breaking news
aha kalyanam
-
పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్?
'ఆహా కళ్యాణం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణి కపూర్ అదృష్టం బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. గబ్బర్ సింగ్-2 లో పవన్ కళ్యాణ్ సరసన వాణి కపూర్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్టు ఫిలింనగర్ లో టాక్. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కితే వాణి కపూర్ కు దశ తిరిగినట్టే అని సినీ వర్గాలు అంటున్నారు. యష్ రాజ్ సంస్థ నిర్మించిన 'శుద్ద్ దేశీ రొమాన్స్' ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించిన వాణి కపూర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆతర్వాత యష్ రాజ్ సంస్థ తమిళంలో నిర్మించిన 'ఆహా కళ్యాణం'లో నాని సరసన నటించింది. ఈ చిత్రంలో వాణి కపూర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో గబ్బర్ సింగ్-2లో వాణి కపూర్ ను నటింప చేయడానికి ఆ చిత్ర నిర్మాత ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. -
చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా...
తెలుగు తెరకు పరిచయమవుతున్న మరో బాలీవుడ్ కథానాయిక వాణీకపూర్. ‘ఆహా కల్యాణం’లో నానికి జంటగా నటించిన ఈ ఢిల్లీ భామ, ‘శుద్ద్ దేశీ రొమాన్స్’ చిత్రంతో యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. ‘ఆహా కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులతోనూ ఆహా అనిపించుకుంటానంటోన్న వాణీకపూర్‌తో ‘సాక్షి’ స్పెషల్ చిట్‌చాట్... * మీరేమో ఉత్తరాది అమ్మాయి. మీ పేరు చూస్తే దక్షిణాది వారిలా అనిపిస్తోంది? మా నాన్నగారే నాకు ఈ పేరు పెట్టారు. ప్రత్యేక కారణం కూడా ఏమీ లేదట. బహుశా భవిష్యత్తులో నాకు సినిమాల ద్వారా దక్షిణాదితో అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, ఆ పేరు సెట్ అయ్యిందేమో. * అసలు సినిమా రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? చిన్నప్పట్నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. మన భారతీయ సినిమాలకు బలం పాటలే. సినిమాల్లో పాటలు, డాన్సులు చూసినప్పుడు నాకు భలే అనిపించేది. పైగా, నేను ఏ విషయాన్నయినా చక్కగా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాను. అందుకే సినిమాలనే కెరీర్‌గా ఎంపిక చేసుకున్నాను. * మీ తొలి చిత్రమే (శుద్ద్ దేశీ రొమాన్స్) యశ్‌రాజ్ సంస్థలో చేశారు. ఆ అవకాశం ఎలా వచ్చింది? ముంబయ్‌లో మోడలింగ్ చేసేటప్పుడు ఓ కాస్టింగ్ డెరైక్టర్ ద్వారా యశ్‌రాజ్ సంస్థలో ఆడిషన్స్‌కి వెళ్లాను. ఆ తర్వాత చాలాసార్లు ఆడిషన్స్ చేశారు. ఓ ఆరేడు నెలలు ఉండి, సినిమా కుదిరితే ఓకే.. లేకపోతే ఢిల్లీ వెళ్లిపోవాలనుకున్నాను. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా అవకాశం ఇచ్చారు. ఈ బేనర్లో తొలి అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా రెండో సినిమా కూడా ఇందులో చేయడం ఆనందంగా ఉంది. * ఇంతకీ ‘ఆహా కల్యాణం’ మాతృక ‘బ్యాండ్ బాజా బారాత్’ చూశారా? ఆ సినిమా విడుదలవ్వగానే చూశాను. అయితే, ఈ చిత్రం ‘ఆహా కల్యాణం’గా రీమేక్ అవుతుందని, అందులో నాకే అవకాశం వస్తుందని అనుకోలేదు. వచ్చిన తర్వాత మాత్రం చూడలేదు. ఎందుకంటే, అనుష్క శర్మ ప్రభావం నా మీద ఉండకూడదనుకున్నా. * ‘పెళ్లి’ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.. అసలు పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదో రోజు పెళ్లి చేసుకుని సెటిలవుతా. వివాహ బంధం చాలా గొప్పది. * పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు ఏంటనుకుంటున్నారు? వయసుతో సంబంధం లేదు. జీవితంలో సెటిల్ అవ్వడం ప్రధానం. