breaking news
Airborne Mission
-
‘ఎగిరే రాడార్’కు లైన్ క్లియర్
బెంగళూరు: శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, విమానాలను ఓ కంట కనిపెడుతూ భూతలం మీది భారత బలగాలకు సమాచారం చేరవేసి అప్రమత్తంచేసే ‘ఆకాశ రాడార్’గా రికార్డ్ నెలకొల్పనున్న భారత తొలి స్వదేశీ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ‘నేత్ర’భారత వాయుసేన చేతికొచ్చింది. ఇకపై ఈ వ్యవస్థతో అత్యంత ఎత్తుల్తో ప్రయాణించే విమానాన్ని రణక్షేత్రంలో వినియోగించుకునేందుకు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ తుది అనుమతి మంజూరుచేసింది. సంబంధిత ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్(ఎఫ్ఓసీ) సర్టిఫికేట్‌ను భారత వాయుసేనకు గురువారం డీఆర్డీవో అందజేసింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎయిర్ స్టాఫ్ డెప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ అవధీశ్ కుమార్ భారతి పాల్గొని ప్రసంగించారు. ‘‘ఏఈడబ్ల్యూసీకి తుది అనుమతి రావడం ఎంతో గర్వంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు గగనతల రక్షణంలో భారత వాయుసేన సాధించబోయే స్వావలంభన, ఆత్మనిర్భరతకు ఇది మరో ముందడుగు. ఎర్లీ వార్నీంగ్ వ్యవస్థ ప్రస్థానం అసాధారణం. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇక్కడి దాకా వచ్చాం. ఇంకా ఎన్నో ఆవిష్కరణలు చేయాల్సి ఉంది. భారత వాయుసేన, డీఆర్డీఓ, సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టిమ్స్ తదితర విభాగాల శాస్త్రవేత్తల సమష్టి కృషికి సంబరం చేసుకోవాల్సిన రోజు ఇది’’అని ఆయన అన్నారు. ఏఈడబ్ల్యూసీ అనేది విమానంలో ఉండే పలు రకాల సెన్సార్ల సమాహారం. ఇందులో రాడార్, ఎల్రక్టానిక్ యుద్ధతంత్ర వ్యవస్థలు, అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి. ఈ విమానాన్ని శత్రువులు గుర్తిస్తే శత్రు దాడుల నుంచి తనను తాను కాపాడుకునే రక్షణ వ్యవస్థలూ ఈ విమానంలో ఉంటాయి. భవిష్యత్తులో నేత్రా వ్యవస్థను ఆరు విమానాల్లో అమర్చనున్నారు. -
‘ఆటమ్’తో సముద్ర వాతావరణం సర్వే!
వాషింగ్టన్: భూమి మీద ఉన్న మారుమూల ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని గుర్తించి, తద్వారా వాతావరణం ఎంతగా మారుతుందో అంచనా వేయడానికి వీలుగా భూ వాతావరణ ఆకృతులను మ్యాపింగ్ చేయడం కోసం నాసా ఒక వైమానిక మిషన్‌ను ప్రారంభించింది. వాతావరణంలో మసి, హైడ్రోకార్బన్లు, నైట్రోజెన్ ఆక్సైడ్లు పూర్తిగా విస్తరించి కాలుష్యాన్ని పెంపొందిస్తున్నాయి. అయితే ఖండాల సమీపంలో ఉండే ప్రాంతాల్లో కంటే మారుమూల ప్రాంతాల్లో వాతావరణం 1000కి పైగాకారకాలతో పరిశుభ్రంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల మొదటగా సముద్రాల్లో వాతావరణం ఎలా ఉందో అట్మాస్పియర్ టోమోగ్రఫీ మిషన్(ఆటమ్) ద్వారా సర్వే చేయనున్నారు. ఇందుకోసం నాసా శాస్త్రవేత్తలు ‘కదిలే డీసీ-8 ల్యాబొరేటరీ’ సహాయంతో ఉత్తర దక్షిణ ధృవం నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా న్యూజేలాండ్ వరకు, ఆ తర్వాత దక్షిణ అమెరికా తీర ప్రాంతం, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం నుంచి గ్రీన్లాండ్ వరకు ప్రయాణించనున్నారు. ‘మేము ఇప్పటికే భూమి మీద ఉన్న చాలా ప్రాంతాల్లోని వాతావరణాన్ని గుర్తించాము. చాలా ప్రాంతాల్లో కాలుష్య కారకాలు విడుదల అవుతున్నాయి. అయితే గ్రహంలో నేల ఉన్న ప్రాంతం చాలా స్వల్పం. సముద్రాల్లో చాలా రసాయన ప్రతిచర్యలు జరుగుతున్నాయి. వీటిలో చాలా ప్రాంతాలు చాలా మారుమూల ఉండడంతో వీటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఈ ఆటమ్ ప్రాజెక్టు ద్వారా మేము చాలా మారుమూల ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి రసాయనిక మార్పులను కొలవనున్నాం’ అని వాతావరణ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ ఆటమ్స్ డిప్యూటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త మైఖెల్ ప్రథెర్ తెలిపారు. ఆటమ్స్ మొదటి ప్రయాణం జూలై 31న ప్రారంభమై 26 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేయనుంది. వివిధ సీజన్లలో వచ్చే మూడు సంవత్సరాలపాటు ఈ పర్యటన కొనసాగనుంది.


