breaking news
Andhra Pradesh PCC Chief
-
‘బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్’
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్‌గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. 40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు. -
లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికే
-
లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికే: రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్‌ను ప్రమోట్ చేయడానికే చైతన్య యాత్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని ప్రజా వంచన యాత్ర అంటూ ఆయన మంగళవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రెండు సీజన్లలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వలేదని రఘువీరా వ్యాఖ్యానించారు. వరద తాకిడికి గురైన ఏడు జిల్లాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కరువు నివేదికలను కేంద్రానికి పంపించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ సర్కార్ ఎందుకు నెరవేర్చలేకపోయారో జన చైతన్య యాత్రలో ప్రజలకు వివరించాలని రఘువీరా సూచించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ఆయన నిలదీశారు. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఎందుకు పెండింగ్‌లో పెట్టారో ప్రజలకు చెప్పాలని కోరారు. జనచైతన్య యాత్రలు అనకుండా టీడీపీ చైతన్య యాత్రగా పేరు మార్చుకోవాలని రఘువీరా సలహా ఇచ్చారు. -
'రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు... ప్రమాదకరం'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. బడ్జెట్లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించిందనేందుకు ఈ బడ్జెట్ మంచి ఉదాహరణ అని తెలిపారు. ప్రతి బడ్జెట్లో దేశంలో ప్రతి ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆయన గుర్తు చేశారు. అలాంటి శాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవేశపెట్టడం అత్యంత ప్రమాదకరమని రఘువీరా రెడ్డి హెచ్చరించారు.