టీడీపీ పాలనలో ప్రజలకు తీరని అన్యాయం

YSRCP Leader Majji Srinivasa Rao Fire On Chandrababu - Sakshi

హామీలు మరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రైతులు, యువత పట్ల నిర్లక్ష్యం తగదు

వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ, 

వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు

విజయగనరం మున్సిపాలిటీ: నాలుగేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ, వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆరోపించారు. ఆదివారం స్థానిక సత్య కార్యాలయంలో పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్,  అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షత్‌ రాజ్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి గృహæనిర్మాణ లబ్ధిదారుల ఎంపిక జాబితాను మంత్రి సుజయ్‌ ఇప్పటికీ అధికారులకు అందజేయకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులతో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారన్నారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నేటికీ నెరవేర్చలేదని తెలిపారు. అలాగే గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తాము పండించిన ఉత్పత్తులను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వ అధ్వాన పాలనపై రెండో తేదీ నుంచి జరగనున్న జన్మభూమి సభల్లో ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు.  

 హమీలు బుట్టదాఖలు.. 
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు ప్రకటించిన వరాలు నేటికీ అమలు కాలేదన్నారు. వైద్య కళాశాలను జిల్లాకు రాకుండా కేంద్ర మంత్రి అశోక్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే గిరిజన యూనివర్సిటీ , రైల్వేజోన్, ప్రత్యేక హోదాల ఊసే మరచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ నాయకులు హయాంలో జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. తోటపల్లి, తారకరామతీర్థసాగర్‌ పనులు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు తోటపల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను తొంభైశాతం పూర్తి చేయగా, మిగిలిన పది శాతం పనులు చేపట్టిన టీడీపీ నాయకులు అంతా తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  

తోటపల్లి నుంచి నీరు తెస్తామనడం హాస్యాస్పదం..
విజయగనరం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చొల్లంగి పేట నుంచి రూ. 30 కోట్లతో పైప్‌లైన్లు వేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అప్పట్లో ఆలోచిస్తే.. పరస్తుత మంత్రులు తోటపల్లి నుంచి పట్టణానికి తాగునీటిని తెస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన భూములను పాలకులు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో జూట్‌తో పాటు పలు పరిశ్రమలు మూతపడి నాలుగేళ్లు కావొస్తున్నా వాటిని తెరిపించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. 

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 115 జిల్లాలను వెనుకబడిన వాటిగా గుర్తించగా విజయనగరం జిల్లా అందులో అత్యంత వెనుకబడినదిగా ఉందన్నారు. విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ,  రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అరుకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రజలకిచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదన్నారు. సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ వెంకటరమణరాజు, జిల్లా నాయకులు పిళ్లా విజయకుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, జిల్లా కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాడు అప్పారావు, డోల మన్మధకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top