ఈ ఆటలు చాలించండి

ఈ ఆటలు చాలించండి


ఆటగాళ్ల ఎంపిక మొదలుకొని వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడం వరకూ అన్నిటా విఫలమవుతూ అంతర్జాతీయ వేదికల్లో దేశాన్ని నగుబాటుపాలు చేస్తున్న ధోరణులపై సమీక్ష జరిగి కాస్తయినా మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న క్రీడాభి మానులను తీవ్రంగా నిరాశపరిచిన సందర్భమిది. కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణలో భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చిన సురేష్‌ కల్మాడీని, అలాంటి ఆరోపణలతోనే పదవి పోగొట్టుకున్న అభయ్‌ చౌతాలనూ ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం తీసుకున్న నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వారిద్దరిపై వచ్చిన ఆరోపణలు చిన్నవేమీ కాదు. ఆ కేసులు ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. అటు 2012–14 మధ్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు అభయ్‌ చౌతాలపై వచ్చిన ఆరోపణల విషయంలో సకాలంలో చర్య తీసుకోనం దుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) ఐఓఏను కొంతకాలం సస్పెన్షన్‌లో కూడా ఉంచింది.ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుండి వారిద్దరికీ పదవులను కట్టబె ట్టడం ద్వారా ఐఓఏ దుస్సాహసానికి పాల్పడింది. గౌరవాధ్యక్ష పదవి అనేది కేవలం నామమాత్రమే కావొచ్చు. ఆ పదవిలో ఉన్నవారికి ఓటింగ్‌ హక్కు లేకపోవచ్చు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అలాంటి నామ మాత్ర పదవికి ఎంపిక చేయడం కూడా తీవ్ర తప్పిదమని అనిపించకపోవడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఈ నిర్ణయంపై రేగిన దుమారానికి జడిసి...దాన్ని వెనక్కు తీసుకోనట్టయితే ఐఓఏతో తెగదెంపులు చేసుకుంటామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేసిన హెచ్చరిను గమనించి సురేష్‌ కల్మాడీ ఆ పదవి తీసుకోవడంలేదని ప్రకటించారు. అయితే అభయ్‌ మాత్రం ఇంకా బెట్టు చేస్తున్నారు. జీవితకాల గౌరవాధ్యక్ష పదవి స్వీకరించడానికి తనకు అన్ని అర్హతలున్నాయని వాదిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం కాదంటేనే ఆ పదవిని తీసుకోవడం విరమించుకుంటానని మెలిక పెడుతున్నారు.దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంపై ఐఓఏకు ఏనాడూ శ్రద్ధ లేదు. ఔత్సాహికుల్లో మెరికల్లాంటివారిని గుర్తించి వారిని మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన యజ్ఞంలో నిమగ్నం కావలసిన ఆ సంఘం తాము ఆడిందే ఆటగా నడుస్తోంది. ఆ విషయంలో సరిదిద్దుకోవాల్సిందిపోయి ఆరోపణ లొచ్చినవారిని ఇంత అత్యవసరంగా పదవులిచ్చి నెత్తినపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌ చెప్పగలరా? మొన్న ఆగస్టులో రియో డీ జనిరోలో జరిగిన ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల వైఫల్యం అందరికీ తెలుసు. ఈసారి పెద్ద సంఖ్యలో క్రీడాకారుల బృందాన్ని పంపుతున్నామని, మనకు పత కాలు రావడం గ్యారెంటీ అని ఐఓఏ చాటింపు వేసింది. కానీ కడకు దక్కినవి రెండంటే రెండే పతకాలు! పీవీ సింధు వెండి పతకాన్ని, సాక్షి మాలిక్‌ కంచు పతకాన్ని గెల్చుకోగా తొలిసారి మహిళా జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశించిన దీపా కర్మాకర్‌ త్రుటిలో పతకం పోగొట్టుకుంది. ఈ దుస్థితికి ఒక్క ఐఓఏను నిందించి మాత్రమే ప్రయోజనం లేదు.