గ్రామీణ ఆవిష్కర్తలకు జేజేలు!

గ్రామీణ ఆవిష్కర్తలకు జేజేలు!


వ్యవసాయదారులు, గ్రామీణుల అభివృద్ధికి తోడ్పడే వినూత్న ఆవిష్కరణలను వెలువరించిన వారిని గుర్తించి, సముచిత రీతిలో ప్రోత్సహించడం అత్యవసరం. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌.ఐ.ఆర్‌.పి.ఆర్‌.)  ఈ విషయాన్ని గుర్తించి.. గత నెల 23,24 తేదీల్లో తొట్టతొలి సారిగా జాతీయ స్థాయి గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శనను హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇన్నోవేటర్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పార్వతీపురానికి చెందిన రైతు శాస్త్రవేత్త డి. బాబూరావుకు రూ. 50 వేల బహుమతి లభించింది. గ్రామీణ రైతు శాస్త్రవేత్తల ఆవిష్కరణలను డిజైన్‌ పరంగా అభివృద్ధి చేసి, వాటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్‌.ఐ.ఆర్‌.పి.ఆర్‌.లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం విశేషం. అక్కడ ప్రదర్శించిన కొన్ని వ్యవసాయ సంబంధిత ఆవిష్కరణల గురించి ఇక్కడ ముచ్చటించుకుందాం..



మొక్కజొన్న ఒలిచే / చెరకు ముచ్చెలు కత్తిరించే యంత్రం

రైతు శాస్త్రవేత్త డి. బాబూరావు స్వస్థలం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. బహుళ ప్రయోజనకారి అయిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డ్రమ్‌సీడర్‌ను గతంలో ఆవిష్కరించి పేరుగడించిన ఆయన తాజాగా.. ఒకేసారి నాలుగు మొక్కజొన్న పొత్తుల్లో నుంచి గింజలు ఒలిచే యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రానికి చిన్న బ్లేడ్లు మార్చుకొని.. చెరకు ఒంటికన్ను ముచ్చెలను లేదా 3 అంగుళాల ముక్కలను కత్తిరించడానికి కూడా వినియోగించుకోవచ్చు. బరువు 20 కిలోలు కావడంతో ఎక్కడికైనా, కొండల మీదికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. ఖరీదు రూ. 16 వేలు.



చెరకు విత్తన మార్కర్‌ : దీనితోపాటు చెరకు విత్తన మార్కర్‌ను సైతం బాబూరావు రూపొందించారు. చెరకు సాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. చెరకు మొక్కలను విడి విడిగా కాకుండా.. 14 అంగుళాల రింగ్‌లో 4 చెరకు ముచ్చెలను నాటాలి. రింగ్‌కు రింగ్‌కు మధ్య 3 అడుగుల దూరం ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాలులకు చెరకు పడిపోకుండా ఉంటుంది. ఎకరానికి కనీసం 300 కిలోల చెరకు విత్తనం సరిపోతుంది. బాబూరావును 94409 40025 నంబరులో సంప్రదించవచ్చు.

– సేకరణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

ఫొటోలు : కందల రమేష్‌బాబు, సీనియర్‌ ఫొటో జర్నలిస్టు




మండే ఎండల్లో చెమటను చిందించే మహిళా రైతులకు గొడుగుల ద్వారా నీడ కల్పిస్తే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని అంటున్నారు రేపల్లె షణ్ముఖరావు (94921 13609). మహబూబ్‌నగర్‌ జిల్లా కంబాలపల్లి ఆయన స్వస్థలం. ఇందుకోసం రెండు రకాల పెద్ద గొడుగులను ఆయన రూపొందించారు. సాళ్ల మధ్యలో ఈ గొడుగును నిలబెట్టి.. దీని నీడలో మహిళలు పనులు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ముందుకు జరుపుకోవచ్చు. దీని ధర రూ. 1,500. ప్రతిసారీ జరుపుకోనవసరం లేకుండా.. సౌరవిద్యుత్‌తో నడిచే సెన్సర్ల ద్వారా దానంతట అదే ముందుకు జరిగే ఆటోమేటిక్‌ గొడుగును కూడా ఆయన రూపొందించారు. దీని ధర రూ. 5,000.



పురుగు పట్టనివ్వదు!

ఎటువంటి రసాయనాలు కలపకుండా వ్యవసాయోత్పత్తులను నిశ్చింతగా భద్రపరచుకునేందుకు ఉపయోగపడే సురక్షితమైన ప్లాస్టిక్‌ సంచులను మహారాష్ట్ర పుణేకి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్‌ షా రూపొందించారు. 70 మైక్రాన్ల మందాన ఉండే పారదర్శకమైన ఫుడ్‌ గ్రేడ్‌ ప్లాస్టిక్‌ సంచులలో నింపి బియ్యం, పప్పులు, ఇతర ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చంటున్నారు. ఇథనాల్‌ వెనాల్‌ ఆల్కహాల్‌ (ఇ.వి.ఓ.హెచ్‌.) అనే అత్యాధునిక జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. రెండేళ్లపాటు నిల్వ చేసినా ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలకు పురుగు పట్టదని, పోషకాల నష్టం జరగదని, రుచి, రంగు మారదని షా చెబుతున్నారు. ఇంట్లో, గోదాముల్లో వ్యవసాయోత్పత్తుల నిల్వకు ఈ సంచులు ఉపకరిస్తాయని, ఎన్నేళ్లయినా పునర్వినియోగానికి అనుకూలంగా ఉంటాయన్నారు. ఒక సంచి ధర రూ. 70. తమిళనాడు తంజావూరులోని భారతీయ పంట పరిరక్షణ సాంకేతికతా సంస్థ (ఐ.ఐ.సి.పి.టి.)తోపాటు ఎఫ్‌.డి.ఎ., సి.ఈ. వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ సంచుల నాణ్యతను నిర్థారించాయని షా చెబుతున్నారు. వివరాలకు 098220 12969, 020672 73830 నంబర్లలో సంప్రదించవచ్చు.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top