ఎన్నాళ్లీ ఎదురు చూపులు

government school uniforms not reached still seventh month running - Sakshi

ఏడు నెలలుగా అందని ఏకరూప దుస్తులు

మరో మూడు నెలల్లో ముగియనున్న విద్యా సంవత్సరం

అధికారుల నిర్లక్ష్యమా.. ప్రభుత్వ వివక్షనా..?

కడప ఎడ్యుకేషన్‌: గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు (యూనిఫాం) ఉచితంగా అందజేస్తోంది. అయితే యూనిఫాం విద్యార్థులకు సకాలంలో అందలేదు. దీంతో వారిమధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. ఇందంతా అధికారుల తప్పిదం కాదు.. యూనిఫాం గుడ్డలో ప్రభుత్వ పెద్దల (అధికారపార్టీ నేతలు) కమీషన్ల కక్కుర్తితో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు చర్యలు జోరుగా జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడి నియోజక వర్గంలోనే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంటే మిగతా ప్రాంతాల పరిస్థితేంటని పలువురు  విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి ప్రతి విద్యార్థికి యూనిఫాం, పాఠ్యçపుస్తకాలు అందించాల్సి ఉంది.

పాఠశాలలు తెరుచుకున్న రెండు నెలలకు గానీ విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందడం లేదు. దీంతో నాయకులకు ప్రభుత్వ విద్యపైన ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉంది.  అధికార పార్టీకి చెందిన పెద్దలు వేదికలెక్కినప్పుడు మాత్రం  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రతి ఒక్కరికి గుణాత్మక విద్యనందిస్తామని ఊపుదంపుడు ఉపన్యాసాలను చేస్తారు. కానీ అది కింది స్థాయిలో ఏ మాత్రం అమలు జరగడం లేదనేది జగమెరిగిన సత్యం. రోజురోజుకు ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్యం ఎక్కువవుతోందనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి ప్రాతినిథ్యం వహించిన రాజంపేట మండలంలో చోటుచేసుకుంది.

రాజంపేటలో 109 పాఠశాలలకు
రాజంపేట మండలంలో 109 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో  6,771 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒకొక్కరికి రెండు జతల చొప్పున 13,542 జతలు యూనిఫాం అందాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఒక్క పాఠశాలకు కూడా ఒక్క జత కూడా  అందలేదు. ఇందుకు ఇప్పటివరకూ బట్ట రాకపోవడమే కారణమని తెలుస్తోంది.

పాఠశాలలు తెరుచుకున్న మూడు నెలలకు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకున్న మూడు నెలలకు కానీ యూనిఫాం అందలేదు. అనంతరం మొదటగా 12 మండలాల్లోని పాఠశాలలకు యూనిఫాంను అందజేశారు. ఆ తర్వాత నెలరోజులకు మరో 6 మండలాలు కలుపుకుని 18 మండలాలకు యూనిఫాం అందజేశారు. అనంతరం నవంబర్, డిసెం బర్‌ నెలల్లో మరికొన్ని పాఠశాలలకు ఇలా.. జనవరి ముగిసేనాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,145 పాఠశాలలకు గానూ 3,036 పాఠశాలలకు ఏకరూప దుస్తులను అందజేశారు. అలాగే పాఠ్యపుస్తకాలు కూడా అందాయి.

మాకు ఇంకా ఇవ్వలేదు..
మా పాఠశాలలో పుస్తకాలు ఇచ్చిండ్రు.. కానీ యూనిఫాం ఇవ్వలేదు. అయ్యవార్లను అడిగితే పై నుంచి బట్ట రాలేదంటాండ్రు. ఎప్పుడిస్తారో ఏమో. రోజు మామాలు దుస్తులే వేసుకుని వస్తున్నాం.
– సంతోష్, 5వ తరగతి,  శేషన్నగారిపల్లె

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top