క్రీడాభివృద్ధికి ఇతర దేశాలు చేసే వ్యయం ముందు మనం తీసికట్టుగా ఉన్నామన్నది వాస్తవం. కేంద్రం ప్రభుత్వంగానీ, రాష్ట్రాలుగానీ క్రీడలపై అనురక్తిని ప్రదర్శించడం లేదు. గెలిచినవారికి భారీయెత్తున నజరానాలు ప్రకటించే అలవాటున్న ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్‌లలో క్రీడలకు తగిన నిధుల్ని కేటా యించడంలో మొహం చాటేస్తున్నాయి. అమెరికాలో క్రీడలకు తలసరి రూ. 22 రూపాయలు, బ్రిటన్‌ 50 పైసలు ఖర్చు చేస్తుంటే మన దేశం మాత్రం ముష్టి మూడు పైసలతో సరిపెట్టుకుంటోందని స్వయానా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పార్లమెంటు స్థాయీ సంఘానికి రెండేళ్లక్రితం తెలిపింది. ఆఖరికి జమైకా లాంటి చిరు దేశం కూడా తలసరి 19 పైసలు ఖర్చుచేస్తోంది. మరి మనకేమైందో అర్ధం కాదు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం క్రీడా స్థలాన్ని స్థాయీ సంఘం సందర్శించినప్పుడు అక్కడంతా గోతులమయంగా ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకిలా అని అడిగితే ఒకటే జవాబు–నిధుల కొరత! ఉన్న నిధు లనైనా సక్రమంగా ఖర్చు చేయకుండా ఎంతసేపూ కీచులాటల్లో నిమగ్నమయ్యే క్రీడా సంఘాలు ప్రతిభ గల క్రీడాకారులను నీరసపరుస్తున్నాయి.రియో ఒలింపిక్స్‌లో అద్భుత క్రీడా పాటవాన్ని ప్రదర్శించి కొద్దిలో పతకాన్ని చేజార్చుకున్న దీపా కర్మాకర్‌ మన జాతీయ క్రీడా సమాఖ్యలు ఎలా నడుస్తు న్నాయో, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ఎలా వేధిస్తు న్నాయో కుండబద్దలు కొట్టింది. ఈ స్థితి మారకపోతే మనకు పతకాలు రావడం దుర్లభమని హెచ్చరించింది. కానీ ఈ విషయంలో ఐఓఏతో సహా ఎవరూ దృష్టి పెట్టలేదు. క్రీడల్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి వాటిని అందుకునేలా క్రీడా కారుల్ని ప్రోత్సహించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రధానంగా ఐఓఏది. ఈ క్రమంలో తమ కెదురవుతున్న అవరోధాలేమిటో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు అది చెప్పవలసి ఉంది. వీరిద్దరూ, జాతీయ క్రీడా సమాఖ్య వంటివి ఈ పరిస్థితులపై కూలంకషంగా సమీక్షించి లోటుపాట్లను చక్కదిద్దాల్సి ఉంటుంది.వీరందరూ కలిసి కూర్చుని ఆ పని చేయడం మానుకుని ఎవరికి వారే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈలోగా ఐఓఏ ఇప్పుడీ చవకబారు నిర్ణయం తీసుకుని పరువు పోగొట్టుకుంది. ఒకపక్క బీసీసీఐ కేసులో క్రీడలకు రాజకీయ నాయకుల్ని దూరం పెట్టాలని సుప్రీంకోర్టు హితవు చెబితే... ఆ స్ఫూర్తికి భిన్నంగా వ్యవ హరిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా ఐఓఏకు లేకపోయింది. ఇప్పుడీ వివాదం ఎటూ తలెత్తింది గనుక ఐఓఏ పనితీరును, మొత్తంగా దేశంలో క్రీడల స్థితిగతులను సమీక్షించి 2020లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ నాటికి మన దేశ క్రీడారంగాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఖరారు చేయాలి. అంతకన్నా ముందు కొత్త సంవత్సరం వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. వాటన్నిటా మన క్రీడాకారులు మెరుగైన ఫలితాలు ప్రదర్శించగలిగితేనే టోక్యో ఒలింపిక్స్‌పై కాస్త యినా ఆశలు చిగురిస్తాయన్న సంగతి గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.

 

 

Back to Top