breaking news
Anita Kumari
-
రైల్వే ఉద్యోగిని బ్యాగ్ మాయం
రైలులో ప్రయాణిస్తున్న టీటీఈ(టికెట్ తనిఖీ అధికారి) హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారు. వివరాలివీ... సికింద్రాబాద్ రైల్వే టీటీఈ అనిత కుమారి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అనంతపురం నుంచి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ బయలుదేరారు. కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. దీనిపై బాధితురాలు గురువారం కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బ్యాగులో 12 గ్రాముల బంగారు గొలుసు, రూ.9వేల నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ ఆదిరెడ్డి తెలిపారు. -
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి... పరలోకానికి
బెంగళూరు, న్యూస్‌లైన్ : మేనకోడలు పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లిన అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ (45) జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సజీవ దహనమయ్యారు. సోదరి అనిత కుమారి (43)తో కలసి మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు పత్రికలు పంచాలన్నది ప్రధానోద్దేశం. వారిద్దరి దుర్మరణం వార్త తెలియడంతో పెళ్లి ముచ్చట్లతో సందడిగా ఉన్న ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్ నివాసం ఇక్కడి కళాసిపాళ్యలో ఉండగా, అనిత బాణసవాడిలో కాపురం ఉంటున్నారు. ఆమె కుమార్తె అనూషకు సతీశ్ అనే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 14న ఇక్కడి బసవనగుడిలోని కళ్యాణ మంటపంలో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెంకటేశ్...చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు సన్నిహితుడు. వారిని ఆహ్వానించడానికే సోదరితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరాడు. కుమారుడు శ్రీనివాస్ స్వయంగా బస్సు ఎక్కించాడు. బుధవారం వేకువ జామున వారు సజీవ దహనం అయ్యారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు జబ్బార్ ట్రావెల్స్ దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ట్రావెల్స్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తరువాత పోలీసులు వారికి నచ్చజెప్పారు. 22 సంవత్సరాలుగా తెలుసు.... నాగేంద్రబాబు వెంకటేశ్ 22 సంవత్సరాలుగా తనకు తెలుసునని చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగేంద్రబాబు అన్నారు. ప్రమాద స్థలికి వెళ్లిన ఆయన అక్కడి నుంచే ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. వెంకటేశ్ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటేశ్ కుటుంబాన్నిఆదుకుంటాం ...అల్లు అరవింద్ హామీ కోటె. వెంకటేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మాత అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి ఆయనిక్కడ వెంకటేశ్ కుటుంబ సభ్యులను కలుసుకుని సాంత్వన వచనాలు పలికారు. వెంకటేశ్ మృతితో కుటుంబ సభ్యుని కోల్పోయామని, ఆయన 25 ఏళ్లుగా తమకు తెలుసునని గద్గద స్వరంతో అన్నారు. బెంగళూరులో చిరంజీవి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా వెంకటేశ్ ముందుండే వారని తెలిపారు. అలాంటి వెంకటేశ్ కుటుంబాన్ని అనాథగా మిగలబోనివ్వమని అన్నారు. ఆయన పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దశ దిన కర్మ లోపు మరో సారి ఇక్కడికి వచ్చి వారికి సాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. తరలి వచ్చిన అభిమానులు, స్నేహితులు 1992 ఆగస్టు 22న వెంకటేశ్ కర్ణాటక చింరజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేవలం చిరంజీవి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆయనతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే వారు. ఆయనిక లేరని తెలియడంతో చిరంజీవి అభిమానులతో పాటు నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రభృతులు వెంకటేశ్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వెంకటేశ్ తండ్రి సుందర్ రాజ్‌ను ఓదార్చారు. స్థానిక శాసన సభ్యుడు ఆర్వీ. దేవరాజ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకుడు చింతామణి మహేష్, జేడీఎస్ నాయకుడు రవిప్రసాద్, తమిళనాడు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు నాగేష్, కర్ణాటక బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు మాణిక్య, చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు అంజి, మార్కండేయ, కర్ణాటక రామ్‌చరణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు మార్టిన్, ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, చిక్కబళ్లాపురం మొబైల్ బాబు, కేఆర్ పురం మార్కెట్ బాబు, ప్రేమ్, రాజబాబు, గోవిందస్వామి, సంతోష్, టెంట్ నాగేంద్ర, బాలాజీ, రమేష్,శీన, మోనిష్, కళ్యాణ్, మురళి, బాలయ్య అభిమానుల సంఘం నాయకులు మార్క్ శీను, అమ్ములు, శ్రీనివాస్, గోపీ, మిలటరి శివ, ఖాన్, హొసూరు బాబు, వీజీ. మంజునాథ్, గోపాల్ తదితరులు వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ధైర్య వచనాలు పలికారు.