breaking news
Animal corpses
-
సర్వం.. కల్తీమయం
యాలకులు, మిరియాలు గసగసాలు, అల్లం వెల్లుల్లి నిఖార్సుగా చూడకోయి దేన్నీ కల్తీమయమేనోయి అన్నీ! శనగ పిండి, కారంపొడి మినప్పప్పు, జీలకర్ర నీవైపే చూస్తుంటాయ్! కల్తీ లోతు కనుక్కోమంటాయ్!! వంట నూనె, గరం మసాలా, బాదం, ఫ్రూటీ..ఒక్కటేమిటీ.. ఇంట్లోని ప్రతి ఒక్కటీ.. కాదేదీ కల్తీకనర్హం!! - నగరంలోని పారిశ్రామిక వాడలు, శివారుల్లో కల్తీ దందా - జంతు కళేబరాలతో వంటనూనె.. రంపం పొట్టుతో గరం మసాలా పశు వ్యర్థాలతో రిఫైన్డ్ ఆయిల్, రంపం పొట్టుతో గరం మసాలా.. ఆలుగడ్డ, అరటి తొక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్.. ప్రమాదకర వ్యర్థాలతో వనస్పతి ఇలా.. నిత్యావసరాల్లో ఏదంటే అది రెడీ! ఈ దందాకు హైదరాబాద్ శ్రామిక వాడలు, శివారు ప్రాంతాలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. నగరంలో కాటేదాన్, శాస్త్రీపురం, బాబానగర్, బండ్లగూడలతోపాటు శివారు ప్రాంతాలైన పహాడీషరీఫ్, జల్పల్లిలో ఈ కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి యథేచ్ఛగా సాగుతోంది. ఈ సరుకంతా బేగంబజార్ కేంద్రంగా హోల్‌సేల్‌గా అమ్ముడవుతోంది. ఇదంతా తెలిసినా నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న సర్కారీ శాఖల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. - సాక్షి, హైదరాబాద్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ► అప్పుడప్పుడు నామ్‌కే వాస్తే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు, జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కల్తీ మాఫియాపై దాడులు చేసి దండుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో నిరోధించలేకపోతున్నారు. ► క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా ఆహార నమూనాలను సేకరించి పరీక్షించడంలో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ► మిర్చి బండ్లు, బిర్యానీ కేంద్రాలు, హోటళ్ల తనిఖీని విస్మరిస్తున్నారు. అమ్యామ్యాలు తీసుకుని మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ► కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి హానికరం, తప్పుడు ప్రచారం (మిస్‌బ్రాండెడ్), నాసిరకం అన్న మూడు అంశాల ఆధారంగా కేసులు నమోదు చేయాలి. కానీ అరకొరగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కేసుల తీవ్రత లేకపోవడంతో అక్రమార్కులు నామమాత్రపు జరిమానాలు చెల్లించి.. మళ్లీ యథేచ్ఛగా అదే దందా సాగిస్తున్నారు. కల్తీలతో పెరుగుతున్న కేన్సర్ కేసులు హైదరాబాద్‌లో ఏటా కొత్తగా 10 వేల కేన్సర్ కేసులు నమోదవుతుండగా.. అందులో అత్యధిక కేసులు కల్తీ ఆయిల్ వల్లే వెలుగు చూస్తున్నాయి. ఒకసారి వాడిన ఆయిల్‌ను ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, మిర్చీ బండ్ల వద్ద మళ్లీమళ్లీ వేడి చేస్తున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన నూనెలతో ప్రజలు పలు రకాల కేన్సర్ల బారిన పడుతున్నారు. మళ్లీ మళ్లీ వాడే ఆయిల్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడమే కాదు.. ఆ నూనె వాసన పీల్చినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హృద్రోగ, ఇతర జబ్బులతో నమోదవుతున్న మరణాలతో పోలిస్తే కేన్సర్ మరణాలే అధికంగా నమోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కల్తీ నూనెలతో రక్తంలో ట్రై గ్లిజరాయిడ్స్ అధికమై రక్తపోటు, మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. కల్తీ నూనెలు, నెయ్యి, వనస్పతి వినియోగంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి పలువురు గుండెపోటుకు గురవుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. కల్తీ మాఫియాకు సాక్ష్యాలివిగో.. ► నగర శివారుల్లోని జల్పల్లి గ్రామ సమీపంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో పప్పుసేట్ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు. పెద్దపెద్ద కడాయిలు ఏర్పాటు చేసి జంతు కళేబరాలను ఉడికించి ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఇటీవల సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఈ కంపెనీపై దాడిచేసి 160 డ్రమ్ములు సీజ్ చేశారు. సూపర్వైజర్ తాహేర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మళ్లీ ఇక్కడ తయారీ మొదలైంది. ► దీని సమీపంలోనే ఆవులు, గేదెల ఎముకలతో ఆయిల్ తయారు చేస్తున్న మరో 2 కంపెనీలను పోలీసులు సీజ్ చేశారు. 2 నెలల క్రితం ఈ కంపెనీలకు సమీపంలోనే బేకరీలకు నకిలీ సాస్ సరఫరా చేసే కంపెనీలపై అధికారులు దాడి చేసి పురుగులు పట్టిన సాస్‌ను పట్టుకున్నారు. ► జల్పల్లి నుంచి పహాడీషరీఫ్ కమాన్‌కు వెళ్లే దారిలో అధికారులు దాడులు చేస్తే మరిన్ని కంపెనీల్లో అక్రమాలు బయటపడే అవకాశాలున్నాయి. ► జల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా కొనసాగుతున్న నాలుగు పశు వ్యర్థాల గోడౌన్లపై ఇటీవల అధికారులు దాడులు చేశారు. పెద్దఎత్తున నిల్వ ఉన్న పశువుల ఎముకలు, కొవ్వు, ఇతర అవయవాలను గుర్తించారు. ► జల్పల్లి బుగ్గ ప్రాంతంలో దాదాపు పది వరకు పశువుల ఎముకల నుంచి నూనె, కొవ్వు, వనస్పతి తయారీ చేసే గిడ్డంగులు నడుస్తున్నాయి. ఈ నూనె, వనస్పతిని నగరంలోని మిర్చీ బండ్లు, ఇతర ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఎగుమతి చేస్తున్నారు. జల్పల్లి శ్రీరాం కాలనీలో ఓ వ్యాపారి కల్తీ ఫ్రూటీలను తయారు చేసి విక్రయిస్తున్నాడు ► ఇందిరా సొసైటీ సమీపంలోని ఓ కంపెనీ మొక్కజొన్న, ఇతర వాటితో కలిపి కల్తీ శనగ పిండి తయారు చేస్తోం ది. ఈ కంపెనీపై గతంలో ఎస్వోటీ పోలీసులు దాడులు చేసినా ఇప్పటికీ ఆ వ్యాపారి కల్తీ శనగ పిండి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ► జల్పల్లి రోడ్డులోనే కల్తీ సాస్ తయారీ కంపెనీ కొనసాగుతోంది ► శ్రీరాం కాలనీలోనే కల్తీ మసాల దినుసులు పెద్దఎత్తున తయారవుతున్నాయి. కళేబరాల నుంచి నూనె కల్తీ నూనెలు, వనస్పతి తయారీకి కాటేదాన్ పారిశ్రామికవాడ, జల్పల్లి, శాస్త్రీపురం, మల్లాపూర్, మైలార్‌దేవ్‌పల్లి, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలు అడ్డాగా మారాయి. కల్తీరాయుళ్లు నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే సంతల నుంచి తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి వాటి మాంసాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మిగిలిన కళేబరాలను పెద్ద ఇనుప గోళాలు, గిన్నెల్లో వేసి నాలుగైదురోజులపాటు మరిగించి నూనె, వనస్పతి తీస్తున్నారు. ఈ నూనెను అధిక ధర ఉండే నూనెతో కలుపుతున్నారు. ఆహారశుద్ధి (ఫుడ్‌ప్రాసెసింగ్) పరిశ్రమల ముసుగులో కల్తీ నూనెలను యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ కంపెనీల్లోకి ప్రవేశించడం సామాన్యులెవరికీ సాధ్యపడదు. ఇక్కడ పనిచేస్తున్న వారంతా బిహార్, అసోం, ఒడిశాలకు చెందిన కూలీలే. పొరపాటున ఈ కంపెనీల్లో సాగుతున్న అక్రమాలపై కన్నెత్తి చూస్తే