breaking news
agraharam society
-
అగ్రహారం సోసైటీపై విచారణ ఎప్పడు?
ఖాజీపేట: అగ్రహారం సొసైటీలో రూ. కోటీ 30 లక్షలకుపైగా భారీ కుంభకోణం జరిగిందన్న విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. అందులో బాగంగా సొసైటీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యారు. కానీ సోసైటీలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులు కనీస విచారణ కూడా జరపక పోవడంపై రైతుల్లో, స్థానికుల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఎక్కడ తమగుట్టు బయటపడుతుందో అని విచారణ జరపడంలేదని రైతులు స్థానికుల అంటున్నారు. పంపుల అక్రమాలపై మౌనం ఎందుకు?: రైతులకు తైవాన్ పంపులు ఇవ్వాలని అధికారిక ఉత్తర్వులు లేవు. కానీ అనధికారికంగా రైతులకు ఉపయోగంలేని తైవాన్ పైపులు రైతులనెత్తిన బలవంతంగా రుద్ది సుమారు రూ. 70 లక్షలు దోచుకున్నారు. ప్రతిరైతూ నుంచి పంపులను రూ. 6,475 కొనుగోలు చేయించి రూ. కోటీ 60 లక్షలు కంపెనీకి సోసైటీవారు చెల్లించారు. ఇందులో ఎవరూ కీలక సూత్రధారి.? ఎవరెవరికీ భాగాలు ఉన్నాయి? ఇంత వ్యవహారం సొసైటీ అధ్యక్షుడు ఒక్కడే నడపడం సాధ్యమా? మరి అలాంటప్పడు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఉన్నతాదికారులకు వాటాలు ఇచ్చామని సోసైటీ అధ్యక్షుడు పలువురి దగ్గర చెప్పారన్న విమర్ళలు ఉన్నాయి. విచరాణలో అక్రమం అనితేలితే రైతులు నష్టపోయిన సోమ్మును తిరిగి ఇప్పిస్తారా ? ఇలాంటి ప్రశ్నలను రైతులు గుప్పిస్తున్నారు. వాటికి అధికారులే సమాధానం చెప్పాలి. రుణాల వాసూళ్లలోనూ.. బ్యాంకు నుంచి రైతులకు అందిన రుణాల్లోనూ భారీగా గోల్మాల్ జరిగిందన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. ఇచ్చిన రుణాల్లోనూ రూ. 3నుంచి 6 వేలు వసూళ్లు చేశారు. అందులోనూ కొందరూ బ్రోకర్లు వసూళ్లలో కీలక పాత్ర వహించారు. రుణాల వసూళ్లలో ఎవ్వరెవరికి వాటాలున్నాయి, ఎవ్వరి వాటా ఎంత? నష్టపోయిన రైతులందరినీ విచారిస్తారా లేదా అని రైతులు అనుమానం వ్యక్తం చేసున్నారు. విచారణ ఎప్పడు? సొసైటీ అక్రమాలపై విచారణ ఇప్పటి వరకూ జరగక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలవు దినాలు అని అధికారులు కుంటిసాగులు చెబుతున్నా వారి పనితీరుపై తీవ్ర విమర్ళలకు దారితీస్తోంది. అసలు విచారణ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు సొసైటీ వారికి అధికారులు గడువు ఇచ్చారని, ఈలోగా అన్నిరికార్డులు సరిచేయాలని చెప్పడంతో రాత్రింబవళ్లు ఈ పనులకు సిబ్బంది కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. -
అగ్రహారం సొసైటీలో అడ్డంగా దోపిడీ
2015లో పంటలు సాగు లేదు. పైగా కరువు. దీంతో రైతుల చేతిలో చిల్లిగవ్వలేదు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోతోంది. ఎలాగైనా పంట సాగు చేయాలి. ఏం చేయాలిరా దేవుడా అనుకుంటున్న సమయంలో అగ్రహారం సొసైటీలో వడ్డీలేని రుణాలు ఇస్తుండటంతో రైతులు రుణాల కోసం ఎగబడ్డారు. రైతు అవసరం సొసైటీ బ్యాంక్ అధికారులకు కాసుల వర్షం కురిపించింది. ఇదే అదనుగా భారీ ధరకు తైవాన్ స్ప్రేయర్లు అంటగట్టి సొసైటీవారు రైతులను నిలువు దోపిడీ చేశారు. ఖాజీపేట: అగ్రహారంలోని రైతు సహకార సొసైటీ కుంభకోణాలకు నిలయంగా మారింది. ఎంతమంది అధికారులు మారినా, ఎందరు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినా పరిస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా