 
															డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?
విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడటం కొత్తేం కాదు.
	ముంబై: విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడటం కొత్తేం కాదు. కాకపోతే ఈసారీ డస్టబిన్‌లో దొరికింది. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డస్ట్‌బిన్‌లో పెద్ద మొత్తంలో బంగారం లభ్యమయింది.  సాధారణ తనిఖీల్లో భాగంగా ఎయిర్‌పోర్టు కస్టమ్స్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు సోదాలు చేపట్టారు.
	
	పురుషుల టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో సుమారు 2.3కిలోల బంగారు ఆభరణాలు, కడ్డీలను అధికారులు  గుర్తించారు. వీటి విలువ రూ.70లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. వీటిని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించి ఉంటారని,  అది వీలుకాకపోవడంతో అక్కడే వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. సీసీ ఫుటేజిలను పరిశీలించిన అనంతరం కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