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మానసికంగా రెడీ అయినప్పుడే పెళ్లి చేసుకోవాలి. నా సిస్టర్ నుపుర్‌కి పద్ధెనిమిదేళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ‘నువ్వు మాత్రం అలా చేసుకోవద్దు’ అని చెప్పింది. కొన్నాళ్లు జీవితాన్ని ఎంజాయ్ చేసి, పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. * ఈ సినిమాలో నానితో మీ పెళ్లి చాలా వైభవంగా జరిగి ఉంటుంది. నిజజీవితంలో ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలను కుంటున్నారు. వైభవంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వ్యక్తిని పెళ్లాడాలో నిర్ణయించుకోలేదు. నా పెళ్లి నిరాడంబరంగా జరిగినా ఫర్వాలేదు. కానీ, నా పెళ్లికి వచ్చేవాళ్లందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించాలి. * నాని గురించి చెప్పండి? నాని యాక్ట్ చేసిన ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను. తను మంచి నటుడు. ఎప్పుడైతే కోస్టార్ మంచి పర్ఫార్మరో, అప్పుడు ఆటోమేటిక్‌గా తనకు పోటీగా బాగా యాక్ట్ చేయాలనే పట్టుదల ఏర్పడుతుంది. * అవసరమైతే బికినీ ధరిస్తానని, లిప్ లాక్కి రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎప్పటికీ ఆ మాట మీదే ఉంటారా? తప్పకుండా. చీరలు, చుడీదార్లు వేసుకుని ఈత కొట్టలేముగా? మరి.. సినిమాలో అలాంటి సీన్స్‌లో బికినీ వేసుకుంటే తప్పేంటి? అలాగే మంచి రొమాంటిక్ స్టోరీ అనుకోండి... హీరో హీరోయిన్ మధ్య లిప్‌లాక్ సీన్స్ ఉంటాయి కదా. అవి చేస్తేనే సీన్ పండుతుంది. కథకి అవసరమైనవి చేయడానికి నేను వెనకాడను. -
ఒకే నెలలో మూడు సినిమాలు!!
గడిచిన సంవత్సరంలో హీరో నాని నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. చిట్టచివరిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' మాత్రమే విడుదలైంది. అది బ్రహ్మాండమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా రాజమౌళి సినిమాలో చేసిన హీరోలకు తర్వాత వచ్చే సినిమాలు అంతగా అచ్చిరావన్న సెంటిమెంటు ఒకటుంది. నానికైతే అసలు ఆ తర్వాత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఫిబ్రవరి నెలలో ఒకేసారి ఈ యువహీరో నటించిన మూడు సినిమాలు విడుదలై ఒకదాంతో ఒకటి పోటీ పడనున్నాయి. పైసా, జెండాపై కపిరాజు, ఆహా కళ్యాణం.. ఈ మూడు సినిమాల్లోనూ నానీయే హీరో. ఈ మూడూ కూడా ఫిబ్రవరిలోనే విడుదల అవుతుండటం విశేషం. వీటిలో కళాత్మక దర్శకుడు కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న పైసా ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. వాస్తవానికి ఇది గత సంవత్సరం చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఆలస్యం అయ్యింది. దాని కారణాలేంటో చర్చించదలుచుకోలేదు గానీ.. ఫిబ్రవరి 7న తమ సినిమా విడుదల అవుతోందని కృష్ణవంశీ చెప్పారు. ఇక సముద్రకన్ని దర్శకత్వం వహించిన జెండాపై కపిరాజు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. వేలంటైన్స్‌డే బహుమతిగా తమ సినిమాను అందిసు్తన్నట్లు నిర్మాత రాజా పార్థసారథి తెలిపారు. ఇక హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాను 'ఆహా కళ్యాణం' పేరుతో రీమేక్ చేశారు. దీన్ని కూడా ఫిబ్రవరి 7నే విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు మాత్రం 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వరుసపెట్టి మూడు శుక్రవారాల్లో నాని సినిమాలు మూడు విడుదలవుతున్నాయన్న మాట.