breaking news
Advanced medical services
-
‘సూపర్ స్పెషాలిటీ’ కోసం ఎదురుచూపు
ఖర్చుకు సింగరేణి ముందుకు వచ్చినా స్పందించని సర్కారు సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కలలను తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కావాలని సింగరేణి యాజమాన్యం కోరినా... అవసరమయ్యే ఖర్చునంతా భరిస్తామన్నా రాష్ట్ర సర్కారు స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి గత ఆగస్టులో ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. దీంతో ఉద్యోగులు, కార్మికుల్లో నిరాశా నిస్పృహలు నెల కొంటున్నాయి. దీనిపై అనేక సందర్భాల్లో సమావేశాలు జరిగినా నిర్ణయం ఒక కొలిక్కి రాలేదు. శనివారం మరోసారి సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంతో సమావేశం కానుంది. ఈసారైనా వారి ఆశ ఫలిస్తుందా లేదా వేచిచూడాలి. 3 లక్షల మంది కార్మికుల కోసం... ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని సింగరేణిలో దాదాపు 63 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి 3 లక్షల మంది ఉంటారు. వీరికి ఆరోగ్యం కోసం సింగరేణి యాజమాన్యం ఏటా రూ. 160 కోట్ల మేరకు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం గోదావరిఖని, కొత్తగూడెలలో 150 పడకల ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నాయి. గుండె, లివర్, కిడ్నీ తదితర కీలకమైన, అత్యవసర వైద్య సేవలకోసం సింగరేణి ఉద్యోగులు హైదరాబాద్‌లో ఇతర ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగూడెం, గోదావరిఖనిల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని... లేకుంటే ఇప్పటికే ఉన్నవాటిని ఆధునీకరించాలన్న ప్రతిపాదనలను గత ఏడాది సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. అందుకు అయ్యే ఖర్చును భరించడానికి సింగరేణి ముందుకొచ్చింది. దీంతోపాటు రెండింటికి అనుబంధంగా ఎక్కడో ఒకచోట వైద్య కళాశాలను ఏర్పాటుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏటా వైద్య కళాశాల నిర్వహణకయ్యే ఖర్చును మాత్రం భరించలేమని, దాన్ని సర్కారే భరించాలని విజ్ఞప్తి చేసింది. అవసరమైతే ఆ ఖర్చును సింగరేణి భరించవచ్చని అంటున్నారు. వైద్యుల నియామకాలు, సేవలు, వైద్య కళాశాల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించాలని కోరింది. అందుకు నిమ్స్ కూడా అం గీకరించిన విషయం విదితమే. దీనికి సంబంధించి అవగాహన కుదుర్చుకోవాల్సి ఉంది. ఆసుపత్రి ఏర్పాటుపై ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించలేకపోయింది. కొత్తగా వైద్య ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి హయాంలో మొద టిసారిగా మరో సమావేశం జరుగనుంది. -
మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు ఐటీఐఆర్ ప్రాజెక్టుతో మరో కోటి జనాభా పెరుగుదల సినీ పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తామని వెల్లడి హైదరాబాద్: అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్ మహానగరం ‘మెడికల్ టూరిజం హబ్’గా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ‘కాంటినెంటల్ ఇంటర్నేషనల్ కేన్సర్ సెంటర్ ’ను ఆయన ప్రారంభించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యసేవలు, పరికరాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. ఎంత మంచి ఆసుపత్రిని కట్టినా దానిని సరిగ్గా ప్రచారం చేసుకోకపోతే ఉపయోగం ఉండదని.. ఈ ఆసుపత్రికి తాను అంబాసిడర్‌గా, ఏజెంట్‌గా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందన్నారు. రాజధానిలో ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున మరో కోటి మంది జనాభా పెరుగుతుందన్నారు. సినీ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తామని, నాలుగైదు వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. దాని బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకరిగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణను ఆయన కోరారు. హైదరాబాద్ వాతావరణం మరెక్కడా ఉండదని తెలిపారు. కార్యక్రమంలో కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి, రేడియేషన్ అంకాలజిస్ట్ రమణమూర్తి, ప్రముఖ సినీ నటుడు కృష్ణ, విజయనిర్మల దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నా సొంతూరు: సినీ హీరో కృష్ణ ముప్పై ఏళ్లుగా తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఈ నగరమే తన సొంతూరన్న అభిప్రాయంతో ఉన్నానని ప్రముఖ సినీ నటుడు కృష్ణ చెప్పారు. ఇక్కడ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్దదిగా నిర్మించదలచిన ఆ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ ఫిల్మ్‌సిటీగా పేరుపెట్టాలని సూచించారు.