బడ్జెట్లో బాలలకు అధిక నిధులు కేటాయించాలి
హైదరాబాద్‌సిటీ (పద్మారావునగర్): తెలంగాణ బడ్జెట్లో బాలల కోసం అధిక నిధులు కేటాయించాలని అప్స స్వచ్చంధ సంస్ధ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అప్స డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ మధుసూదనచారి, తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్‌లను కలిసి వినతి పత్రం సమర్పించారు. దేశంలో రాష్ట్రంలో 40శాతం బాలలు ఉన్నారన్నారు. అయితే వారి కోసం నిధులు భారీ ఎత్తున కేటాయించాలన్నారు. భావి భారత పౌరులైన బాలల విద్యా..వికాసానికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని...ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. బాలల ఆధారిత బడ్జెట్‌ను రూపకల్పన తొలి బడ్జెట్ చైల్డ్ ఫ్రెండ్లీ బడ్జెట్ ద్వారా ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలువాలని స్పీకర్ మధుసూదనచారి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్‌లకు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. బాలల సమస్యలపై అసెంబ్లీలో చర్చజరగాలన్నారు. బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రతినిధులతో కలిసి అసెంబ్లీలోని వివిధ పక్షాల నాయకులను కలిసి వినతి పత్రం అందజేస్తామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో అప్స ప్రతినిధులు శివరాణి, రమేష్ తదితరులు పాల్గొన్నారు