breaking news
abhisaravanan
-
నా భార్య తిరిగొస్తే ఏలుకుంటా: నటుడు
చెన్నై, పెరంబూరు: తన భార్య, నటి అతిథిమీనన్ మంచిగా మారి తిరిగొస్తే ఆమెను ఏలుకుంటానని నటుడు అభిశరవణన్ అన్నారు. భార్యభర్తల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, కేసులు, కోర్టులు అంటూ వివాదం జరగుతున్న విషయం తెలిసిందే. ప్రేమించుకుని, పెళ్లి (రిజిస్టర్ మ్యారేజ్) చేసుకుని మూడేళ్లు కలిసి సంసారం చేసిన ఈ సంచలన జంట మూడు నెలల క్రితం విడిపోయారు. దీంతో తన భార్యను తనతో కలపాల్సిందిగా నటుడు అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈయన్ని వదిలి వెళ్లిన నటి అతిథిమీనన్ సుజిత్ అనే వ్యాపారవేత్త కొడుకుతో కలిసి ఉంటోందట. ఇటీవల సుజిత్ తనతో మరో ఇద్దరు వ్యక్తులను తీసుకుని అర్ధరాత్రి అభిశరవణన్ ఇంటికి వచ్చి మాట్లాడదాం అని చెప్పి కారులో తీసుకుపోయారు. దీంతో అతన్ని కిడ్నాప్ చేశారనే ప్రచారం జరిగింది. ఈ సంఘటనపై అభిశరవణన్ సాలిగ్రామం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం నటి అతిథిమీనన్ కూడా అభిశరవణన్‌పై చెన్నై, వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో అభిశరవణన్ తనతో పెళ్లి అయినట్లు నకలీ ధ్రువపత్రాలను సృష్టించాడంటూ ఆరోపణలు చేసింది. దీంతో నటుడు అభిశరవణన్ బుధవారం మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా అతిథిమీనన్‌కు తనకు చట్టబద్ధంగా పెళ్లి అయినట్లు రిజిస్టర్ చేసిన ధ్రువపత్రాలు తన వద్ద ఉన్నాయని, తాము 2016 జూన్ 9న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు వెల్లడించాడు. అతిథిమీనన్ తాను కలిసి పట్టాదారి అనే చిత్రంలో నటించినప్పుడు పరిచయం జరిగిందని తెలిపాడు. ఆ తరువాత తను నడునల్వాడై చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర దర్శకుడితో సమస్య ఎదురుకావడంతో ఆయనపై లైంగిక వేధింపులంటూ అతిథిమీనన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నాడు. నడునల్వాడు దర్శకుడితో గొడవ జరిగినప్పుడు భయపడి తనను రక్షణ కోరడంతో ఆమెను మదురైలోని తన ఇంటికి తీసుకెళ్లి రక్షణ కల్పించినట్లు చెప్పాడు. దీంతో అతిథిమీనన్ తనపై ప్రేమ పెంచుకుని ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతి తీసుకుందని చెప్పాడు. దీంతో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అప్పుడు అతిథిమీనన్ తల్లిదండ్రులు విదేశాల్లో ఉండడంతో వీడియో ద్వారా వారి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపాడు. అలా పెళ్లి చేసుకుని చెన్నైకి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని మూడేళ్లు కలిసి సంసారం చేశామని, ఆ సమయంలో కేరళలో ఉన్న అతిథిమీనన్ తల్లిదండ్రుల ఇంటికి పదిసార్లుకు పైగా వెళ్లి అక్కడ గడిపి వచ్చామని చెప్పాడు. అలాంటిది మూడు నెలల క్రితం తాను గజ తుపాన్ సంఘటనతో చలించి సామాజిక సేవకు సిద్ధం అయ్యానన్నాడు. ఆ సమయంలో ఇంటిలో లేని సమయం చూసి అతిథిమీనన్ ఇంటిలో ఉన్న డబ్బు, నగలు, విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయిందన్నాడు. ఆమె ప్రస్తుతం సుజిత్ అనే వ్యాపారవేత్త కుమారుడితో కలిసి ఉంటున్నట్లు తెలిసిందన్నాడు. ఆమెను కలిసి మాట్లాడాలని ప్రయత్నించినా పక్కనున్న సుజిత్ అతని అనుచరులు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. అతిథిమీనన్ కొచ్చిలో ఉండగానే ఒక యువకుడితో సహజీవనం చేసిందని, అదే విధంగా కేరళలో మరో వ్యక్తిని ప్రేమించి అతన్ని మోసం చేసి చెన్నైకి వచ్చేసిందని చెప్పాడు. ఆ వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపాడు. అలాంటిది తాను సామాజిక సేవ పేరుతో డబ్బులు వసూలు చేసి ఇల్లు, కార్లు కొనుక్కున్నానని ఆరోపణలు చేస్తోందని అన్నాడు. తాను సేవాకార్యక్రమాల కోసం సేకరించిన ప్రతి పైసాకు బ్యాంకు స్టేట్మెంట్తో సహా లెక్కలు ఉన్నాయని మీడియాకు ఆధారాలు చూపించాడు. అతిథిమీనన్ తనపై పెట్టిన కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని అన్నాడు. అదేవిధంగా తప్పులు ఎవరైనా చేస్తారని, గడిచిన కాలాన్ని మరచిపోయి తను మనసు మార్చుకుని తిరిగి వస్తే తాను ఆమెను ఏలుకుంటానని నటుడు అభిశరవణన్ పేర్కొన్నారు. -
గంజాయి తోటల నేపథ్యంగా సురావళి
తమిళసినిమా: గంజాయి తోటల నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రం సురావళి. సాధారణంగా మలయాళ చిత్ర దర్శకులకు తమిళంలో చిత్రాలు చేయాలన్న ఆసక్తి మెండుగా ఉంటుంది. అలా ఇప్పటికే పలువురు మలయాళ దర్శకులు తమిళంలో చిత్రాలు చేసి విజయం సాధించారు. ఆ కోవలోకి కుమార్నందా చేరుతున్నారు. మలయాళంలో కొట్టారత్తిల్ కుట్టి భూతం, ముళ్లచేరి మాధవన్ కుట్టి నెమం పీఓ వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా ప్రముఖ మలయాళ బుల్లితెర నటి ప్రత్యూష జీవిత కథతో తమిళంలో అగధి పేరుతో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా మరో చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి సురావళి అనే పేరును నిర్ణయించారు. గోల్డెన్ వింగ్స్ పతాకంపై శ్యామ్మోహన్ నిర్మిస్తున్న ఇందులో తొట్టాల్ తొడరుమ్ చిత్రం ఫేమ్ తమన్‌కుమార్, పట్టాదారి చిత్రం ఫేమ్ అభిశరవణన్ కథానాయకులుగా నటించనున్నారు. మనీషాజిత్ కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని రామ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది గంజాయి ముఠాకు, వారిని పట్టుకోవాలనే పోలీసులకు మధ్య జరిగే ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఈ నెల 15వ తేదీ నుంచి కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు కుమార్నందా వెల్లడించారు.