వడ్డీలేని రుణాల పేరుతో రైతులను నిలువుదోపిడీ చేస్తున్న ఉదంతం వెలుగు చూసింది. రైతులకు అవసరం లేకపోయినా తైవాన్ పంపుసెట్లు అంటగడుతున్నారు. అదనపు ఖర్చుల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటివరకు అగ్రహారం సొసైటీలో రైతులకు ఇచ్చిన రుణాల్లో రూ.1.3కోట్లకుపైగానే దోచుకున్నట్లు తెలుస్తోంది. పంప్‌ల పేరుతో దోపిడీ మాకు పంపులు ఉన్నాయి వద్దు అన్నా.. వినిపించుకోకుండా కచ్చితంగా తీసుకుంటేనే రుణం వస్తుంది.. లేకపోతే రాదని సొసైటీ అధ్యక్షుడు తెగేసి చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రుణాలు తీసుకుంటున్నారు. టూస్ట్రోక్ పంపుసెట్టు బయట రూ.5వేల నుంచి రూ.5,500లకు లభిస్తోంది. కానీ వీటిని రూ.6,470లకు కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇందులో దళారులు రూ.14లక్షలకుపైగానే దోచుకున్నారు. దళారులతో కుదిరిన ఒప్పందం మేరకు గుంటూరు నుంచి నేరుగా ఖాజీపేట అగ్రహారం సొసైటీకి 1,300 పంపుసెట్లు వచ్చాయి. వచ్చిన పంపు సెట్లకు రూ.కోటి 30లక్షలు డీడీని తీసి కంపెనీ వారికి ఇచ్చారు. అంటే ఒక్కో పంపు సెట్టు రూ.10 వేలు పడినట్లు తెలిసింది. అధికారికంగా చెల్లించిన ధరలో ఒక్కో పంపుసెట్టుపై రూ.3,530 అధికంగా చెల్లించారు. ఇప్పటివరకు 1,020 మంది రైతులకు రుణాలు ఇచ్చారు. రైతుల వద్ద నుంచి ఒక్కో పంప్సెట్టుకు రూ.13వేలు వసూలు చేస్తున్నారు. అంటే అధికారికంగా సొసైటీవారు రూ.10వేలు చెల్లిస్తే రైతుల వద్దనుంచి అనధికారికంగా మరో రూ.3వేలు వసూలు చేస్తున్నారు. అంటే 1,020 రుణాలకు గాను రైతుల వద్దనుంచి రూ.30.60 లక్షలు స్వాహా చేశారు. అంతకుముందు ఎమ్మార్పీ తేడా రూ.36లక్షలు ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది.. ఎవరు తీసుకున్నారు.. దీనిలో ఎవరి వాటా ఎంత అన్నది తేలాల్సి ఉంది. ఒక్క తైవాన్ పంప్సెట్టులోనే దాదాపు రూ.70లక్షలు పైగానే రైతుల నుంచి సొసైటీ వారు దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. నాసిరకం స్ప్రేయర్లు రైతులకు అందించే పంపుసెట్లు నాసిరకంగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు ఫోర్‌స్ట్రోక్ పంపుసెట్లు వాడుతున్నారు. దీనివల్ల పంటలకు త్వరగా మందు పిచికారీ చేయొచ్చు. కానీ సొసైటీవారు టూస్ట్రోక్ పంపుసెట్లు అందిస్తున్నారు. వీటికి పెట్రోలుతోపాటు ఆయిల్ వేసుకుని పిచికారీ చేయాలి. పిచికారీకి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా సొసైటీ వారు ఇచ్చిన పంపులు రైతులకు పనికిరాకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాల వారికి రూ.4 వేల నుంచి రూ.5వేలకు అమ్ముతున్నారు. పంట సీజన్ కావడంతో... వడ్డీలేని రుణం కావడంతో రైతులు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుతం సాగు సమయం కావడంతో ఎక్కడో వడ్డీలకు తెచ్చే బదులు సొసైటీలో రుణం తీసుకుంటే మేలని ఎగబడ్డారు. అయితే రూ.