జిల్లా సాధన కోసం ఆమరణ దీక్ష
ములుగులో ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య
స్వార్థ రాజకీయాలకు టీఆర్ఎస్ తెరలేపుతోందని ఆగ్రహం
జిల్లాగా ప్రకటించేంతవరకూ చందూలాల్‌ను నియోజకవర్గానికి రానివ్వవద్దని పిలుపు
ములుగు : సమ్మక్క-సారలమ్మ తల్లుల పేరిట ములుగు కేంద్రంగా జిల్లా ఏ ర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆమరణ దీక్ష చేపట్టారు. కమిటీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, బీజేపీ మండల ప్రధా న కార్యదర్శి ఆడెపు రాజు, కాంగ్రెస్ అ ధికార ప్రతినిధి అహ్మద్‌పాషా దీక్షలో కూర్చోగా మాజీ ఎమ్మెల్యే పొదెం వీర య్య ప్రారంభించారు. అంతకుముందు స్థానిక డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయానికి చేరుకొని జిల్లా ఏర్పాటు కావాలని ఆదిదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వార్థ రాజకీయాల కోసమే టీఆర్ఎస్ కుట్ర
టీఆర్ఎస్ నాయకులు స్వార్థ రాజకీయాల కోసమే ఇష్టానుసారంగా జిల్లాల ప్రకటన చేస్తున్నారని పొదెం వీరయ్య అన్నారు. ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లా ఏర్పాటు చేయాల్సి ఉండగా సీఎం కేసీఆర్ తనకు అనుకూలంగా ఉండే ప్రజాప్రతినిధుల సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. వెనుకబడిన ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు విస్మరిస్తున్నారని ఆరోపించారు. మాట నిలుపుకోకుంటే సమ్మక్క-సారలమ్మల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. ములుగు జిల్లా ప్రకటించేంత వరకు మంత్రి చందూలాల్ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధం
సమ్మక్క-సారలమ్మ జిల్లా సాధించుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమని దీక్షలో కూర్చున్న నల్లెల్ల కుమారస్వామి, ఆడెపు రాజు, అహ్మద్‌పాషా ప్రకటించారు.
నేడు ములుగు బంద్..
జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా నేడు ములుగు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి తెలిపారు. అన్ని వర్గాల వారు బంద్‌కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిం తలపూడి భాస్కర్‌రెడ్డి, బాణాల రాజ్‌కుమార్, సీపీఐ నియోజకవర్గ కన్వీనర్ జంపాల రవీందర్, జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి రాజేందర్, కొండెం రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చెర్మైన్ మల్లాడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘జనగామ’ కోసం సకల జనుల దీక్ష
జనగామ : జనగామను జిల్లాగా చేయకుంటే సంగ్రామం తప్పదని ఐక్యకార్యాచరణ ప్రతినిధులు హెచ్చరించారు. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా ప్రాంగణంలో ‘జనగామ జిల్లా సకల జనుల దీక్ష’ ను సోమవారం ప్రారంభించారు. జేఏసీ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు ఆధ్వర్యంలోప్రారంభమైన దీక్షలో మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి, ఏవీవోపీఏ రాష్ట్ర అధ్యక్షుడు పోకల చందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, సాధన సమితి కన్వీనర్లు, సభ్యులు ఆరుట్ల దశమంతరెడ్డి, కన్నా పర్శరాములు, ఆకుల వేణుగోపాల్, ఆకుల సతీష్, మేడ శ్రీనివాస్, మహంకాళి హరిచ్చంద్రగుప్త పాల్గొన్నారు. జనగామ ఐకాన్‌కు పూల మాల వేసిన అనంతరం వారు మాట్లాడారు. జనగామ జిల్లా సాధన కోసం అన్ని పార్టీలు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. నూతన జిల్లాల జాబితాలో ప్రథమ స్థానంలో 11వ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు జనగామకు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రతి మండలం నుంచి జిల్లా కోసం తీర్మాణాలు చేయించేలా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి చొరవ చూపాలని కోరారు. సకల జనుల సమ్మెలో భాగంగా మంగళవారం జాతీయ రహదారిపై వంటావార్పు, నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజమౌళి, కళాకారుడు జి.క్రిష్ణ, నారోజు సోమేశ్వరాచారి, మజీద్, భైరు బాబు, జక్కు వేణుమాధవ్, కేమిడి చంద్రశేఖర్, ఎమ్మార్పీస్ నాయకులు నర్సయ్య, కళాకారులు నర్సయ్య, సౌడ మహేష్, బొట్ల సాయి, డీజే అశోక్, సత్యమూర్తి పాల్గొన్నారు.
బంద్‌కు చాంబర్, బులియన్ మద్దతు
జనగామ జిల్లా కోసం జూన్ 1న తలపెట్టిన బంద్‌కు జనగామ చాంబర్ ఆఫ్ కామర్స్, బులియన్ మర్చంట్ మద్దతు ప్రకటిస్తున్నట్లు చాంబర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, నారోజు రామేశ్వరాచారి తెలిపారు. ఉదయం 10 గంటలకు సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రకటన చేసినవారిలో చాంబర్ గౌరవాధ్యక్షులు పజ్జూరి గోపయ్య, మాజీ అధ్యక్షులు రిమిన సుధాకర్, ప్రధాన కార్యదర్శి మాశెట్టి వెంకన్న, రామిని రాజేశ్వర్ ఉన్నారు.