ఏటా 5,000కు పైగా కొత్త డిజైన్లు
లిబర్టీ గ్రూప్ ఈడీ అనుపమ్ బన్సల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాద రక్షల తయారీలో ఉన్న లిబర్టీ గ్రూప్ ఏటా 5,000లకుపైగా డిజైన్లను ప్రవేశపెడుతోంది. ప్రాంతాలవారీగా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా పాదరక్షలను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ ఈడీ అనుపమ్ బన్సల్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. పరిశోధన కోసం ఏటా రూ.10 కోట్ల వ్యయం చేస్నున్నట్టు చెప్పారు. 100 మందికిపైగా డిజైనర్లు కొత్త మోడళ్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారని తెలిపారు. ‘పాదరక్షల వినియోగంలో వినియోగదార్ల అభిరుచులు మారుతున్నాయి. రంగు రంగుల డిజైన్లు కోరుతున్నారు. ఏటా వినియోగం సగటున పురుషులు 2 జతలు వినియోగిస్తే.. మహిళలకు సమానంగా పిల్లలు సైతం 3-4 జతలు వాడుతున్నారు’ అని చెప్పారు.
రూ.20,000 కోట్ల మార్కెట్..: భారత్లో పాదరక్షల మార్కెట్ 10-12% వృద్ధి రేటుతో రూ. 20,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 15-20 శాతమే. అయితే బ్రాండెడ్ వైపు మళ్లుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అనుపమ్ తెలిపారు. చైనాలో తయా రీ వ్యయం పెరుగుతోందని, దీనికితోడు దేశంలో జీఎస్టీ అమలైతే చవక పాదరక్షల దిగుమతులు తగ్గుతాయన్నారు. కాగా, లిబర్టీ గ్రూప్ ప్రతిరోజు 50 వేల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. టర్నోవర్ 2014-15లో రూ. 600 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రా ల్లో కొత్తగా 20 వరకు ఎక్స్క్లూజివ్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది.