు. గీతపై పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫి ర్యాదు చేసి, ఆమెను సస్పెండ్ చేయాలని కోరనున్నట్టు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ ‘ప్రస్తుతం మీ వెనుక తిరుగుతున్న నాయకులే మీ ఫొటోలపై పేడ ముద్దలు వేసిన సంగతిని మరచిపోవద్దు’ అని ఎంపీకి చురకలంటించారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా కార్యదర్శి జి.సూరపరాజు, మామిడి అప్పలనాయుడు, ఎస్.వి.ఎస్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.