breaking news
amaresh
-
ఈ ఏడాది 40.47 లక్షల టన్నుల బియ్యం సేకరణ
సాక్షి, అమరావతి/ఆటోనగర్ (విజయవాడ తూర్పు): ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఇప్పటివరకు 40.47 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ప్రకటించింది. 2019–20లో ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 55.36 లక్షల టన్నుల బియ్యం సేకరించినట్లు ఎఫ్‌సీఐ ఏపీ రీజియన్ జనరల్ మేనేజర్ అమరేష్ కుమార్ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కింద 9.2 కోట్ల మంది పిల్లలకు పోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–బి వంటి పోషకాలు కలిగిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 2021–22కి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం కింద 13.97 లక్షల అంగన్వాడీ కేంద్రాలకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కోవిడ్ దెబ్బతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి కేంద్రం.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తుందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.2,480 కోట్లతో 6.70 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపారు. -
మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!
రేగోడ్: పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు సర్కార్ ఇందిరాక్రాంతి పథం కింద అర్హులైన వారికి లక్షల రూపాయలు విడుదల చేసి మేకలు, బర్రెలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తే, అర్హులంతా తాము బర్రెలు, మేకలు కొనుగోలు చేశామని సర్కార్‌కు నివేదించారు. కానీ ఆడిటింగ్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పడు మాత్రం ఆ పశువులు కనిపించలేదు. పశువులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే మా బంధువుల ఇళ్లకు వెళ్లాయనే సమాధానం చెప్పారని అధికారులు ప్రజాదర్బార్‌లో వివరించారు. శనివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో డీఆర్పీలు ఇలాంటి వింత కథలెన్నో వినిపించారు. 2009-10 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకంలో మంజూరైన రూ.6 కోట్లలో రూ.79 లక్షలు ఆయా పనులపై ఖర్చు చేయగా, ఈ పనులపై ఆడిట్ అధికారులు సర్వే చేసి గ్రామసభలు నిర్వహించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఈజిఎస్ అడీషనల్ పీడీ అమరేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి రాంరెడ్డి, పోగ్రాం మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఉదయం 11.30 గంటలకు నుంచి రాత్రి 8 వరకూ ఈ ప్రజాదర్బార్ కొనసాగింది. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, బర్రెల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ గొర్రెలు, బర్రెలు పొందిన వారి ఇళ్లవద్దకు వెళ్లగా, చాలా చోట్ల పశువులు కనిపించలేదని ఆడిట్ అధికారులు ప్రజా దర్బార్‌లో తెలిపారు. పశువులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించగా, తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాయని పశువులు పొందిన వారు తెలిపారన్నారు. ఈ తతంగం చూస్తుంటే పశువులను కొనుగోలు చేయకుండానే నిధులు మాత్రం తీసుకున్నారనే విషయం బహిర్గతమైనట్లు వారు వెల్లడించారు. ఇక రాళ్లకట్టలు, చెక్‌డ్యాంలు, కుంటల పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు డీఆర్పీలు తెలిపారు. గతంలో ఉపాధిహామి పథకంలో చేపట్టిన పనులనే వాటర్‌షెడ్ పథకంలో చూపించినట్లు ప్రజాదర్బార్‌లో వెల్లడించారు. పలుచోట్ల పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, జెడ్పీటీసీ రాంరెడ్డి, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, ఈజీఎస్ ఏపీఓ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
జంటపై ఆగంతకుల హత్యాయత్నం
కర్నూలు : కర్నూలు జిల్లా కౌతాలం మండలం మెగలినూరులో దారుణం జరిగింది. ఓ జంటపై ఆగంతకులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అమరేష్ అనే వ్యక్తి మృతి చెందగా, శశికళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమరేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు.