breaking news
adivasi girls
-
Adivasi Girl: కెమెరామెన్‌గా రాణిస్తున్న ఆదివాసీ యువతి
సాక్షి, కుమురం భీం: ఫోటోగ్రఫీ అంటే మగవాళ్ల సామ్రాజ్యం!ఎక్కువగా పురుషులే ఈ రంగంలో ఉంటారు. అయితే మగవాళ్లకు తానేం తక్కువ కానంటుంది ఓ ఆదివాసి యువతి. ఫోటోగ్రఫీలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. అద్బుతమైన ఫోటోలు తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. కుమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన ఆత్రం మాధవరావు ముగ్గురు కుమార్తెల్లో చివరి అమ్మాయి మమత. ఆమె సిర్పూర్ యూ మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. అయితే ఆమె చదువకుంటునే ఫోటోగ్రఫర్, వీడియో గ్రాఫర్‌గా రాణిస్తోంది. రోడ్లు కూడా సరిగాలేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీస్తోంది మమత. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఇతర శుభకార్యలకు కూడా ఆమె ఫోటోలు తీస్తోంది. తనకు చదువుకుంటూ ఫోటోలు తీయటం సంతోషంగా ఉందని పేర్కొంది. -
ఆదివాసీ యువతులపై లైంగిక దాడులు
బరంపురం(ఒడిశా): ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, భారత రాజ్యాంగంలో గిరిపుత్రుల రక్షణ, హక్కుల కోసం ఎన్నో చట్ట సవరణలు జరిగాయి. కానీ ఆదివాసీల బతుకులు మాత్రం అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. బడుగు, బలహీన వర్గాల అత్యాచార నిరోధక చట్టం పటిష్టంగా అమలు జరగడం లేదడానికి కొంధమాల్ జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు అరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ కామాంధుల ఆటవిక చర్యల వల్ల అడవి బిడ్డలైన ఆదివాసీ యువతులు లైంగిక వేధింపులు, లైంగిక దాడులకు బలవుతున్నారు. తిరగబడిన అడవి బిడ్డలపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల అండదండలతో కామాంధులైన ధనవంతులు సమాజంలో స్వేచ్ఛఘా తిరుగుతున్నారని ఆదివాసీ సంఘాలు అరోపిస్తున్నాయి. కొంధమాల్ జిల్లాలో అధికంగా ఆదివాసీలు రాష్ట్రంలో నూటికి 98 శాతం ఆదివాసీలు నివసించేది రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలోనే. కొంధో అంటే ఆదివాసీలు, మాలో అంటే ఆరణ్యం. కొంధమాల్ అనగా ఆదివాసీల ఆరణ్యం అని అర్థం. జిల్లాలో నివసించే ఆదివాసీ బాలికలకు యుక్త వయసు వస్తున్న సమయంలో వారి శరీరంలో వస్తున్న అవయవాల మార్పులపై అందోళన చెందుతున్నట్లు అటవీ పరిశోధక నిపుణులు తెలియజేస్తున్నారు. ఆదివాసీ బాలికలు యుక్త వయసులో అడుగు పెడుతున్న సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులపై పిల్లలకు సరిగ్గా గైడ్ చేయవలసిన తల్లులకే సరైన అవగాహన లేకపోవడం వల్ల వారంతా పిన్న వయసులోనే క్షణం క్షణం భయం భయంగా బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సమయాల్లో ఆదివాసీ యువతులు ధనవంతులు, «అటవీ అధికారులకు కామక్రీడకు బలై జీవితాలను అంధకారంలో వెళ్లదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది లైంగిక వేధింపులకు గురైతే, ఇంకొంతమంది వంచనకు గురవుతున్నారు. కొంతమంది ఆదివాసీ యువతులపై లైంగికదాడి జరిగినా అసలు ఏంజరిగిందో కూడా వారికి అవగాహన లేకపోవడం, కడుపులో పెరుగుతున్న గర్భాన్ని కూడా తెలుసుకొలేని దీనస్థితిలో గర్భంతోనే అడవిలో కట్టెలు కొట్టుకుంటూ బిడ్డలకు జన్మనిస్తూ పసివయసులోనే మాతృమూర్తులవుతున్నారు. కామాంధుల అరాచకానికి బలైన కొంతమంది బాధిత ఆదివాసీలు తిరగబడి పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి గిరిజనులపైనే తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు, పోలీసులు కలిసి కామాంధులకు కొమ్ముకాస్తూ రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతున్నట్లు తీవ్ర అరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంధమాల్ జిల్లాలో గల బమ్మునిగాం సమితి కటింగియా ఆదివాసీ గ్రామంలో 4గురు మహిళలపై జరిగిన లైంగికదాడి సంఘటన బయటికి రాకుండా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు సైతం తగు జాగ్రత్తలు తీసున్నట్లు ఆదివాసీ సంఘాలు తీవ్రస్థాయిలో అరోపిస్తున్నాయి. ఇలా పోలీస్ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ధనవంతుల వంచన, సీఅర్పీఎఫ్ జవాన్ల వేధింపులు భరించలేక అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే శక్తి లేక ఆదివాసీ యువతీ యువకులు ఉద్యమ బాట పడుతున్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో శిశు మరణాలు దేశంలో శిశు మరణాల్లో కొంధమాల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని జాతీయ శిశు సంక్షేమ శాఖ పరిశోధనలో రుజువైనట్లు తెలుస్తోంది. జిల్లాలో నివసించే ఆదివాసీ బాలికలు యుక్తవయసు వచ్చే సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులపై ఎటువంటి అవగాహన లేక పోవడమే ఇందుకు కారణమని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. చైతన్య శిబిరాలు అవసరం జిల్లా పాలనాయంత్రాంగం ఆదివాసీ గ్రామాల్లో ఆదివాసీ బాలికలకు యుక్త వయసులో వచ్చే శరీర మార్పులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి ఆదివాసీల్లో అవగాహన కల్పించే విధంగా చైతన్య శిబిరాలు నిర్వహించాలని పలు ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. దీని ఫలితంగా ఉద్యమ బాటలో పయనిస్తున్న ఆదివాసీ యువతీ, యువకులను అదుపు చేయవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.