వారిని చావబాదేందుకు సైతం వెనకాడకపోవడం వీరి నైజం. వ్యవస్థీకృత మాఫియాగా ఈ దందా సాగుతున్నా అధికారులు ఇటు వైపు దృష్టిసారించడం లేదు. కల్తీ చేస్తున్నారు ఇలా.. ► పశువుల కొవ్వులు, ఎముకల నుంచి తీసిన నూనెలను వంట నూనెల్లో కలుపుతున్నారు ► అధిక ధర ఉండే వంట నూనెలో చౌకరకం నూనె కలిపేస్తున్నారు. వనస్పతి నూనెల్లో పశువుల కొవ్వుల మిశ్రమం, రైస్‌బ్రాన్ వంటనూనెలోనూ పత్తి గింజల నూనె ను కలుపుతున్నారు ► పామాయిల్‌ను మరో నూనెతో కలిపి వనస్పతిగా తయారు చేస్తున్నారు. కోటి మందికి ముగ్గురా? ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత, తనిఖీలకు అవసరమైన వాహనాలు లేకపోవడం కల్తీల నిరోధంపై ప్రభావం చూపుతోంది. కోటి జనాభా ఉన్న గ్రేటర్లో ఆహార భద్రతా విభాగానికి 30 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం పనిచేస్తుంది ముగ్గురే! మిగతా పోస్టులన్నీ ఖాళీ. ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు ఒక అధికారి ఉండాలి. ఈ లెక్కన ఒక్క నగ రంలోనే 200 మంది అధికారులు అవసరం. బేగంబజార్‌లో అమ్మకం బేగంబజార్ అడ్డాగా కల్తీ మసాలాలు, ఆహార పదార్థాలు హోల్‌సేల్‌గా అమ్ముడవుతున్నాయి. బేగంబజార్, ఫీల్‌ఖానా, మిట్టీకాషేర్, కోల్సివాడి, బేగంబజార్ ఛత్రి ప్రాంతాల్లోని వందలాది హోల్‌సేల్ దుకాణాల్లో కల్తీ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి నగరం నలుమూలలతోపాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు కూడా చేరుతున్నాయి. ఆ ఆయిల్ చాలా ప్రమాదకరం జంతు కళేబరాలు, కొవ్వు నుంచి తీసిన ఆయిల్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇందులోని హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ కేన్సర్‌కు కారణం అవుతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, వైన్ షాపుల ముందు మిర్చి, చేపలు, చికెన్ వేపుడు బండ్ల వ్యాపారులు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే కల్తీ ఆయిల్‌ను వాడుతున్నారు. ఈ ఆయిల్ నుంచి వచ్చే వాసనను పీల్చినా ప్రమాదమే. ఇటీవల కేన్సర్ కేసులు పెరగడానికి కల్తీ ఆయిల్ కూడా కారణమే. -డాక్టర్ మోహనవంశీ, కేన్సర్ వైద్య నిపుణుడు, ఒమెగా ఆస్పత్రి జీర్ణకోశ కేన్సర్ ముప్పు శరీరంలో కొవ్వు అధికంగా చేరడం మంచిది కాదు. చికెన్, మటన్ వంటివే తక్కువ మోతాదులో తీసుకోవాలి. అలాంటిది జంతు కళేబరాల నుంచి తీసే కొవ్వు మరింత ప్రమాదం. ఇవి కాలేయం, కిడ్నీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీర్ణకోశ కేన్సర్ వ చ్చే ప్రమాదం ఉంటుంది. -డాక్టర్ పి.రఘురామ్, కేన్సర్ వైద్య నిపుణుడు పప్పుల్లో ఇలా..: పాడైన పప్పులకు మిఠాయిలో వాడే రంగులను కలిపి నిగనిగలాడే పప్పుగా మార్చేస్తున్నారు. పైకి బాగా కనిపించడంతో ప్రజలు దాన్ని వాడుతున్నారు. ఇడ్లీ, దోశల్లో తప్పనిసరిగా వాడే మినపపప్పు, మినపగుండ్లలో తెల్లటి పౌడర్ కలిపి మాయ చేస్తున్నారు. అయ్యో.. నెయ్యి..: కిలో నెయ్యి ధర సుమారు రూ.400 పలుకుతుండడంతో.. అక్రమార్కులు దీన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అసలు నెయ్యి 25 శాతం ఉంటే అందులో 75 శాతం వనస్పతి కలిపి మార్కెట్లోకి తెస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలో స్వచ్ఛమైన నెయ్యి గడ్డ కట్టదు. కానీ వనస్పతి కలిపిన నెయ్యి మాత్రం గడ్డకడుతోంది. మసాలా దినుసులు.. గసగసాలు: ఉప్మా రవ్వను గసగసాలుగా మార్చేందుకు పిండిమరలో వేస్తారు. పలుకుగా మారగానే వాటిని గసగసాల్లో