breaking news
Add-on
-
రిలయన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
టెలికాం మార్కెట్ స్పేస్‌లో ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంస్థ ఏదైనా ఉందా అంటే అది రిలయన్స్ జియోనే. రిలయన్స్ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లకు భలే ఆఫర్ తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్తగా యాడ్-ఆన్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట. ఈ అదనపు డేటా పొందడానికి అర్హత ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మైజియో యాప్‌లో ద్వారా ఆటోమేటిక్‌గా యాడ్-ఆన్ ప్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిసింది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ 2018 జూలై 31 వరకే వాలిడ్‌లో ఉండనుందని తెలిసింది. జియో ప్యాక్ యాక్టివ్‌తో... ఒకవేళ జియో యూజర్ రూ.399 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1.5 జీబీ డేటాను పొందుతూ ఉంటే, ఇక నుంచి రోజుకు 2 జీబీ అదనపు డేటాతో, మొత్తం 3.5 జీబీ 4జీ డేటాను పొందనున్నారు. ఈ ప్యాక్ వాలిడిటీ జూలై 31 వరకు ఉంటుందని తెలిసినప్పటికీ, కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు ఆఫర్ చేస్తుందని టెలికాం టాక్ రిపోర్టు చేసింది. కాగ, ఈ నెల ప్రారంభంలోనే రిలయన్స్ జియో, జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద పాత ఫీచర్ ఫోన్లను ఇచ్చేసి, కొత్త జియోఫోన్‌ను కేవలం రూ.501కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్. అయితే ఈ డీల్ పొందడానికి ఆరు నెలల పాటు రూ.99 ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేయించుకోవాల్సినవసరం ఉంది. అయితే ఈ మొత్తం రూ.594ను కూడా ముందే పొందాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.501 ప్లస్ రూ.594 అంటే రూ.1095ను చెల్లించి జియోఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయాలి. -
వాహన బీమాకు యాడ్-ఆన్ కవచం
అందరికీ వాహనం అవసరమే. కాకపోతే మనుషుల్ని బట్టి వారి అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. పెద్ద కుటుంబమైతే విశాలమైన పెద్ద కారు కావాల్సి రావొచ్చు. అదే చిన్న కుటుంబం, సింగిల్‌గా ఉన్న ప్రొఫెషనల్స్ లాంటి వారికయితే ఇటు పార్కింగ్‌కు అటు మెయింటెనెన్స్‌కు సులువుగా ఉండే చిన్న కారు బెటరని అనిపించొచ్చు. ఇక గృహిణులైతే.. చిన్నా, చిత్రకా పనులు చుట్టబెట్టేందుకు తేలికపాటి స్కూటర్‌లాంటి దాన్ని ఇష్టపడొచ్చు. ఇలా ఒకరికి అనువైన వాహనం మరొకరికి అనువైనది కాకపోవచ్చు. అలాగే, వాహన బీమా కూడా!!. అల్లాటప్పాగా ఏదో ఒక పాలసీ తీసుకోవడం కాకుండా... వాహనం, దాని వాడకాన్ని బట్టి సరైన పాలసీ, తగిన యాడ్-ఆన్లు తీసుకుంటేనే బీమా ప్రయోజనాలు పూర్తిగా పొందవచ్చు. అందుకే వివిధ సందర్భాల్లో ఉపయోగపడే యాడ్-ఆన్ల గురించి తెలుసుకోవాలి. బంపర్ టు బంపర్ డ్రైవింగ్.. ప్రస్తుతం చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దాదాపు ఒకదానికి మరొకటి తాకేంత దగ్గరగా బంపర్ టు బంపర్ డ్రైవింగ్ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి ట్రాఫిక్ లో ప్రయాణించేటప్పుడు కారు ఫైబర్ , మెటల్ వగైరా పార్టులు ఇట్టే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, దెబ్బతిన్న ఫైబర్, ప్లాస్టిక్, మెటల్ వంటి భాగాల రిపేర్లకు అయ్యే ఖర్చులో వాహనం తరుగుదలను బట్టి దాదాపు 50 శాతం దాకా మాత్రమే సాధారణ పాలసీల్లో పరిహారం దక్కవచ్చు. ఇలాంటప్పుడు డిప్రిసియేషన్ కవరేజీ తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. రీప్లేస్ చేసిన భాగాల విలువలో డిడక్ట్ చేసిన తరుగుదల మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం లభిస్తుంది. దీనితో ప్లాస్టిక్, ఫైబర్ పార్టులకు మరింత సమగ్ర కవరేజీ ఉన్నట్లవుతుంది. కన్జూమబుల్ కవరేజి.. మీరు పూర్తి బీమా క్లెయిమ్ కోరుకునే వారయితే దీన్ని తీసుకోవచ్చు. వాహనంలో నట్లు, బోల్టులు, బ్రేక్ ఫ్లూయిడ్స్ మొదలైన వాటిని కన్జూమబుల్స్ భాగాలుగా వ్యవహరిస్తారు. చాలా మటుకు పాలసీల్లో ఇలాంటి వాటికి కవరేజీ ఉండదు. కాబట్టి ఇలాంటి కన్జూమబుల్ భాగాలకు కూడా బీమా రక్షణ ఉండేలా యాడ్-ఆన్ కవర్ తీసుకోవచ్చు. తాళం చెవులు పోతే.. మతిమరుపు వల్ల కావొచ్చు మరొకటి కావొచ్చు తరచూ తాళాలు పోగొట్టుకోవడం సమస్యయితే ఇందుకోసం కూడా ప్రత్యేకంగా కార్ కీ రీప్లేస్మెంట్ కవరేజీ లభిస్తుంది. కారు తాళం చెవి పోతే డూప్లికేట్ కీ తయారీకి, ఒకవేళ తాళం కూడా పాడైతే దాన్ని కూడా మార్చేందుకు అయ్యే ఖర్చును దీని కింద పొందవచ్చు. ఈ యాడ్-ఆన్ తీసుకుంటే రూ. 50,000 దాకా కవరేజీ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఒకో దఫాకి గరిష్టంగా రూ. 25,000 దాకా క్లెయిమ్‌కు అవకాశముంటుంది. భారీ వర్షాలు, వరదల నుంచి వాహనానికి రక్షణ.. చిన్నదైనా, పెద్దదైనా వర్షమొస్తే చాలు రోడ్లూ, ఇళ్లూ జలమయమైపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల వాహనాల్లోకి నీళ్లు వెళ్లిపోయి అవి కదలకుండా మొరాయిస్తుంటాయి. పోనీ అని నిండా నీళ్ల నుంచి దాన్ని బైటికి లాగేందుకు స్టార్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇంజిన్ దెబ్బతింటే బీమా కంపెనీలు దాన్ని స్వయంకృతం కిందే పరిగణిస్తాయి. దీనికి ఎలాంటి పరిహారం ఇవ్వవు. పోనీ సొంత డబ్బు పెట్టుకుని ఇంజిన్‌ను రిపేరు చేసుకోవాలనుకుంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కేందుకు హైడ్రోస్టాటిక్ లాక్ యాడ్ ఆన్ కవరేజీ ఉపయోగపడుతుంది. నీరు చొరబడటం వల్ల ఇంజిన్ భాగాలు పాడైతే వాటిని రిపేర్ చేసేందుకు లేదా రీప్లేస్ చేసేందుకు అయ్యే ఖర్చును ఈ యాడ్ ఆన్ కవర్ ద్వారా పొందవచ్చు. ఒకవేళ మీరు నివసించే ప్రాంతంలో వర్షమొస్తే మునిగిపోయే పరిస్థితులుంటే ఇలాంటి యాడ్ ఆన్ ఎంచుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్‌కు రక్షణ .. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేసేవారై ఉండి ఇన్సూరెన్స్‌ను ఇప్పటిదాకా క్లెయిమ్ చేయని పక్షంలో మీకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) భారీగానే లభించవచ్చు. అయితే, మీ టీనేజీ పిల్లలో లేదా సమీప బంధువులో మీ కారును తీసుకెళ్లి ఏ డ్యామేజీనో చేసి తీసుకొస్తే బీమా పరిహారం తీసుకోవాల్సి రావొచ్చు. ఫలితంగా ఎన్సీబీ ప్రయోజనాలను నష్టపోవాల్సి రావొచ్చు. ఇలాంటి సందర్భం ఎదురు కాకుండా ఎన్సీబీ ప్రొటెక్టర్ కవర్ తీసుకుంటే పాలసీ వ్యవధిలో రెండు పర్యాయాల దాకా నో క్లెయిమ్ బోనస్ పర్సంటేజీకి రక్షణ ఉంటుంది. దాదాపు 25 శాతం పైగా ఎన్సీబీ జమయిన వాహనదారులకు ఈ కవరేజీ ఉపయోగ కరంగా ఉంటుంది. ప్రయాణించే వారికి అదనపు భద్రత వాహనంలో ప్రయాణించే వారి వ్యక్తిగత భద్రతకు కూడా మోటార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవరేజీలు ఉన్నాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవర్: వాహనంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదవశాత్తు పాక్షికంగా లేదా పూర్తిగా వికలాంగులైనా లేదా ప్రమాదంలో మరణించినా .. ఈ కవరేజీతో గరిష్టంగా ఒక్కొక్కరికి రూ. 2 లక్షల దాకా పరిహారం లభిస్తుంది. హాస్పిటల్ క్యాష్: ఈ యాడ్-ఆన్ ఉంటే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షంలో రోజుకు రూ. 1,000 దాకా గరిష్టంగా 30 రోజుల వరకు నగదు పరిహారం లభిస్తుంది. అంబులెన్స్ చార్జెస్ కవర్: వాహనంలో ప్రయాణిస్తుండగా గానీ ఎక్కుతుండగా లేదా దిగుతుండగా గానీ ప్రమాదవశాత్తు పాలసీదారుకు తీవ్రగాయాలైతే ఆస్పత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్కయ్యే ఖర్చులు ఈ యాడ్ ఉంటే పొందవచ్చు. ఇలా..వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే పాలసీలను, యాడ్ ఆన్ కవరేజీలు తీసుకుంటే నిశ్చింతగా.. దూసుకుపోవచ్చు. -
బండికి... ఉండాలివి...
