breaking news
ajai rai
-
మోదీపై మళ్లీ ఆయన్నే బరిలో నిలిపిన కాంగ్రెస్..!
వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారనే ప్రచారం సాగినప్పటికీ అవన్నీ తేలిపోయాయి. గత ఎన్నికల్లో మోదీని ఎదుర్కొన్న అజయ్ రాయ్‌నే కాంగ్రెస్ మళ్లీ బరిలో నిలిపింది. పార్టీ ఆదేశిస్తే పోటీకి దిగుతానని ప్రియాంక చెప్పడం.. సస్పెన్స్ కొనసాగించడం మంచిదే కదా అని రాహుల్ వ్యాఖ్యానించడంతో వారణాసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అజయ్ రాయ్ స్థానికుడు కావడం, రాజకీయంగా పలుకుబడి ఉండటంతో ఆయనవైపే పార్టీ మొగ్గు చూపినట్టు తెలిసింది. (చదవండి : నాకెంతో ఇష్టమైన చోటుకు చేరుకున్నా : ప్రధాని) అయితే, కాంగ్రెస్ బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ప్రియాంకకు పరాజయం ఎదురైతే పార్టీకి మరింత నష్టమని భావించే అజయ్‌రాయ్‌ని మరోసారి పోటీకి దించారని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం అజయ్ నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై పోటీచేసిన అజయ్ 75 వేల ఓట్లు సాధించి మూడు స్థానంలో నిలిచారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రెండు లక్షల ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడు లక్షల ఓట్ల మెజారిటీతో మోదీ రికార్డు విజయం సాధించారు. బీజేపీలోనే రాజకీయ పాఠాలు.. బీజేపీ విద్యార్థి విభాగంలో పనిచేసిన అజయ్ అక్కడే రాజకీయ ఓనమాలు దిద్దారు. తొలిసారి (1996) కలాస్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటి వరకు తొమ్మిది సార్లు కలాస్లాలో పాగావేసిన సీపీఐ అభ్యర్థిని ఓడించడంతో ఆయన పేరు మారుమోగింది. 2009లో వారణాసి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ అజయ్ పార్టీని వీడారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున మురళీమనోహర్ జోషితో తలపడి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి నరేంద్ర మోదీపై వారణాసి నుంచి పోటీచేశారు. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం నిషేదాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడంతో అజయ్ 2015లో అరెస్టయ్యారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అజయ్ మోదీని రెండోసారి ఢీకొట్టి ఏమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి..! -
'నాకు 420 నంబర్ వద్దే వద్దు'
'జాబితాలో నా పేరు ఆ నంబరులో ఉండకూడదు. నేనొప్పుకోను గాక ఒప్పుకోను' అని మొండికేసి మొరాయిస్తున్నారు అజయ్ రాయ్. ఇంతకీ అజయ్ రాయ్ ఎవరు? ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి. ఇంతకీ ఆయన భయపడుతున్న నంబరు ఎమిటి? ఆ నంబరు 420. వారణాసిలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రంగంలోకి రాయ్ దిగుతాడన్నది దాదాపు ఖాయమైపోయింది. కాంగ్రెస్ ఇప్పటి వరకూ 419 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అజయ్ రాయ్ పేరు 420 గా జాబితాలో ఉంది. నా పేరు నంబర్ 420 అయితే ప్రత్యర్థులు నాకు తాటాకులు కట్టేస్తారని ఆయన భయపడుతున్నారు. అయితే సమస్యేమిటంటే ఇంకే అభ్యర్థి కూడా తన పేరు జాబితాలో 420 గా ఉండకూడదని పట్టుబట్టుతున్నారు. 420 అంటే చీటర్, దొంగ, మోసగాడు అని అర్థం. ఉత్తరప్రదేశ్ లో ఎవర్నైనా ఫోర్ ట్వంటీ అని అంటే అది చాలా అవమానం. ఇక రాయ్ విషయానికొస్తే ఆయన పెద్ద మాఫియాడాన్. ఆయన ఎక్కడికి వెళ్లినా సొంత సైన్యం ఒకటి వెంటే ఉంటుంది. ఆయన ఎన్నో వివాదాల్లో ఉన్నారు. పైగా ప్రస్తుత ఎమ్మెల్యే కూడా. దాంతో ఈ ఫోర్ ట్వంటీ ఆయనకి మరీ బాగా అతుకుతుందని ఆయన కంగారు పడుతున్నారు. రాయ్ గారికి వద్దంటే మాకూ వద్దని మిగతా వారు వాదిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ జాబితా జారీని పక్కనబెట్టి ముందు నాయకులకు సర్ది చెప్పడంలో పడింది.