కలుపుతున్నారు. తెల్లగా ఉండేం దుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు. ఒరిజినల్ గసగసాలు రూ.350 వరకూ విక్రయిస్తుండగా, నకిలీవి కేవలం రూ.50 కిలో చొప్పున తయారవుతాయి. జీలకర్రనూ వదలట్లేదు ఒక కేజీ హైడ్రోసల్ఫైట్, 25 కేజీల రెల్లు గడ్డి పూలను 4 లీటర్ల నీటిలో 5 నుంచి 10 నిమిషాలు నానబెడతారు. వాటిని రోలింగ్ మిషన్‌లో వేసి ముదురు పసుపు, పచ్చ పెయింట్స్ స్టెయినర్ వేసి వాటికి మామూలు జీలకర్ర రంగు వచ్చేలా కలియ తిప్పుతారు. ఇంకేముంది కల్తీ జీలకర్ర రెడీ! అల్లం వెల్లుల్లి కల్తీ ఇలా..: అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ఆలుగడ్డను ముద్దగా చేసి అల్లం వెల్లుల్లి మిశ్రమంలో కలుపుతున్నారు. అవసరమైతే అరటి తొక్కలనూ జత చేస్తున్నారు. దీనికి అందమైన ప్యాకింగ్ చేసి ప్రజలకు అంటగడుతున్నారు. సువాసన కోసం కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, కొన్ని రసాయనాలు కలుపుతున్నారు. గతేడాది డిసెంబర్లో ఫలక్‌నుమాలో పోలీసుల దాడిలో భారీగా కల్తీ అల్లం, వెల్లుల్లి ముద్దలు పట్టుబడ్డాయి. యాలకులు: నాసిరకం యాలకులను ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నీటిలో నానబెట్టి రంగులు, కెమికల్స్ కలుపుతున్నారు. కేవలం రూ.100-150 ఖర్చుతో వాటిని చూడడానికి ఆకర్షణీయంగా మార్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒరిజినల్ యాలకులు అంటూ కేజీకి రూ.800-1000 చొప్పున అమ్ముతున్నారు. మిరియాలు: రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కిలో రూ.50కే దొరుకుతున్న బొప్పాయి విత్తులు తెస్తున్నారు. వీటికి పలు రకాల కెమికల్స్, నాసిరకం బెల్లం, బ్లాక్ ఆక్సైడ్, సిమెంట్ కలర్ కలిపి మిరియాలు తయారుచేస్తున్నారు. దీంతో మిరియాల బరువు పెరగడంతోపాటు తిన్నవారికి రోగాలు తథ్యం. నకిలీ బాదాం: నాసిరకం బాదానికి రెడ్ ఆక్సైడ్ కెమికల్‌ను కలిపి చూడ్డానికి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 5 కిలోల బాదాం మరో 5 కిలోల బరువు పెరుగుతుంది. కారంపొడి: కాటేదాన్, బండ్లగూడ, పహాడీషరీఫ్తో పాటు పాతబస్తీలోని పలుచోట్ల ఒరిజినల్ మిరప కారానికి రంపం పొట్టు, పలు కెమికల్స్, రంగులు కలిపి నకిలీ కారంపొడి తయారుచేస్తున్నారు. నకిలీ సోంపు: జియాగూడ కేసరి హనుమాన్ ఆలయ ప్రాంతంలోని ఓ కేంద్రంలో నకిలీ సోంపు తయారు చేస్తున్నారు. కల్తీ సోంపును తీసుకువచ్చి పలు రకాల కెమికల్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, చెరుకు రసం, రంగులు కలిపి పలు రకాల సోంపులను తయారు చేస్తున్నారు. -
రాబందులు లేక పర్యావరణానికి తీవ్ర ముప్పు
వాషింగ్టన్: అంతరించిపోతున్న రాబందులతో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యావరణానికి, మానవాళికి తీవ్ర ముప్పు పొంచివుందని యుటా వర్సిటీ అధ్యయనంలో తేలింది. విషకారకాల వినియోగంతో ఇతర పక్షులు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం 88 శాతం రాబందులకు చెందిన పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ‘విషతుల్యమైన పశు కళేబరాలు తిని రాబందులు అంతరించిపోతున్నాయి. పశువులకు నొప్పిని నిర్మూలించేందుకు వినియోగించే డైక్లోఫినాక్ మందే ఇలా రాబందులు అంతరించిపోవడానికి కారణ’మని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశువుల కళేబరాల్ని తినే పక్షులు రకరకాల వైరస్, బ్యాక్టీరియాలను వ్యాప్తికి కారణమవుతున్నాయి. -
జంతుకళేబరాలతో వంట నూనె తయారీ..!
నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ : నిర్మల్ కేంద్రంగా జోరుగా జంతుకళేబరాలతో వంటనూనె తయారవుతోంది. క ల్తీ నూనె బాహాటంగానే తయారవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారు. అక్టోబర్ 12న రాంనగర్లో ఓ ఇంట్లో పెద్ద ఎత్తున జంతుకళేబరాలతో తయారు చేసిన నూనెడబ్బాలు, జంతు కొవ్వు, ఎముకలు బయటపడిన సంఘటన అప్పుడు రాష్ట్రవాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన మరువక ముందే బాగులవాడలోని వాల్మీకినగర్‌లో గురువారం పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం తో, అప్పటికే నిందితులు డబ్బాలను మాయం చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న వారిని విచారించి చేతులు దులుపుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా.. హైదరాబాద్‌లోని జంతువుల కొవ్వు, ఎముకల తో నూనె తయారుచేసి విక్రయిస్తున్న ముఠా నిర్వాకం బయటపడిన విషయం తెలిసిందే. అయితే పట్టణంలోనూ వరుస ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ఇలాంటి ముఠాలు కోకొల్లలుగా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎవరికీ అనుమానం కలగకుండా కొందరు ఇళ్లలోనే కల్తీనూనె తయారు చేస్తున్నారు. కాలనీల్లోని సందుల్లో బట్టీలను ఏర్పాటుచేసి, జంతువుల కొవ్వును పెద్ద పెద్ద పాత్రల్లో వేసి ఉడికించి నూనె తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడే దుర్గంధంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులెవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా...? శివారు ప్రాంతాలు, మురికి ప్రాంతాలను కేం ద్రంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని కొందరు య థేచ్ఛగా నిర్వహిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదరికాన్ని, యువత నిరుద్యోగా న్ని ఆసరా చేసుకుని తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. తయారుచేసిన నూనెను డబ్బాల్లో నింపి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సమాచారం. నూనె చౌకగా లభిస్తుండడంతో పెద్ద వ్యాపారులు నూనె కొనుగోలు చేస్తున్నారు. దీంతో దందా మూడుపువ్వులు ఆ రుకాయలుగా కొనసాగుతోంది. వ్యాపారానికి ఎవరి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో కుటీర పరిశ్రమగా సాగుతోంది. కల్తీనూనె దారెటు..! జంతుకళేబరాలతో తయారుచేస్తున్న నూనెను తయారీదారులు ఎక్కడ విక్రయిస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. రాంనగర్ సంఘటనలో అధికారులు తయారీదారులను విచారించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. సబ్బుల తయారీలో వినియోగిస్తున్నామని ఓసారి, హోటళ్లు, తినుబండారాల్లో వినియోగం కోసం విక్రయిస్తున్నామని మరోసారి పొంతన లేకుండా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆహారపదార్థాల్లో ఈ కల్తీనూనెను వినియోగిస్తే.. ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆలోచిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది. బలవుతున్న మూగజీవాలు...? కల్తీనూనె తయారీకి జంతువుల కళేబరాలు, కొ వ్వు, ఎముకలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నా రు. పలు ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల్లో ప్రతీ రోజు పదుల సంఖ్యలో లీటర్ల నూనెను త యారుచేస్తున్నారు. దీనికి కావలసిన ముడి సరుకుకోసం జంతువుల వధ తప్పనిసరి అవుతోంది. అయితే ఇంత పెద్దమొత్తంలో జంతువులను ఎ క్కడ వధిస్తున్నారనేది ప్రశ్నార్థకం. అయితే ని ర్మల్‌లో ఉన్న ఒకే ఒక్క జంతువధశాలకు కూడా అనుమతి లేదని అధికారులే చెబుతున్నారు. ఇంతకు ముందు పట్టణంలోని రాంనగర్లో ఇ లాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు హడావిడి చేసినా సాధించింది శూన్యం. స్వయంగా జిల్లా ఆహార అధికారి వచ్చి కల్తీ నూ నె డబ్బాలు పరిశీలించారు. సేకరించిన పదార్థాలను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరిశీలన కో సం పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకున్నారు. పూర్తి స్థాయి నివేదికలు అందాకే తదుపరి చర్యలు తీసుకుంటామంటూ అధికారులు దాటవేస్తున్నారు. కళ్లముందే పెద్ద ఎత్తున కల్తీనూనె తయారీ జరుగుతున్నా, దానిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థా నికులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు పోలీసులు, మున్సిపల్ అధికారులు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు వేయలేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఒక్క శాఖ అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ తంతు చూస్తే పైస్థాయి నాయకులు, అధికారుల ప్రమేయం ఉందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.