గత కొన్ని సంవత్సరాలుగా మోటార్ ఇన్సూరెన్స్‌లో అనేక సరికొత్త బీమా పథకాలు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కాని వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇవి పూర్తిస్థాయిలో వినియోగదారులను చేరువ కాలేదు. ఏదైనా కారు కొనగానే చట్టప్రకారం తీసుకోవాల్సిన థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటున్నారు. కాని ఈ ఒక్క పాలసీయే అన్ని రకాల బీమా రక్షణను అందించలేదు. అందుకనే ఇప్పుడు బీమా కంపెనీలు ‘యాడ్ ఆన్’ పేరుతో వివిధ రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రధాన పాలసీకి మరికొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా వీటిని పొందవచ్చు. యాడ్ ఆన్ కవర్లు, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం... ఫోన్ ద్వారా సాంకేతిక సహాయం: కార్లపై దూర ప్రయాణాలు చేసేవారికి ఇంజిన్‌లో వచ్చే సాంకేతిక లోపంతో బ్రేక్ డౌన్ అవడం వంటి సంఘటనలు తరుచుగా చూస్తూనే ఉంటాం. తెలియని ప్రాంతంలో కారు బ్రేక్‌డౌన్ అయ్యి, దగ్గర్లో మెకానిక్ లేకపోతే... పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిన్న సాంకేతిక సమస్యలైతే మనం చేసుకోవచ్చు.. కాని అదే తెలియనిది అయితే... ఇలాంటి సమయంలో ఈ యాడ్ ఆన్ కవర్ అక్కరకు వస్తుంది. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇలాంటి చిన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది ఫోన్ ద్వారా సూచనలు అందించడం జరుగుతుంది. తక్షణం రిపేర్లు: ఒకవేళ బ్యాటరీ అయిపోయి కారు ఆగిపోయిందనుకుందాం. అలాంటి సందర్భాల్లో బ్యాటరీ లేకుండా కారును స్టార్ట్ చేయాలంటే శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు అవసరం. ఇలాంటప్పుడు కావల్సిన ఎక్స్టర్నల్ పవర్‌ను బీమా కంపెనీ తక్షణమే ఏర్పాటు చేస్తుంది. అవసరమైతే అద్దె కారు: ఒకవేళ కారును తక్షణం రిపేరు చేసే పరిస్థితి లేకపోతే బీమా కంపెనీ అద్దె కారును ఏర్పాటు చేసి గమ్యానికి క్షేమంగా చేరుస్తుంది. టోయింగ్ వెహికల్: ఇలా కారు మధ్యలో ఆగిపోతే దాన్ని షెడ్డుకు చేర్చడమన్నది అన్నిటికంటే చాలా క్లిష్టమైన, వ్యయంతో కూడిన పని. ఇందుకు టోయింగ్ మెషిన్ అవసరం. అదే యాడ్ ఆన్ రైడర్ తీసుకుంటే ఈ ఏర్పాట్లను బీమా కంపెనీ ఉచితంగా అందిస్తుంది. వసతి ఏర్పాటు: అవసరమైన పక్షంలో సమీప ప్రాంతంలో వసతిని కూడా ఏర్పాటు చేస్తుంది. వాన నీటిలో ఆగిపోతే: ఇంజిన్లోకి నీరు వెళ్లి కారు ఆగిపోతే... అటువంటి వాటికి సాధారణ పాలసీలో కవరేజ్ ఉండదు. అదే యాడ్ ఆన్ కవర్ తీసుకుంటే ఇలాంటి సమస్యలకి కూడా బీమా రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది అక్కరకు వస్తుంది. మారు తాళం: ఒకవేళ కారు తాళాలు పోగొట్టుకుంటే... మీరున్న చోటుకు బీమా కంపెనీ డూప్లికేట్ తాళాలను పంపించడం లేదా, నిపుణులతో అన్‌లాక్ చేసి కారును తెరిపించే వెసులుబాటు చేస్తుంది.