లక్ష రుణం ఇస్తే అందులో రైతులకు అందేది కేవలం రూ.70 వేలు మాత్రమే. రైతు షేర్ క్యాపిటల్ పేరుతో రూ.10వేలు, పంపుసెట్టు పేరుతో రూ.13వేలు, బ్యాంకు ఖర్చుల పేరుతో రూ.3 వేల నుంచి రూ.6వేలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి డిక్లరేషన్ బాండ్‌కు రిజిస్టర్ బాండ్ల ఖర్చు కేవలం రూ.250 నుంచి రూ.300 ఉంటుంది. ఈసీ తీయాలంటే అదనంగా మరో రూ.300 వస్తుంది. కానీ రైతు తీసుకున్న రుణానికి ఒక్క ఈసీ తియ్యలేదు. పైగా మనిషిని బట్టి వసూలు చేస్తున్నారు. ఇందులో ఒక రుణానికి రూ.3వేలు చొప్పన వేసినా 1,020 రుణాలకు దాదాపు రూ.30.60లక్షలు దోచుకుంటున్నారు. ఇక అధికారులకు మామూళ్లు సరేసరి. నిబంధనలు గాలికి.. బ్యాంకు నిబంధనల ప్రకారం ఒక రైతుకు రుణం కావాలంటే పట్టాదారు పాసుపుస్తకం 1బీ అడంగల్‌తోపాటు డిక్లరేషన్ఫాంలో సంతకాలు పెట్టాలి. కానీ ఇక్కడ నిబంధనలను సడలించారు. ఎందుకంటే చాలామంది రైతులు ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో సొసైటీ వారు పక్కాప్రణాళికతో 1బీ ఉంటే చాలంటూ రుణాలు ఇచ్చారు. దీంతో చాలామంది ఒకే నంబరుపై రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆన్లైన్లో పేర్లు మార్చుకుని రుణాలు పొందినట్లు సమాచారం. మరికొంతమందికి ఎలాంటి అర్హత లేకున్నా అడ్డదారుల్లో బినామీ రుణాలు పొందినట్లు బహిరంగ విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం రుణం తీసుకుంటున్న రైతు మైదుకూరు డీసీసీ బ్యాంక్‌లోకి పోయి డబ్బులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు బ్యాంక్‌నుంచి డబ్బు డ్రా చేసి తెచ్చి వారి ఒప్పందం మేరకు డబ్బు పట్టుకుని ఇస్తున్నారు. పంప్సెట్టుకు, ఇతరఖర్చులకు, ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. ఇలా నిబంధనలను పాతరేసి ఇష్టారుసారంగా రుణాలు ఇచ్చి అందిన కాడికి దండుకుంటున్నట్లు సమాచారం పేరుకే మెంబర్లం.. మాకేమి తెలియదు సొసైటీలో పేరుకే మేం మెంబర్లం. మాకు సొసైటీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. సొసైటీ డెరైక్టర్లతో మీటింగ్ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇప్పటికి ఏడాదైంది.. ఇంతవరకూ మీటింగ్ జరపలేదు. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై ప్రతి రైతును విచారించాలి. దోచిన సొమ్మును కట్టించాలి. వెంటనే సొసైటీని రద్దుచేయాలి -జనార్దన్‌రెడ్డి, సొసైటీ డెరైక్టర్ పేరుకే ఉపాధ్యక్షుడిని నేను డెరైక్టర్ని. పైగా ఉపాధ్యక్షుడిని కూడా. కానీ సొసైటీలో ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు. కనీస సమాచారం ఇవ్వడం లేదు. సొసైటీలో అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకు వస్తాయి -బత్తెన మల్లేశ్వర్‌రెడ్డి సింగిల్ విండో ఉపాద్యక్షుడు సొసైటీని అధ్యక్షుడిని తొలగించి విచారణ జరపాలి సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి అక్రమంగా వసూళ్లూ చేస్తున్నారు. వాస్తవ విషయాలు బయటికి రావాలంటే అధ్యక్షుడిని తొలగించి విచారించాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బును రికవరీ చేయాలి -దుగ్గిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు లక్షకు రూ.70వేలు ఇస్తున్నారు సొసైటీ బ్యాంక్‌లో రైతులకు కాలం చెల్లిన పంపుసెట్లను రైతులకు బలవంతంగా అంటగడుతున్నారు. రూ.లక్షకు 70వేలే రుణం ఇస్తున్నారు. మిగిలిన సొమ్ము ఎక్కడికి పోతోంది విచారణ చేపడితే కానీ వాస్తవాలు బయటికి వస్తాయి -దుగ్గిరెడ్డి గంగాధర్‌రెడ్డి, మాజీ ఉపసర్సంచ్ అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి సొసైటీలో చాలా అక్రమాలు జరుగుతున్నట్లు రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా తైవాన్ పంపులు ఇస్తున్నారు. అధికారులు రుణం తీసుకున్న ప్రతి రైతును విచారించి అక్రమాలకు పాల్పడ్డ వారి నుంచి రికవరీ చేయించాలి -మురళీ రామ్మెహన్‌రెడ్డి, జెడ్పిటీసీ భర్త