'పైసలిస్తే పాస్ చేయిస్తా'
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.ఎస్.ఆర్.చంద్రమూర్తి డబ్బులిస్తేనే పాస్ చేయిస్తానని చెబుతున్నారని విద్యార్థులు సోమవారం ప్రిన్సిపాల్‌కు, వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్ సెల్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కంప్యూటర్ సైన్స్ విభాగ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డబ్బులు చెల్లించనివారిని చెప్పి మరీ ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కళాశాలలో ఎంటెక్ ఈవెనింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇటీవల పరీక్షలు జరిగాయని తెలిపారు. ఈ పరీక్షల్లో మిమ్మల్ని పాస్ చేయిస్తానంటూ ఆయన ట్రిపుల్ ఈ బ్రాంచ్ విద్యార్థుల నుంచి లక్ష రూపాయలకు పైగా వసూలు చేశారని ఆరోపించారు. 13 మంది సివిల్ ఇంజినీరింగ్ పరీక్ష రాశారని, ఒక్కొక్కరు రూ.50 వేలు చెల్లిస్తే పాస్ చేయిస్తానని ఆయన బేరమాడారని తెలిపారు.
ముడుపులు చెల్లించని ఎనిమిదిమంది విద్యార్థులు ఫెయిలయ్యారని పేర్కొన్నారు. ఇక్కడ చదివే ఇరాక్ విద్యార్థుల నుంచి కూడా ఆయనకు బహుమతులు అందినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ విషయాలను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.